Monday, September 3, 2012

చెరబండరాజు విప్లవ కవితలు, పాటలు

చెరబండరాజు  కవితలు, పాటలు

చెరబండరాజు1                                దిగంబరకవులతో మహాకవి శ్రీశ్రీ -                                        చెరబండరాజు2
                                            ఎడమనుండి కుడికి: జ్వాలాముఖి, నగ్నముని, శ్రీశ్రీ,                            
                                                                          నిఖిలేశ్వర్‌, చెరబండరాజు

విప్లవ కవుల్లో విశిష్టమైన వ్యక్తిత్వంగల మహాకవి చెరబండరాజు 38 ఏళ్ల చిరుప్రాయంలోనే అస్తమించాడు. కాని విప్లవమార్గం చేపట్టి కొనసాగిన కొన్ని ఏళ్ల కాలం లోనే ఆయన రాసిన అనేక కవితలు, ముఖ్యంగా పాటలు తెలుగు ప్రగతిశీల ప్రజానీకాన్ని ఉర్రూతలూగించాయంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహాకవి కవితలు, పాటలు ఎంపిక చేసి కొన్ని యిక్కడ యిస్తున్నాము. మన బ్లాగు పాఠకులు వీటిని విశేషంగా ఆదరిస్తారని ఆశిస్తాం:

దిక్‌సూచి
చెరబండరాజు
"ఏటికేతం బెట్టి
ఎయిపుట్లు పండించి
గంజిలో మెతుకెరగనన్నా – నేను
కూటిలో మెతుకెరగనన్నా
"
అంటూ డెబ్భై ఏళ్ల కర్షక జీవితంలో
ఈ పాటే పాడుకుంటూ కన్ను మూసిన
నాన్న కి
ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970
1. వందే మాతరం
నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది
అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టుపెట్టిన అందం నీది
సంపన్నుల చేతుల్లో మైమరిచి నిద్రిస్తున్న యవ్వనం నీది

ఊసినా దుమ్మెత్తిపోసినా చలనంలేని మైకం నీది
కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న
ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న 'భారతి' వమ్మా
నోటికందని సస్యశ్యామల సీమవమ్మా
వందే మాతరం వందే మాతరం

ఒంటిమీది గుడ్డలతో జండాలు కుట్టించి
వివస్త్రవై ఊరేగుతున్న దైన్యం నీది
అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో
కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది
ఎండిన స్తనాలమీదికి ఎగబడ్డ బిడ్డల్ని
ఓదార్చలేని శోకం నీది
ఆకలికి ఎండి ఎండి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది
అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ
వందే మాతరం వందే మాతరం

దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970, హైదరాబాదు నుండి...
2. నన్నెక్కనివ్వండి బోను

నల్లకోట్లు నీలిరంగు నోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యే కేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను

నలుగురి నమ్మికతో 'అమ్మా ' అని పిలవడం తప్ప
నవమోసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను
సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను

మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను
కలాలు కాగితాలు సర్దుకోండి
లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి?
మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్, మస్జిద్, చర్చి,
మతాధికారుల మతాలు యెందుకు?
ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను

తిన్నయింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్?
మంచి మనసు పరిమళాలు
విశ్వవ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్ని కణం
చల్లారక రగులుతోంది
నన్నెక్కనివ్వండి బోను

తీర్పు మీది జైలు మీది
భయపడతారెందుకు
మీ మనస్సౌధాల నిండా
తరగని తరతరాల బూజు
అనుక్షణం చచ్చే ప్రియత్వం
కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా!
నరుక్కోరెందుకు తలలు
గది నాల్గు గోడలు కూల్చివేసి
దిశలు నాల్గుగా మార్చుకోండి
ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు?
నాకు తెలుసు
మీ రాత్రి చొక్కాలు పగళ్ళు నిలవవు
పగటి చొక్కాలు రాత్రుళ్లుండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు
పాతికచీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంటగది ఆలోచనలకు
ఎసర్లు పెడుతున్న వాళ్ళు
మీ వాగ్దానాలు పుచ్చుగింజలు
మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షో లో
మోడల్‌గా పనికొస్తున్న వాళ్లు

ఛీ, ఛీ యెవరు మీరు?
నవ్వుతా రెందుకు?
నీవు నేను కలిసి యెదుటివాని పిలుపుకు
'మీరు ' గాక ఏమౌతాం?
నీ గుండెలు, నా గుండెలు
మూతబడిన కొండగుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను

ఈ సువిశాలప్రపంచ జీవశాలలో
సిసలైన న్యాయస్థానం ఎక్కడైనా వుంటే
నన్నెక్కనివ్వండి బోను

నా గుండెలు పిండుకునే
కొండల్లాంటి సందేహాలు...
విశ్వశాంతి మన ధ్యేయం
యుద్ధాలకు పరిమితమా?
అబద్ధమా యీ వేదన?
మాంసం ముద్దలుగా మనుషులు
శిశువులుగా జన్మించుట ఏ దేశంలో లేదు
ఏ దేశంలో నైతేనేమి?
అర్ధరాత్రి పడగ్గదుల
అంతరార్థమొకటే గద!
ప్రపంచ మొక నగ్నశిలా
ఫలకము వలె కనిపిస్తున్నది
భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను
అంటాను అంటున్నాను
అనుకుంటూనే వస్తున్నాను
అందుకే నన్నెక్కనివ్వండి బోను
* * * * *
3. చితి పేర్చుకుందాం
4. చూడలేను
5. ఇంకా నువ్వింకా బానిసవే
6. నీరో సంతతి
7. జవాబు
8. ఆకాశం వెక్కి వెక్కి ఏడుస్తోంది
9. ఊబి
10. కో
11. నా మనుష్య ప్రపంచంలోకి 
12. ఫో
13.  అన్నీ మరణాలే 
14. కాంతి పాదాలు
15. ఆత్మ దిక్
16. నా ఆకాశం
17. రా!
18. దిగంబర సమాజంకోసం
దిగంబర సమాజం కోసం
భుజాలు జార్చుకొని
మర్రి ఊడల్లా చేతులు వేలాడేసి
ఒంగి ఒంగి మట్టి కరుస్తూ నడుస్తోన్న
కుంటి వ్యవస్థను నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
చాకులా వెన్నెముక ఉంటే
కంఠ కంఠాలలో నిప్పు రగల్చమంటున్నా

నపుంసక మానసిక అంటువ్యాధి
ముందు తరాలకు అంటకుండా
తలవంచుక వెళ్ళిపోదామనే తార్పుల
అగ్ని కీలలలో తలకిందులుగా నిలెయ్యమంటున్నా

ఈ అవ్యవస్థ వ్యవస్థాపకుల్ని
ఇంకా ఇంకా బజార్ల కీడ్చి
చౌరస్తాలోకి వీలుగా చేరెయ్యమంటున్నా
పొద్దుపొడుపుతో మోసగించి మతాలు
గానుగెద్దులుగా మార్చిన రాజకీయాలు
పశుత్వం మిగిల్చిన జాతిద్వేషాలు
దుర్గంధం కక్కిన సిద్ధాంతాలు
నిన్నూ నన్నూ ఇన్నాళ్లూ కమ్ముకున్నాయ్
వ్యవస్థేదీ మిగల్లేదు

అందుకే
ఈ కుంటి జీవచ్ఛవాన్ని నిలబడిన చోటే
గొయ్యి తవ్వి పాతెయ్యమంటున్నా
* * * * *
19. నిమిషం నిమిషం ఒక నిమిషం
20. కుక్కల మేళం
21. యాభై కోట్ల మంటలు
యాభై కోట్ల మంటలు

యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి

వాస్తవ జీవితాన్ని వేల మైళ్ల దూరంలో విసిరేసిన
విద్యాలయాలు వదిలి
జట్లు జట్లుగా మెట్లు మెట్లుగా
యువకులు నడిరోడ్డుకు పరుగెత్తుకు రావాలి

మూఢనమ్మకాల ఉక్కు కౌగిళ్లలో
నంగనాచి నాయకుల దొంగ వేషాల్లో
నలిగే కృంగే జనం కళ్లగంతలు చించుకొని బయటికి రావాలి
మహావ్యవస్థ రూపొందించని నాయకులు
జనాన్ని జేజమ్మలుగా వాజమ్మలుగా
పురుగులుగా వెధవలుగా
ఎట్లా దిగజార్చారో
ఒక్కసారి వెన్నుతట్టి కళ్ళారా చూపించాలి

యాభై కోట్ల కంఠాలు
తిరుగుబాటు మంటలుగా మారాలి
* * * * *
22. నేనే మీ ఊపిరి
23. మంటలెప్పుడోగాని అంటుకోవు
24. రక్త ఘోష
25. చిలుం
26. కన్నీళ్లేనా
27. జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త
జగద్గురువులొస్తున్నారు జాగ్రత్త

పల్లకీలలో తప్ప ప్రయాణం చేయరు
ధనవంతుల మేడల్లోతప్ప పూరిగుడిశెల ఊసెత్తరు
కాళ్లుండీ కుంటివాళ్లు
మనుషుల బుజాల్ని తప్ప యింకేమీ ఎక్కరు
కాషాయాంబరాలు మానరు
ఆధ్యాత్మిక చింత పేర
నవీన పతివ్రతల్ని పావనం చెయ్యందే వదలరు

ఎవరయ్యా ఎవరీ రసరాట్టులు
బతుకంతా మోసంతో గతికి గతికి
జనాన్నీ జాతి నరనరాన్నీ మతమౌఢ్యానికి తీర్చితీర్చి
వయసులో నానాపాయసాలూ మరిగి మరిగి
కొవ్వెక్కిన పిట్టగూళ్ళ తలబుట్టల బాబాలే
చక్రవర్తుల్లా ఊరేగే జగద్గురు సాముల్లారే
కుష్ఠు వ్యవస్థకు మూలవిరాట్టులు

చీకటి బజారు జలగల్ని
రాజకీయ బొద్దింకల్ని
పదవీ మదాంధుల్ని
సాహిత్య వందిమాగధుల్ని
అభయహస్తంతో కాపాడే కంకణం కత్తుకున్నారు
నిర్వీర్యాన్ని దేశం నలుమూలలా
కాలవలనిండా పారిస్తున్నారు
భయంకర కుష్ఠు సంస్కృతిని దేశమంతా పంచుతున్నారు
నమ్మకు మతాల సుఖరోగుల్ని
వర్ణాశ్రమధర్మ ద్వేషాలు రేపే అడ్డగాడిదల్ని
బహిరంగంగా సభల్లో వ్యభిచరించే ఆబోతుల్ని
రంకూ బొంకూ పురాణాల బంకును
వేదికలెక్కి కుక్కల్లా కక్కే వెధవల్ని
మన్నించకు

మనిషిని ఏనాడో మరచిపోయి
మంచితనాన్ని అంటరానితనంగా ఎంచే తుచ్ఛులకు
చిలకజోస్యాల పిలకగుళ్ళు
వంటింటి కుందేళ్ళు
పట్టెనామాల పొట్టేళ్ళు
బిళ్ళగోచీ బల్లులు
జందెంపోగుల పందులు
బ్రహ్మరథం పడుతుంటే
కళ్ళుండీ కంటూనే
చెవులు పోటెక్కేట్టు వింటూనే
కదలకుండా మౌనంగా నిలబడకు.

దేవుళ్ల దేవులాటలో
మహామహా మాయల నాయాళ్ళ సన్నాసుల
జోగుల మోజుల్లో
పడిపోయిన దేశాన్ని
భవిష్యత్కాలాన్ని
కాపాడడానికి నడుంకట్టు

పాతిపెట్టు
మైలురాయివేకాదు
మంచికి పతాకాన్నెత్తే మనిషినని
మరోసారి రుజువు చెయ్యి
* * * * *
28. ప్రపంచం నిండా

29. చరిత్ర ద్రోహం

30. వ్రణం

31. "దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ "
"దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ "*

ప్రజా జీవనాడి స్పందన పసిగట్టలేని
సమన్వయ మేధావుల అంచనాల వంచనలో
నిలువల్లా మునిగిన దేశం

ప్రణాళికల తాటిచెట్ల నీడల్లో
పడిగాపులుగాచే ప్రజల దేశం
స్వదేశీమార్కు విదేశీయ మార్కెట్టు
మనస్తత్వపు మంది దేశం
కట్టుకో గుడ్డలేని దేశం
దేశి సరుకు ధాన్యానికైనా నోచుకోని దేశం
రెండు దశాబ్దాలు దాటినా
కోట్లాది ప్రజల నోటికందని దేశం
నాదేశం నా ప్రాణం అంటూ
గర్వించే రేబవళ్లు శ్రమించే
శ్రమజీవుల భవిష్యత్తు యావత్తూ
అప్పుల్లో కుక్కబడ్డ దేశం
పిడికెడు సుఖరోగుల చెప్పుచేతల్లో
పడిపోయిన ప్రజాస్వామ్య దేశం
చమటోడ్చి పాటుపడే శ్రమజీవికి
కడుపునిండ తిండెక్కడ కండెక్కడ
పెంచిన మంచి కొన్ని సంచుల్లోకెళ్ళుతోంది
తలపెట్టిన మేలుకు తలలే తాకట్టు పడ్డాయ్

డబ్బు తెచ్చే కీర్తిసంపదల
దోపిడి కిరీటాల తురాయీలొద్దు

కలహాల కారణాలు వెతకని
చరిత్ర పరిణామం యెరుగని ఘనులకు
కత్తివైరాన్ని నిరసించే హక్కు లేదు

ఒరుల మేలుకు సంతసించమనే
కుహనా ఆదర్శవాద ఐకమత్యాని కర్థం లేదు
వొట్టి కడుపులతో మలమల మాడే
అస్థిపంజరాల ఐకమత్యపు సత్యం వేరు

పరులెవరో
కలిమివాళ్ల కెక్కడిదో యోచించక
దు:ఖం అసూయ చిహ్నమనే
సామాన్యులు పాపులనే
సాహసాలు చాలు చాలు

చిక్కని పాలవంటి దేశాన్ని
కొల్లగొట్టే మేలి బతుగ్గాళ్ల మేలును
నా మేలని యెంచే నిర్వీర్యపు నేర్పరితనం
నా ఛాయలకే వద్దు

లాభాల్లో వాటాలు పెంచుకునే
వ్యాపారసరళి దేశభక్తి అక్కర్లేదు
శ్రమఫలితం కాజేసే
పొరుగువాడికి తోడు పడే
వర్గసామరస్య మార్గం వద్దు

మహోన్నత మానవత్వపు సూర్యోదయాన్ని
ఆదిలోనే అడ్డుకొనే
మానవ చరిత్రనిండా మారణహోమాలు రేపిన
మనిషి మనిషిని క్రూరంగా విడదీసిన
హేతురహిత అశాస్త్రీయ
జాతిమతాల్నొప్పుకునే
విషపానీయ సేవ్యం వద్దు 
అక్కడ అన్నదమ్ముల ప్రసక్తి వద్దు

సంఘానికి దూరంగా అణగిమణగి
వర్తమానం గుర్తించక
రుతుచక్రం మలుపుల్లో గొంతెత్తే
కోయిల కవితలొద్దు రచనలొద్దు

ఆస్తిహక్కు రక్షణకై తపనపడే
నక్కల తోడేళ్ల కెదురుతిరిగి
ప్రాణాలను మానాలను అర్పించే
హెచ్చు తగ్గులసలులేని
దేశభక్తి నిర్వచనం
రక్తతర్పణాలతో
రచిస్తోంది నా తరం
* * * * *


32. రాజధాని లేఖ

33. స్వీయచరిత్ర

34. మరోసారి ఈ దేశం మోసపోగూడదు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
బిర్లాభవనంలో వైభవంగా ప్రార్థనలు జరుపుకునే
హరేరాం బికారులు మళ్లీ పుట్టగూడదు
గీతాధ్యయన నేతలు ఈ జాతికి ఇంకా అక్కర్లేదు
బుద్ధుని యిమిటేషన్ ప్రబుద్ధుని సంతతి
పలికే ప్రగల్భాలతోనే
ఇరవై రెండేళ్లూ నీరుగారిపోయాయ్
శాంతిసహనాలతో ఇన్నాళ్లూ మిన్నకున్నందుకు
చరిత్రలో నా తరం చాలాచాలా పోగొట్టుకుంది
సామాన్యుడు సంఘబహిష్కృతుడిగా
సంక్షేమరాజ్యంలో రోజూ చస్తూనే వున్నాడు
పెంకుటిండ్లు పూరిండ్లై
పూరిండ్లు నేలమట్టమవుతుంటే
ఉన్నవాడు దేశాన్ని పిండిపిండి మరింత ఉన్నతంగా
ఆకాశాన్నందుకుంటున్నాడు
గ్రామాలు కుళ్ళి కుళ్ళి అజ్ఞాన తమస్సులో
కుళ్ళుచూళ్ళేనంత దుర్భర దారిద్ర్యంతో
పగిలి పగిలి ఏడుస్తున్నాయ్
ఇవాళ
శిష్యుల గొప్పతనంగురించి వివరంగా చెబితే
హంతకునిలా నేరస్థునిలా
తలవంచుకుని నించున్నాడు అస్థిపంజరాల బోనులో
అన్నార్తుల కన్నుల్లో ఆశాకిరణం ఎడారిదారిలా చీలిపోయింది
విశ్వాసపు గుడారాలెగి రెగిరి గాలిలో
ఏనాడో శిథిలమయ్యాయి
సహనం చచ్చిన కంకాళాలు కలిసికట్టుగా
గండ్రగొడ్డళ్ళతో ఈటెలతో ఈ చీకటి వృక్షాన్ని
పెల్లగించక తప్పదింక
అరచి అరచి ఇరవైరెండేళ్ల చరిత్ర అలసిపోయింది
అతడు పీడితుల మనిషికాడని చెప్పకనే చెబుతోంది
వర్గచైతన్యం గుండెలో మెత్తమెత్తగా బాకులుదూసి
పోరాటశక్తిని నాశనం చేసిన
పచ్చి సామరస్యవాది ప్రపంచానికిచ్చిందేమిటి?
అధికారానికి అంగరక్షకుడిలా
లంచగొండి ప్రభుత్వానికి కవచంగా
మనమధ్య మనుగడ సాగించడమేమిటి?
ఖద్దరు బట్ట తప్ప దేశానికి మిగిల్చిందేమిటి?
అమాయక ప్రజల భుజాలనెక్కి
భగవద్గీత పారాయణ అభయహస్తంతో
మతమౌఢ్యపు పిచ్చికుక్కలకి
ఎద్దుముఖం పెద్దపులులకి
దేశాన్ని బలియిచ్చినవాడికి
ఈ నేలమీద ఇంకా నామరూపాలుండడమేమిటి?
ప్రజాస్వామ్యపు బ్రోతల్ హౌసులో
ఈ రాజకీయాల రంకు కథలు
అతని బిక్షగాక మరేమిటి?
అతని పేరెత్తిన
[లేక 'పేరెత్తని ' యా?] నాయకుడు ఏడి?
అతని విగ్రహం లేని వీధులు ఏవి?
ఈ అస్తవ్యస్తపు మస్తిష్కపు మహాత్ముడికి
ఆరాధనేమిటి ఆర్భాటాలేమిటి?
తారలేమిటి రాగాల భోగాలేమిటి?
పర్వతాలేమిటి? పూజామందిరాలేమిటి?
ఇదంతా మన అజ్ఞానానికి చిహ్నం కాదా!
సబర్మతీ ఆశ్రమవాసి
సన్యాసీ కాదు సంసారీ కాదు
విజ్ఞానదాత కాదు విద్యావేత్త కాదు
రాజకీయవేత్త కాదు రాజూ కాదు
వేదాంతి కాదు వెర్రివాడూ కాదు
ప్రజల్ని పట్టించుకున్నదీ లేదు పట్టించుకోనిదీ లేదు
అన్నీ తానేగా
తానే అన్నీగా పెరిగి
భ్రమల సాలెగూళ్ళలోకి నినాదాల గాలిలోకీ
పుక్కిటిపురాణాల ఆదిమసంస్కృతిలోకి మనుషుల్ని తోసి
నిజావగాహనలేని ప్రజాద్రోహిగా మోసం చేసి
దూదిపింజల్లాంటి సిద్ధాంతాలు వల్లించి
నా తరానికి సున్నాలు చుట్టి వెళ్ళిపోయాడు
మరోసారి ఈ దేశం మోసపోగూడదు
* * * * *


35. పీడితలోకం పిడికిలి బిగించి పిలుస్తోంది

36. యువతరానికి

37. దిక్‌సూచి


దిక్‌సూచి
ప్రజారక్త వ్యాపారులు లిప్తపాటులో
మండి మసి అయిపోయే తరుణం ఇదే
పదవుల పోరాటపు
కుటిలనీతి మంతనాల మంత్రుల్నీ అంతరాత్మల్నీ
సజీవంగా స్మశానానికి పంపే సమయమూ ఇదే
డబ్బు రాజ్యాన్ని కూలద్రోసి
కోట్లాది ప్రజల కూడుగుడ్డకోసం
అడుగడుగునా అధికారపు నడ్డి విరగదన్నాల్సిందే
ఒకటికి పది సున్నాలు చేరుస్తూ
ఉన్నవాడు ఉన్నతుడై
సంఘానికి న్యాయాలయమై
సామాన్యుల శాసించే
ధర్మానికి తలవొగ్గక
ఆ వర్గపు కంచుకోట కొల్లగొట్టి
ప్రజాధనం అందరి కందుబాటులో ఉంచాల్సిందే

ఏ దేశపు సంపదైనా
పుట్టిన పుట్టబోయే బిడ్డల జన్మహక్కుగా
సమ సమానంగా వితరణ చెందాల్సిందే
ఒక్కొక్కడూ ఒక్కో మృగరాజై
నక్కల తోడేళ్ళ డొక్కలు చీల్చి రక్తంలో
త్రివర్ణపతాకం ఆసాంతం ముంచి రంగు మార్చాల్సిందే
* * *
[దిక్‌సూచి, చెరబండరాజు, ప్రథమ ముద్రణ, అక్టోబరు 1970,
  హైదరాబాదు నుండి
]
* * * * *














ముట్టడి
చెరబండరాజు

ప్రథమ ముద్రణ, జూన్ 1972, హైదరాబాదు

1. కొలిమంటుకున్నాది
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగ ఉన్నాది
నిప్పారి పోనీకు - రామన్నా
పొద్దెక్కి పోనీకు - లేవన్నా
నీ పక్క పొలమోడు
దుక్కి సాగిండన్న
కాల్జాపి కూకోకు – రామన్నా
కార్తె పోతే రాదు - యినుమన్నా
ఎరువు కావాలింక
గుడిసేసుకోవాల
నీ బండి పట్టాలు – రామన్నా
కొత్తయే కావాల - యినుమన్నా
ఉత్తరానురిమింది
రోజు మొగులవుతూంది
ఎర్ర మెరుపూ సూడు – రామన్నా
కర్రు పారా సాన - రామన్నా
కంచాన గంజికీ
గద్దలూ కాకులూ
వడిసేల పేనుకో – రామన్నా
వడి వడిగ రాళ్లేసి - కొట్టన్నా
ఇనుపముక్కలు కొడుకు [కుడుకు?]
లుండి ఫలమేముంది
పగటి నిద్రలు మాని – రామన్నా
పనిముట్లు చేసుకో - వేలన్నా [మేలన్నా?]
ఓటుకెదిగిన బిడ్డ
పెళ్ళి లేకున్నాది
కూలో నాలో చేసి – రామన్నా
కూడబెట్టిందేమి - లేదన్నా
చట్టాలు అన్నారు
పట్టాలు అన్నారు
పొలములో కాలిడితె – రామన్నా
పోలీసులొచ్చేరు - ఏలన్నా
కౌలు కిచ్చీనోడు
కన్నెర్ర సేసేడు
అప్పులిచ్చీనోడు
ఆలినే సూసేడు
దయగల్ల సర్కారు
దాదాలె అయ్యేరు
నీ దారి గోదారి – రామన్నా
కానీన కదనాన - నిలువన్నా
కొలిమంటుకున్నాది
తిత్తినిండా గాలి
పొత్తంగ ఉన్నాది
నిప్పారి పోనీకు – రామన్నా
సందేల కానీకు – లేవన్నా
కర్రు పారా సాన – బెట్టన్నా
బతుకు యుద్ధములోన - నిలుమన్నా
* * * * *
2. నేడైనా రేపైనా
3. మాలోని మనిషివే
మాలోని మనిషివే
పోలీసు పాట
మాలోని మనిషివే మా మనిషివే నీవు
పొట్టకూటికి నీవు పోలీసువైనావు
ప్రాణాలు బలిపెట్టి పోరాడు సోదరుల
గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి

మాలోని మనిషివే మా మనిషివే నీవు
పొట్టకూటికి నీవు పోలీసువైనావు
అన్నన్న ఆ బతుకు బతుకు బతుకే గాదు

కాటికీ కాల్జాపి కూర్చున్న కన్నోళ్లు
రాళ్లుమోసే చిన్న తమ్ముళ్లు చెల్లెళ్లు
పేగు లెండుకుపోయి చచ్చిపోయినగాని
దేశానికే అసువు లర్పించు సోదరుల
గుండెలకు తూటాలు గురిపెట్టినావేమి                //మాలోని //

భోగాలు ఆనందయోగాలు కొందరివి
రోగాలు నొప్పులూ కోట్లాది ప్రజలవీ
అందుకే పేదోళ్లు తిరగబడుతున్నారు
నిన్నుగూడా తోడు ఉండ మంటున్నారు                  //మాలోని //

మనిషన్న కాడికీ మనసంటు ఉంటాది
పల్లెత్తి ఒక మాట పలకనీ నీ కొలువు
చావనా బతకనా సత్తెమాలోచించు
దొంగసర్కారులో పాలు పంచూకోకు                 //మాలోని //

రాకాసిమూకలు రాజ్యమేలే నేడు
నీ గుండె చెరువయ్యె కరువులో బతుకుతూ
ఇల్లు ముంగిలి లేక తల్లడిల్లే నీవు
నిరుపేదవేగాని మరబొమ్మవై పోకు
నీవాళ్ల ప్రాణాలు తీయకో తీయకో              //మాలోని //

దీన బంధువులంత అడవిపాలైనారు
రాబందు లందరూ గద్దెలెక్కీనారు
బందూకు నీచేత పట్టించి నోళ్లంత
ప్రజల శత్రువులన్న మాట మరిచీ పోకు          //మాలోని //
* * * * *

4. అమ్మమ్మ ఇందిరమ్మా

5. దేశమేదైనా

6. కలుపు తీసే కాడ

7. కామ్రే డ్!

8. ఒళ్ళు మరిచి

9. రాయిరప్పకు సెప్పనా...
రాయిరప్పకు సెప్పనా...
కూలికోసం తాను
ఎదురు తిరిగీతేను
నక్సలైటూవని
సంపేసిపోనారు

రాయిరప్పకు సెప్పనా - నా గోడు
నేనె రాయైపోదునా

సదువుకుంటే బతుకు
బాగవుతదంటారు
బడికెల్లితే కొడుకు
కూడెవడు పెడతాడు

రాయిరప్పకు సెప్పనా - నా గోడు
నేనె రాయైపోదునా

ఇంటిల్లిపాదిమీ
రెక్కలిరుచూకున్న
ఏపూట కా పూట
గంజి కరువేనాయె

రాయిరప్పకు సెప్పనా - నా గోడు
నేనె రాయైపోదునా

అప్పు ముప్పంటారు
తప్పు తప్పంటారు
అప్పు సేయకపోతె
పొద్దు పొడవాదాయె

రాయిరప్పకు సెప్పనా - నా గోడు
నేనె రాయైపోదునా

ఆనకాలం వస్తే
ఇల్లు చెరువై పాయె
కప్పలూ పాములూ
మా పక్కలో నాయె

రాయిరప్పకు సెప్పనా - నా గోడు
నేనె రాయైపోదునా

పెద్దమనిషై బిడ్డ
ఇంట్ల ఉన్నాదంటె
ఊరిపెద్ద చీర
రైకలిస్తాననె

రాయిరప్పకు సెప్పనా - నా గోడు
నేనె రాయైపోదునా

చెరువులో దూకనా
చెరువయ్యి పోదునా
ఉరిపోసుకుందునా
ఉరితాడు అవుదునా

రాయిరప్పకు సెప్పనా - నా గోడు
నేనె రాయైపోదునా
1-3-1972.

10. మరణానికి మారుపేరు

11. అశోకచిహ్నం

12. వినండి వినిపించండి

13. "సకలార్థ సాధకు లెవరు "

14. విష వృక్షం

15. నిలయ విద్వాంసులారా

16. కుగ్రామం

17. మళ్లీ వస్తున్నాయి మన ఊరికి

18. అరుణ తరం

19. ఎత్తండి చేతులు

20. సాధన

21. ముట్టడి

22. ప్రజ

23. సరికొత్త రజాకార్లు

24. కాలజ్ఞానం

25.  అగ్నిపుత్రులు

26. ఈ తరానికి తీరం

27. బాంగ్లా ప్రజలకు బహిరంగ లేఖ

28. అంకితం

అంకితం
ప్రపంచం నాకివ్వాళ
మా పల్లెటూరి కన్నా చిన్నదిగా
నా షెల్ఫులోని పుస్తకాల్లా
నా చేతి వేళ్లలా
మరీ మరీ దగ్గరై కనిపిస్తున్నది

భూగోళం మీది ప్రతి అంగుళం
అందని నక్షత్ర సముద్రంలా లేదు
నా చేర్చిన ఓనమాలలా
నా కంఠంలో వేలాడుతున్నది
పిలిస్తే పలుకుతున్నది

నన్నీ దృష్టికి నడిపించినవాళ్లు
ఎక్కడోలేరు
ఎవరో కారు
వాళ్లు చరిత్ర రహస్యాల్ని
ఛేదించిన వీరులు నా గురువులు నావాళ్లు

అహం చచ్చిపోతున్నది
ఆడంబరాలమీది మోజు
మంచులా కరిగిపోతున్నది
స్వీయసుఖాలంటూ
మధురపానీయాలంటూ
ఏమీ నాకోసం లేదంటూ
వుండాలనుకోవడమే
అన్ని అనర్థాలకు తిరోగమనవాదాలకూ భయాలకూ
ప్రత్యేకించి సాహిత్యోపజీవి ప్రత్యేకతలంటూ
పడిచచ్చే ముడిపడని జ్ఞానం అంతా శూన్యం అంటూ
చెపుతున్న వాళ్లు
ఎక్కడో లేరు
ఎవరో కారు
వాళ్లు చరిత్రకు యవ్వనం ప్రసాదించిన వైద్యులు
నా పంచప్రాణాలు నావాళ్ళు

ఇష్టానిష్టాలు క్రుంగిపోతున్నవి
ప్రేమవాత్సల్యాలతో హృదయం
అద్దంలా రూపుదిద్దుకుంటోంది

దేశాలమధ్య సరిహద్దులు
మనిషి కో ధర్మం వద్దంటూ
నాకు శాసించే విలపించే హక్కు లేదంటూ
శ్రమశక్తికి రచనాశక్తిని
విముక్తికోసం జోడించమని
పుస్తకాలు వదిలి వాస్తవ జీవితాల్ని
నగరాల గాయాల్ని పల్లెల్లోని ముళ్ళబాటల్ని
శాస్త్రీయ దృక్పథంతో ఆవాహన చెయ్యమని

నాకు పాఠాలు చెపుతున్నవాళ్ళు
ఎక్కడో లేరు
ఎవరోకారు
వాళ్లు దొంగల చరిత్రనుండి నిజాన్ని
కైజారులా వెలికి లాగినవాళ్లు
నిత్యచైతన్యమూర్తులు ఆర్తులు
నాకు నేతృత్వం వహిస్తున్న నేతలు

దూరభారాలు నశిస్తున్నవి
మనసుమీంచి నిరాశా నిస్పృహల గూళ్ళు
ధూళిలా ఎగిరిపోతున్నవి

దాతలకోసం చేతులు చాచినంతకాలం
మాన్వజాతికి మంచిరోజులు రానేరావంటూ
ఈ చేతులు అగాధాల్ని పూడ్చడంలో
రక్తాలు కారి చితికినా చింతే లేదని
ఈ కాళ్లు అన్యాయాల్ని అణగద్రొక్కడంలో
కీళ్ళు సళ్ళినా విరిగినా ఆగేదే లేదని
ఈ కంఠాలు గంటల్లా మోగుతూ
నిజాన్ని నిప్పులా మండిస్తూ
శత్రుదుర్గాల్లో ఉరికంబాలెక్కినా
వెనక్కి తిరిగేదిలేదని
సమున్నత సమతా సమాజ నిర్మాణానికి
నాకు ఊపిరి పోస్తున్న వాళ్ళు
ఎక్కడో లేరు
ఎవరో కారు
వాళ్లు చరిత్ర శరీరంలో స్పందిస్తున్న ఎదలు
నడుస్తున్న సముద్రాలు నలగని కాంతిదీపాలు వాళ్ళు

దోపిడీ శిఖరాలు కూలుతున్నవి
నేలనేలంతా ఎరుపెక్కుతుంది
ప్రపంచంలో ఏమూల పూరిగుడిసెలో చూసినా
త్యాగానికి కొదువ లేదు
ఆయుధాల భయం లేదు
రక్తనాళాలు జ్వలిస్తూ పురోగమిస్తూనే వున్నై

మేల్కొన్నవాడిదే భవిష్యత్తు అంటూ
లోకంలో వేకువలెన్నో
గళాలెత్తి పిలుస్తున్నై
త్వరపడండని అమరవాణిని వినిపిస్తున్నవాళ్లు

ఎక్కడో లేరు
ఎవరో కారు

వాళ్ళు పోరాటాలకు పర్యాయపదాలు
కాలం ప్రాణవాయువులు
వర్గదృష్టి నిశితంకానిదే కనబడనివాళ్లు
అహం చంపుకుంటేకాని అర్థంకానివాళ్లు

నేను నా గీతం వాళ్లకే అంకితం

11-2-1972.

* * * * *

గమ్యం
చెరబండరాజు
ప్రథమ ముద్రణ, సెప్టెంబర్ 1973

చాటండి గళమెత్తి
చారూ మజుందారు
చచ్చి పోలేదనీ
చంపబడ్డాడనీ

ఇరవైయారేళ్లకే నూరేళ్లు నిండి
మార్గమధ్యంలో మమ్మల్ని వీడిపోయిన
ఎన్. ఎస్. ప్రకాశరావుకు అంకితం.

1. నేను భారత విప్లవాన్ని
నేను భారత విప్లవాన్ని
చిగురుటాకూ
చెప్పు నాకూ
గాయపడి నీ
చెంత చేరిన
వీరపుత్రుని
కెంత గాలీ
దాచకుండా
వీచగలవూ
మబ్బుతునకా
చెప్పు చెప్పూ
నాలుకెండిన
నేలబిడ్డల
ఏడ్పు మాన్పుట
కెంత నీరూ
నేరుగా కరు
ణించ గలవూ
శత్రు దాడికి
జాడలివ్వక
అడవి అన్నల
గుహల చేర్చుము
చందమామా
చెప్పు తండ్రీ
రైతుబిడ్డలు
జతలు కట్టగ
పరుగు పందెం
కర్ర సాముల
కెన్ని గంటలు
విడిది చేసేవ్‌
పొదలు మీరూ
పలక రేమీ
మీరె కవచాల్‌
మీరె డాళ్లూ
ఎర్ర సేనల
గుర్తు లడిగీ
నరికినా మొల
కెత్తి రండీ
పిల్ల బాటా
మాట మార్చకు
ఏటి దాకా
కాకి దుస్తుల
తోలు కొచ్చీ
నీట ముంచీ
కుక్క జాతిని
తిప్పి కొట్టుము
జింక తల్లీ
ఒక్క మాట
వేటగాడికి
దొరికె కన్నా
వీరయోధుని
వింట నారిగ
అమర జీవిగ
రాలి పొమ్మూ
బతుకు దోపిడి
గాళ్ల నుండీ
పోరు సలుపుతు
దారి నున్నా
కష్ట జీవుల
స్వర్గ సీమను
నేను భారత
విప్లవాన్ని
అదను ఇదే
సాయుధంగా
ఆదుకోండి
ఆదుకోండి
* * * * *
2. నిప్పురవ్వలు నిద్రపోవు

3. పేదవాళ్ళం

4. 'నేడు ' అస్తమించాలి

5. పాలేరు పాట

6. అమెరికా ప్రజలకు

7. కొరియర్

8. మారలేదన్నా

9. చెట్లు

10. అటుగాదు ఇటు నడూ...

11. దీప సందేశం

12. ఏకైక మార్గం

13. అందుకోండి ఆయుధాలు

14. ఒక మిత్రుని ఉత్తరం

15. ఏమిటి?

16. గడ్డిపోచలు గర్జించాలి

17. 47 లో నా వయస్సు 25

18. వధ్యశిల
వధ్యశిల
వధ్యశిల రజతోత్సవమ్మట
బందిఖానలు ప్రజల సొమ్మట
న్యాయమే వర్ధిల్లుతుందట
నాయకుల ఆరాధనాలట
పూలుగోయర తమ్ముడా
మాల గట్టవె చెల్లెలా
కొత్త సంకెళ్లేమి లేవట
తెల్లదొరలను దించినారట
దేశదేశములోన భారతి
బిచ్చ మెత్తుట మాన్పినారట
గర్వపడరా తమ్ముడా
పరవశింపవె చెల్లెలా
ఆనకట్టలు కట్టినారట
భూమి పేదల కిచ్చినారట
ఆకలెత్తిన ఆయుధాలను
అణచి మేల్‌ సమకూర్చినారట
భయము లేదుర తమ్ముడా
శీలవతివే చెల్లెలా
గ్రామ పంచాయతులు పెట్టి
పేదలకు నిధి పంచినారట
పల్లెనుండి ఢిల్లి దాకా
సోషలిజమే పారుతుందట
వంత పాడర తమ్ముడా
గొంతు కలపవె చెల్లెలా
పదవికయినా కొలువుకయినా
తెలివి ఒక్కటె గీటురాయట
కులమతాలను చంపినారట
రామరాజ్యము తెచ్చినారట
అందుకొనరా తమ్ముడా
ఆడిపాడవె చెల్లెలా
అధిక ధరలను ఆపినారట
దోచువారికి జైలుశిక్షట
మంత్రులైనా తప్పుకోరట
ధర్మచక్రము తిప్పుతారట
పాడు జనగణ తమ్ముడా
పల్లవెత్తవె చెల్లెలా
పాఠశాలలు పెంచినారట
జ్ఞాన జ్యోతులు పంచినారట
దేవళమ్ములు నిలిపినారట
ముక్తిమార్గం చూపినారట
పూజ సలపర తమ్ముడా
పున్నె మొచ్చునె చెల్లెలా
ప్రణాళికల పరిమళాలట
ప్రతి గృహానికి పాకినాయట
నిరుద్యోగమ పొమ్ము పొమ్మని
కొత్తగొంతుక విప్పుతారట
సహనముంచర తమ్ముడా
ఆలకించవె చెల్లెలా
ఎవరి ప్రాణము తీయలేదట
పౌరహక్కుల గాచినారట
పార్లమెంట్లో అడిగినారట
ప్రజాస్వామ్యం నిలిపినారట
విప్లవించకు తమ్ముడా
విన్నవించవె చెల్లెలా                                             26-7-1972
* * * * *
19. గమ్యం
గమ్యం
నేనొక్కణ్నే ఇక్కడ
రెక్కలు తెగిన పక్షినికాను
దాని పయనం గగనం గమనార్హం
నేనొక్కడ ఇక్కడ
దాహంగొన్న ఒంటెనుగాను
ఒయాసిస్సుకై తపస్సు చేయను
నేనొక్కణ్నే ఇక్కడ
రాత్రికై నిరీక్షించే నక్షత్రాన్ని కాను
నెలరాజు వెలుగులో వెలవెలాబోను
నేనొక్కడ ఇక్కడ
విరిగిన చుక్కాని పడవను కాను
ఓ సాగర తీరం చేర్చమని ప్రార్థించను
అయితే నేనెవరిని
పేరేమిటి ఊరేమిటి
ఊపిరేమిటి ఉనికేమిటి
నా పేరు ఆకలి
సాయుధం నా శరీరం
ఆక్రమణ నా ఉనికి
ఉద్యమం నా ఊపిరి
విప్లవం మా ఊరు
* * * * *
20. జన సంగీతం

21. ప్రత్యేక తెలంగాణా/ఆంధ్ర లో ప్రజారాజ్యం

22. విప్లవ గ్రామం

23. ఎర్రగడ్డ

24. అగ్ని వర్షం
25. ప్రభుకంఠం - ప్రజాకంఠం
26. కార్మికుడు
27. నిర్జిస్తూ - ఓడిస్తూ
28. ఊపిరి
ఊపిరి
కష్టజీవుల నెత్తురెరుపూ
కమ్యూనిస్టు జెండ ఎరుపూ
దోపిడీ లేనట్టి బతుకుల
కెవడు ఆయుధమెత్తినాడో
వాడి మాటలు ఎరుపు ఎరుపూ
వాడి చేతలు ఎరుపు ఎరుపూ
ఎరుపుబాటల నడిచి మనమూ
ఎర్రరాజ్యము నిలుపుదామూ
కాదు తమ్ముడు కాదు చెల్లెల
బొంగరాల ఆట గాదూ
చేరడేసీ మొగ్గగాదూ
వొట్టిమాటల మూటగాదూ
ఫ్యాక్టరీలూ పంటపొలములు
సొంతమయ్యేదాక మనము
ఎర్రజెండా విడువకుండా
ఆయుధాలు దించకుండా
ప్రజా గర్జన జేసుకుంటూ
ఎరుపు పాటలు పాడుకుంటూ
ఏరులెన్నో దాటుకుంటూ
పార్టికోసం ప్రాణమిచ్చీ
గుండె చెదరక గుండ్లకదరక
వర్గశత్రువు నెత్తుటేర్లతో
వసంతాలే ఆడుకుంటూ
ఊళ్ల కూళ్లే గెలుచుకుంటూ
చైన వోలె భారతావని
శాంతి ఖండము అయ్యెదాక
పోరు ఊపిరి జేసుకుందాం
రండి సోదరులార రండి
ఎర్రజండా విడువకండి
ఆయుధాలూ దించకండి                                    31-8-1973
* * * * *


కాంతి యుద్ధం
చెరబండరాజు
ప్రథమ ముద్రణ
డిసెంబరు 1973
"అన్నం వండిపెట్టి
పూట కా పూట
నా నోట పాటలు పాడించుకొని
నన్ను
సవరించిన
జైల్లోని తోడి ఖైదీలకు"
[ఇందులోని "చెట్టూ నీ పేరు చెప్పి... " అనేది తప్ప మిగిలినవి హైదరాబాదు సెంట్రల్ జైల్లో రాశాను" అని చెరబండరాజు తన "ఒక మాట" లో చెప్పాడు.]



1. ఊరు మేలుకుంది
ఊరు మేలుకుంది
ఊరు మేలు కొన్నదీ
ఏరు
మేలు కొన్నదీ
ఊరులోని కూలిజనం
చుక్కపొద్దు లేచినదీ
సూర్యునితో
నడిచినదీ
ఊరు మేలు కొన్నదీ
ఏరు
మేలు కొన్నదీ
ఏటిలోని కోటి అలలు
గల
గల గల నవ్వినవీ
పాపలవలె
నడిచినవీ
ఊరు మేలు కొన్నదీ
ఏరు
మేలు కొన్నదీ
పసులు దొడ్లు వీడినవీ
అడవి
దారి పట్టినవీ
చెట్లు గట్లు విడిచినవీ
పక్షులెటకొ
పోయినవీ
దినవెచ్చము
కొరకుగదా
జీవరాశి
కదిలినదీ
ఊరు మేలు కొన్నదీ
ఏరు
మేలు కొన్నదీ
...........................
ఏటిలోని కోటి అలలు
కిలకిలకిల
నవ్వినవి
గలగలగల
పారినవి
నవ్వుల
నురుగుళ్లు చిమ్మి
పరుగులెత్తి
మురిసినవి
గుండె
పొంగి ఆడినవి
కొత్త పాట పాడినవి
ఊరు మేలు కొన్నదీ
ఏరు
మేలు కొన్నదీ
[చాల పెద్ద పాట గనుక కొన్ని చరణాలే ఇక్కడ యిచ్చాము]
* * * * *

2. చెట్టూ నీ పేరు చెప్పి ……
3. పాపా!
4. కాంతి యుద్ధం
కాంతి యుద్ధం
ఆ రాత్రి:
నగరం నడిగడ్డ మీద
రోడ్డు చివర
చౌరాస్తాలో
దశదిశలా నిశికమ్మిన

పోలీసుల పహరాలో
అటచేరిన
కార్మికులూ
ఆ రాత్రిని ఛేదిస్తూ
మంటలతో మంటలవలె
నినాదాలు మండిస్తూ
నిషేధాజ్ఞ లన్నింటినీ
చుక్కలవలె ధిక్కరించి
మసక మసక వెల్తురులో
మరణించిన కార్మికవీరుని
శవజాగరణ చేస్తున్నరు
……………………….
……………………….
మన బతుకుల లోతేమిటొ
" మాతృభూమి " కథ వినండి
ఇంటింట చీకటే ప్రతికంట కన్నీరె
రాజ్యమెవరికి వచ్చెనో – రాజన్న
సుఖములెవరికి దక్కెనో
వొళ్ళొంచి కష్టించి రాజనాల్ పండించ
కరువులెందుకు వచ్చెనో – కనకయ్య
గరిసె లెవరివి నిండెనో
పాతికేండ్లైపాయె భారతీయుని బ్రతుకు
అంగట్ల సరుకాయెనో – రంగయ్య
అట్లెందుకైపాయెనో
ఓట్లేసి గెలిపించి పట్నాని కంపితే
సీట్ల కుక్కాలాయిరో – కోటయ్య
కొలువు లెందుకు దొరకవో
పేర్లేమొ పెద్దలవి వేసేవి గుడిశెలు
లక్షలేమైపాయెనో – అచ్చయ్య
లెక్కలెవరికి చెప్పిరో
ఉన్నోడు ఉన్నతికి లేనోడు కాటికి
దేశోన్నతిదె అందురో – మైసయ్య
పేదదేశంబందురో
ఆసేతు హిమగిరీ పోలీసు కాపలా
దేశమే జైలాయెనో – జానయ్య
నాజీల పాలాయెనో
నోరెత్తితే ప్రజలు చట్టాల జేజేలు
పిచ్చి పట్టిందెవరికో – మంకయ్య
మందు వుందని తెలియరో
కూడడిగితే జైళ్లు, జైళ్లలో కాల్పులు
ఇది ప్రజాస్వామ్యమగునో – సాంబయ్య
పోలీసుస్వామ్యమగునో
గిరిజనులు హరిజనులు ఏ రోజు కా రోజు
బలిపశువు లెట్లయ్యిరో – పాపయ్య
బందూ కెందుకు పట్టిరో
పాలుతాపిన తల్లి ప్రతి మనిషి కున్నట్లు
పోరాట స్థలం తల్లీవంటిదో – సత్తెయ్య
శ్రీకాకుళం ప్రజలతల్లి మనకందరికిరో
మనమొక్కరమే లేము
నలుదిక్కుల బిగిపిడికిళ్ళే
............................
............................
తెల్లవారెను తూర్పుదిక్కున
అరుణకాంతులు ప్రాకసాగెను
మేలుకొనరా కార్మికా
మేలుకొనరా కర్షకా
మేలు కొండయ్యా
కొత్త ఉదయం కాంతి యుద్ధం
మేదినోత్సవ శుభం పూసెను
మేలుకొనరా కార్మికా
మేలుకొనరా కర్షకా
మేలు కొండయ్యా
...............................
...............................
"ప్రపంచ కార్మికులారా ఏకం కండి"
ఆకాశం మార్మ్రోగింది
"విప్లవం వర్ధిల్లాలి"
ధరణి ప్రతిధ్వనించింది
ఒక కామ్రేడ్ గొంతెత్తీ
విశ్వగీతి పాడినాడు
"ఆకలిమంటల మలమలలాడే
అనాథులందరు లేవండోయ్
హింసారతినీ సహించగలేక
ఈసడించినది ఎల్ల ధర్మమూ
మంచిదినాలూ రానున్నాయీ
మనకందరకును లేవండోయ్"
.............................
.............................
కొత్త ఉదయం కాంతియుద్ధం
రక్తకేతన మెత్తవలెరా
అమరవీరుల ఆశయాన్ని కొనసాగిద్దాం
ఐక్యం కావాలి మనం
చీలి రాలి పోవద్దు
ప్రపంచ కార్మికులారా ఏకం కండి
ఆచరించు మార్క్సిజం
కాదుకాదు రివిజనిజం
వర్ధిల్లును వర్ధిల్లును నక్సల్‌బరి పోరాటం
నిష్కాపట్యంగా నిర్మలంగా సాగుదాం
రైతాంగ సాయుధ పోరాటం వర్ధిల్లాలి
కుట్రలు కూహకాలు వద్దు
ప్రజాయుద్ధ పంథా వర్ధిల్లాలి
వర్ధిల్లాలి వర్ధిల్లాలి
విప్లవం వర్ధిల్లాలి
వర్ధిల్లాలి వర్ధిల్లాలి
విప్లవం వర్ధిల్లాలి
* * * * *
5.   నేస్తగాడా!
* * * * *


గౌరమ్మ కలలు
చెరబండరాజు

ప్రథమ ముద్రణ
మార్చ్ 1973

అంకితం:
"జనాభాలో సగం మంది
మహిళ లున్న సమాజంలో
స్త్రీలోకం
ముందురాక
జనవిముక్తి
జరగదనీ"
పోరాడుతున్న చెల్లెళ్లకు ......

* * * * *

చెరబండరాజు పాటలు
జన్మహక్కు
ప్రథమ ముద్రణ: ఏప్రిల్ 1978
ప్రగతి ఆర్ట్ ప్రింటర్స్, హైదరాబాదు.
[అంకితం:] ప్రాణంలో ప్రాణమైన "జన నాట్య మండలి" [కి]
1. కొండలు పగలేసినం
కొండలు పగలేసినం
కొండలు పగిలేసినం, బండలనూ పిండినం
మా
నెత్తురు కంకరగా ప్రాజెక్టులు గట్టినం
శ్రమ
ఎవడిదిరో, సిరి ఎవడిదిరో
బంజర్లను నరికినం, పొలాలనూ దున్నినం
మా
చెమటలు ఏరులుగా పంటలు పండించినం
గింజెవడిదిరో
, గంజెవడిదిరో
మగ్గాలను పెట్టినం, పోగు పోగు వడికినం
మా
నరాలె దారాలుగ గుడ్డలెన్నొ నేసినం
ఉడుకెవడిదిరో
, వణుకెవడిదిరో
యంత్రాలను తిప్పినం, ఉత్పత్తులు పెంచినం
మా
శక్తే విద్యుత్తుగ ఫ్యాక్టరీలు నడిపినం
మేడెవడిదిరో
గుడిసెవడిదిరో
కారణాలు తెలిసినం, ఆయుధాలు పట్టినం
మా
యుద్ధం ఆపకుండ విప్లవాలు నడిపెదం
చావు
మీదిరో, గెలుపు మాదిరో
* * * * *
2. రాజుల సంస్కృతి
3. లాల్ సలాం
లాల్ సలాం
కమ్యూనిస్టు కిష్ట గౌడ కామ్రేడా భూమయ్యా
అందుకొండి పేదప్రజల
ఆరాటపు లాల్ సలాం
పోరాటపు లాల్ సలాం
గుండె గుండె లాల్ సలాం, కొండ కొండ లాల్ సలాం

వీరగెరిల్లాలు మీరు చారు దారి పోరినారు
అందుకొండి నవయువకుల
భయంలేని లాల్ సలాం
బందూకుల లాల్ సలాం
పసి పాపల లాల్ సలాం పంట చేల లాల్ సలాం

ఎర్ర జెండ విడువ లేదు వర్గపోరు మరవలేదు
అందుకొండి రైతాంగపు
అన్నయ్యల లాల్ సలాం
చెల్లెమ్మల లాల్ సలాం
తెలుగునేల కూలి రైతు గెరిల్లాల లాల్ సలాం

జైలుగోడ నీడలకు చిరునవ్వులు నేర్పినారు
అందుకొండి విద్యార్థుల
మొక్కవోని లాల్ సలాం
బిగిపిడికిలి లాల్ సలాం
అడుగడుగున లాల్ సలాం అడవిపూల లాల్ సలాం

మీ ప్రాణం తియ్యలేక వణుకుతుంది ఉరికంబం
(మీ ప్రాణం తీసి ఇంక బతుకలేదు ఈ ప్రభుతా)
అందుకొండి అన్నలార
పల్లె పల్లె లాల్ సలాం
ప్రజాయుద్ధ లాల్ సలాం
నక్సల్‌బరి శ్రీకాకుళ తెలంగాణ లాల్ సలాం
ఎర్రజెండ లాల్ సలాం!
* * * * *
4. ఓ భారత కార్మికుడా
5. మతపిచ్చి
6. ఊరూ మీది...
7. మొదనష్టపు సంఘంలో
8. చైనా గీతం
9. నియంతృత్వం
10. ప్రజాస్వామ్య బండి
11. మా పల్లె
12. మతమేదైనా
13. కష్టజీవి
14. సారూ! మనమూ!
సారూ! మనమూ!
సారూ! మనమూ
పొలలకెళ్దాం
శ్రమజీవులతో
స్నేహం చేద్దాం                               //సారూ//
కూలిపిల్లలతొ
చేతులు కలిపీ
చెమటతొ నేలను
తడి తడి చేద్దాం                //సారూ//
పరుగుతొ నీటికి
స్వచ్ఛత వలెనే
పనితో మా చై
తన్యం పెరుగును               //సారూ//
భట్టీయంతొ
బండలమవుతాం
పనితో తెలివీ
తెలివితొ పనులూ             //సారూ//
ఈ రోజుతొ ఈ
పాఠాలొద్దూ
మార్కుల చదువులు
మా కసలొద్దూ              //సారూ//
* * * * *
15. వారసులం
వారసులం
బోల్షివిక్కు వారసులం
నక్సల్‌బరి బిడ్డలం
జనచైనా వెలుగులలో
నడుస్తున్న వారలం
పీడితజన ముక్తికొరకు
పోరుతున్న పేదలం
శ్రీకాకుళ రైతాంగం
చేతిలోని కత్తులం
అమరజీవి పాణిగ్రాహి
అన్నయ్యకు తమ్ములం
ప్రజాయుద్ధ పల్లవిని
పాడుతున్న రచయితలం
పాలకవర్గాలబట్టి
సాయుధంగ గూల్చెదం
విప్లవాన్ని కుట్ర అనే
శత్రుగోరి కట్టెదం                                  
(1974 అండర్‌ట్రయల్ కాలంలో)
* * * * *
16. విప్లవాల యుగం మనది
విప్లవాల యుగం మనది
విప్లవాల యుగం మనది
విప్లవిస్తె జయం మనదె                  //విప్లవాల//
కష్టజీవులార మీరు
కనలి కనలి చావకండి
సాయుధ పోరాట ప్రజా
సైనికులై కదలిరండి                  //విప్లవాల//
ప్రజాయుద్ధ జలపాతం
దోపిడిపై విరుచుకుపడి
బూర్జువాల రాజ్యాంగం
మట్టిపాలు కానున్నది                  //విప్లవాల//
త్యాగాలకు వెనుదీయని
వాడే మన సహచరుడు
శత్రువుపై జాలిలేని
వాడే మన స్నేహితుడు                 //విప్లవాల//
పోలీసుల రాజ్యంలో
పౌరహక్కు లడుగంటెను
కోర్టులలో జనన్యాయం
గొంతునులిమి చంపబడెను               //విప్లవాల//
చెరసాలలు ఉరికొయ్యలు
వెలుగును బంధించలేవు
ప్రతి నిమిషం పోరాడే
ప్రజలను భయపెట్టలేవు             //విప్లవాల//
రాక్షస సామ్రాజ్యవాద
పర్వతాలె కూలుతుంటె
శ్రమజీవుల శక్తిముందు
ఏ శక్తులు నిలువ గలవు               //విప్లవాల//
* * * * *
17. జన్మహక్కు
18. అన్నరారా…
19. ఓ గులాబి
20. శ్రామికవర్గం
21. పాడుతాం
పాడుతాం
పాడుతాం పాడుతాం
ప్రజలే మా నేతలనీ
ప్రజాశక్తి గెలుచుననీ
పాడుతాం పాడుతాం                                       //పా//
నక్సల్‌బరి విరచించిన
జనవిముక్తి గీతాలను
ప్రతికంఠం నినదించగ
పాడుతాం పాడుతాం                                       //పా//
జనపదాల విషాదాల
తొలగించే నిప్పురవ్వ
పెనుమంటలు రగిలించగ
పాడుతాం పాడుతాం                                       //పా//
దోపిడిపై ధ్వజమెత్తిన
భూమిలేని నిరుపేదల
బాధలింక వుండవనీ
పాడుతాం పాడుతాం                                       //పా//
పీడనలో పడినలిగిన
జనజీవన శ్రమఫలాలు
శ్రామికులకె చెందాలని
పాడుతాం పాడుతాం                                      //పా//
ఈ దొంగల రాజ్యాంగం
రచనే ఒక కుట్ర అనీ
శ్రమజీవుల శ్వాసలతో
పాడుతాం పాడుతాం                                       //పా//
గజం గజం నడిచైనా
ప్రజాసేన వడివడిగా
కెరటాలుగ పొంగుననీ
పాడుతాం పాడుతాం                                       //పా//
శ్రీకాకుళ మెగరేసిన
సాయుధపోరాట జండ
చిరకాలం ఎగురుననీ
పాడుతాం పాడుతాం                                       //పా//
మృతవీరులు చిందించిన
రక్తంలో ప్రభవించిన
అగ్నిజ్వాల లారవనీ
పాడుతాం పాడుతాం                                       //పా//
* * * * *
22. ఇది నూతన…
23. చందమామా
24. ఏరూ - పడవ
25. ఏమిటుద్ధరిస్తారండీ...
26. ముంచుకొచ్చిందీ...
27. అన్నా అన్నా
28. వియత్నాం
29. జాతరోళ్లొస్తుండ్రు
30. మానండర్రో
31. ఓట్ల చెట్లు
32. ఓరయో నారయో...
33. మార్క్సిస్టు - లెనినిస్టు
34. నిన్న మనం
35. ఎర్రెర్రని తెలంగాణ
ఎర్రెర్రని తెలంగాణ
ఇదేనండి ఇదేనండి ఎర్రెర్రని తెలంగాణ
కమ్యూనిస్టు గుండెకాయ కష్టజీవి కలలకోన                 //ఇదే//
ఆనాడూ నైజామును మెడలు పట్టి విరచినట్టి
కాంగిరేసు సర్కారును గడగడలాడించినట్టి
రైతుకూలి పేదజనం చీమలవలె కదిలొచ్చిన                 //ఇదే//
లక్షలాది ఎకరాలను హస్తగతం చేసుకొనీ
మూడువేల గ్రామాలలో ఎర్రజెండ నెగురవేసి
పీడితులను నిద్రలేపి యుద్ధానికి నడిపించిన                //ఇదే//
బయటపడ్డ పేగులనూ పైపంచెతో అదిమికట్టి
పగతురపై పగబట్టీ ప్రాణాలను దీసినట్టి
గొటిముకుల గోపాలరెడ్డి జన్మించిన జీవగడ్డ                //ఇదే//
చెయ్యం మేం చెయ్యమనీ చిన్న పెద్ద ఒక్కటయ్యి
సంఘాన్నే నమ్ముకొనీ దొరల చావగొట్టి వెట్టి
చాకిరులను విడిచిపెట్టి కత్తిపట్టి పోరినట్టి                //ఇదే//
ఏ ఇంట్లో ఏ బిడ్డడు ఎందుకొరకు చచ్చెననీ
అడగండీ ప్రతి పల్లెను ప్రతి చెట్టును ప్రతి గుట్టను
ఆత్మకథలు చెప్పునవీ దోపిడింక పోలేదని               //ఇదే//
పోరాటం నడిపించిన పుచ్చలపలి సుందరయ్య
కంటనిప్పులను చెరిగిన చండ్ర రాజేశ్వరయ్య
ఎన్నికలని కొంపార్చిరి ఇంకెప్పుడు నమ్మకండి                 //ఇదే//
నాటి తెలంగాణ నుండి శ్రీకాకుళ గిరిజనుడు
శ్రీకాకుళ పోరునుండి తెలంగాణ రైతు నేడు
భూమి భుక్తి ముక్తి కొరకు విప్లవించినారు చూడు           //ఇదే//
కొమరన్నకు వారసులూ కోరన్నలు మంగన్నలు
మేలుకొనే ఉన్నారు తెలంగాణ పల్లెల్లో
కోయంటే కోయంటరు సైయంటే సైయంటరు                 //ఇదే//
చల్లబడదు చల్లబడదు తెలంగాణ విప్లవాగ్ని
మళ్ళీ చెలరేగుతుంది ఆగకుండ పోరుతుంది
నక్సల్‌బరి అడుగులోన అడుగువేసి నడుస్తోంది            //ఇదే//
* * * * *
36. ఏ కులమబ్బీ
ఏ కులమబ్బీ
ఏ కులమబ్బీ మాదే మతమబ్బీ               //ఏ//
మట్టిపిసికి ఇటుకచేసి
ఇల్లుకట్టి పెట్టినపుడు
డొక్కలెండి కొండ్రలేసి
ధాన్యరాసు లెత్తినప్పుడు                    //ఏ//
పొగగొట్టాలై పేగులు
కొలిమిసెగలు చిమ్మినపుడు
దగ్గులతో క్షీణిస్తూ
బొగ్గుట్టలు త్రవ్వినపుడు                     //ఏ//
మాడుచెక్కలే తింటూ
మాగాణం దున్నినపుడు
ఎండలలో బండలపై
విగ్రహాలు చెక్కినపుడు                     //ఏ//
పూజకు అందిచ్చు పూల
బుట్టలల్లి ఇచ్చినపుడు
రామకోటి రాసుకునే
కాగితాలు చేసినపుడు                    //ఏ//
పశువుగొంతు కోసి మీకు
చెప్పులు కుట్టిచ్చినపుడు
కూటికింత కూడులేక
కుండలు జేసిచ్చినప్పుడు                  //ఏ//
సన్యాసుళ్లై వస్తే
క్షవరాలు చేసినపుడు
మురికిగుడ్డ లుతికి మల్లె
పూలు చేసి ఇచ్చినపుడు                  //ఏ//
చెల్లవు మీ కల్లబొల్లి
కబుర్లని చెదలుపట్టె
సాగదు మీ పాతరోత
రథం విరిగిపోయినది                 //ఏ//
కులాలనీ కులంలోని
శాఖలనీ వేరుజేస్తే
చెమటోడ్చే మనుషులమూ
చేయికలిపి నిలబడితే                //ఏ//
                                                              1 సెప్టెంబరు 1975
* * * * *
37. పునర్జన్మ
38. ఆపలేరు
27. ఆపలేరు
ఆపలేరు ఆపలేరు
ఇంకమీరు ఆపలేరు
ఈ మట్టిని తొలుచుకొనీ విప్లవాలు లేస్తున్నై
ఎరుపెక్కిన ఈ మట్టికి మా నెత్తుటి స్వాగతాలు              //ఆపలేరు//
మీ చీకటికొట్టానికి నిప్పులంటుకుంటున్నై
మా ఊపిరితిత్తులతో ఊది ఊది మండిస్తాం                   //ఆపలేరు//
బంధనాలు తెంచుకొనీ పల్లెలు వడిలేస్తున్నై
మేలుకొన్న నిరుపేదకు మా నెత్తుటి అభివాదం              //ఆపలేరు//
విముక్తికై శ్రమశక్తులు రక్తార్పణ జేస్తున్నై
పోరాడే యోధులకు మా నెత్తుటి జేజేలు                     //ఆపలేరు//
భూమిమీద సామ్యవాద బావుటాలు లేస్తున్నై
ఎదురుతిరుగు మానవుడికి మా నెత్తుటి లాల్ సలాం       //ఆపలేరు//
* * * * *

పల్లవి
చెరబండరాజు
అంకితం   "నేలతల్లికి "
ఈ మట్టి నాకు
పట్టెడన్నం పెట్టి పాలు తాపింది

1. యువతరమా......
2. దీపం
3. పల్లవి
4. నడవాలి నడవాలి
5. ఒకే చెట్టుకొమ్మలు
6. ఎండావానలలోన
7. ప్రవాహం
8. కత్తిపాట
9. చరిత్రపుష్పం
చరిత్ర పుష్పం
పనిచేయని పైతరగతి
పద్మాసనం వేసుక్కూర్చున్న ప్రభు సంతతి
అదే పనిగా జనం పేరు జపిస్తోంది
గరీబీ హఠావో అంటోంది
శూన్య కమండలం ఒయ్యారంగా వొంచి
గాలిని చిలకరించి
అది రాజనీతి విభూతి పెట్టకమానదు
అవసరాన్నిబట్టి కన్నీరూ పెట్టుకుంటుంది
మంగముళ్ల మార్గాలేవో
మొసళ్ల మోసాలేవో
కనిపెట్టి మసలుకోవడం
కళ్లున్న వాళ్లు చేసే పని
ఇంటింటికీ మట్టిపోయ్యే అనే నానుడి
మరీ పాతది నిన్నటిదీ నిజంలేనిది
గ్యాస్ స్టౌ లొచ్చేసాయి
ఆ తరగతి వాళ్లు
ఒక మెట్టు పైనున్న వాళ్లు
ఎక్కిన నిచ్చెన తన్నేసిన వాళ్లు
మాటల్తో కోటలు దాటే సమాజంలో
వొట్టి గ్యాస్ కొట్టేవాడే సామ్రాట్టు
పద్మాసనం కొంగజపం పనివాడికి అన్నం పెట్టదు
వాడు రెక్కల్ని నమ్ముకొని అమ్ముకుంటాడు
పనివ్వండి పనికి తగిన ప్రతిఫలమివ్వండనీ
ఉగ్రుడవుతాడు ఉద్యమిస్తాడు
వాడి పొట్ట గొట్టినవాడు
అట్టడుగు వర్గాల కోపాగ్నిజ్వాలల్లో
భగ్గున మండి బుగ్గి అవుతాడు
కాలంతో కష్టజీవి
చరిత్ర సారథి వాడే
వాడికెపుడు తిరుగులేదు
* * * * *
10. పోనీ
11. ఆరో ప్రాణం
12. చెట్టుతో
13. తనూ - నేను
14. దుర్గం
15. అలలు
16. మా పాప మాట్లాడుతోంది
17. ప్రభాతం
18. హక్కు
హక్కు
చెట్లలో ప్రాణం వుందని నరకొద్దనను
ప్రకృతి కందమని ఆకులు కొయ్యొద్దనను
కొమ్మలు చెట్లచేతులని విరవొద్దనను
ఎందుకంటే
నాకు గుడిసె కావాలి
* * * * *
19. గుడిసె బిడ్డ
20. ఏమిటది?
21. ఓ నా మేకా !
22. జూన్ 26
23. ప్రవేశం
24. వెయ్యి పూలు
వెయ్యి పూలు
ఉదయాస్తమయాలలో
ఖైదీల కన్నీటితో పూసిన
ఎర్రగన్నేరు పూలు నిర్మలంగా మెరుస్తున్నాయి
తెంచకండి
ఎందరు నిరపరాధుల జీవితాలు
ఈ బందిఖానాలో సమాధి చేయబడ్డాయో
మల్లెలు పరిమళాల అంజలి ఘటిస్తూ
తెల్లగా విచ్చుకుంటున్నాయి
మలిన పరచకండి
సమతాస్వాతంత్ర్యాల కోసం
పోరాడిన వీరులు
ఎందరిక్కడ నరకబడ్డారో
పిరికితనంతో రాజీపడకండి
వీరవారసత్వాన్ని నిలపండి
నేరవ్యవస్థ మీద తీవ్రంగా
ప్రతి ఖైదీ హృదయం
ప్రతీకారం పునాదిగా
జ్వాలాపుష్పమై విప్పారుతోంది
అనుమానించకండి
వెయ్యిపూలు వికసించనీండి
వెయ్యి ఆలోచనల ఘర్షణ పడనీండి
* * * * *
25. నేతి బీరకాయ నేస్తం
26. హమాలన్నా - కూలన్నా
27. అర్జీ
28. గోదావరి పొరలుతుంది
* * * * *