Thursday, May 23, 2013

SRI SRI - The protagonist of Telugu Unity

SRI SRI not just desired, but craved for, Telugu unity and was totally opposed to the separate Telangana demand and movement. Were he to be alive this day, he would have certainly opposed the present separatist movement too and worked for Telugu unity. I am here-under giving some Telugu verses by him exhorting Telugu unity and deprecating the separatist agenda.


తెలుగు జాతి ఐక్యత కోసం పరితపించిన, ప్రబోధించిన మహాకవి శ్రీ శ్రీ:

అప్పటి ప్రత్యేక తెలంగాణా వుద్యమాన్ని, వాదాన్ని ఖండిస్తూ శ్రీ శ్రీ రాసిన కొన్ని కవితల్ని (కవితా భాగాలను) ఇక్కడ ఇస్తున్నాను. ఆయన బతికివుంటే నేటి ప్రత్యేకవాద వుద్యమాన్ని సైతం తీవ్రంగా ఎదిరించివుండేవారనటంలో సందేహం లేదు.

ఉగాది గీతి
ఉగాది శుభతరుణాన
వసంత ప్రథమ దివసాన
మనోజ్ఞ విభాత సమయాన
మహాంధ్ర జనాళి సమ్ముఖాన
కలతలే తరగలై లేస్తుంటే
కక్షలే
గాలులై వీస్తుంటే
కలుష
జీమూతాలు మూస్తుంటే
కుట్రలే
కుక్కలై కూస్తుంటే
ధరియించి పెదవిపై దరహాసం
భరియించి
యెడదలో పరితాపం
విరచింతు
నీనాటి నవగీతం
చిలికింతు
విజయాంధ్ర నవనీతం
తెలుగునాడును పెద్ద చౌరస్తా
నావహించిన
పిచ్చి చాదస్తా
లవఘళించే
భ్రమలు ఛేదిస్తా
మలుపులన్నీ
దిద్ది తీరుస్తా
ఎవరురా ఆ గొప్ప మొనగాళ్లు
మతిలేని తలకిందు గిజిగాళ్లు
నాయకుల మనుకునే మగవాళ్లు
ఐకమత్యం చెరచగలవాళ్లు
తెలుగుతల్లిని పంచుకుంటారా
తెలుగు నెత్తురు పంచుకుంటారా
తెలుగు గొంతుక చించుకుంటారా
తెలుగు తాడే తెంచుకుంటారా

అంతస్సమర భీతి పుట్టించి
అభివృద్ధి పెడదారి పట్టించి
లేనిపోని పుకార్లు పుట్టించి
సత్యానికి సమాధి కట్టించి
ఎవరురా విరగబడుతున్నోళ్లు
ఆస్తులూపాస్తులూ ఉన్నోళ్లు
మస్తుగా దేశాన్ని తిన్నోళ్లు
జరుపుతా రీ జులుం ఎన్నాళ్లు
తిరగబడుతున్నారు పేదోళ్లు
కూటికీగుడ్డకూ లేనోళ్లు
చదువులూ సాములూ రానోళ్లు
విప్పుతారిక వేనోళ్లు
వీళ్లకోసం నేను నిలుచుంటా
వీళ్ల బాధ్యతలు నాకు తెలుసంటా
రేపటికి వారసులు వీరంటా
వీళ్ల ధాటికి ఎదురు లేదంటా
కళింగాంధ్ర త్రిలింగాంధ్రాలు
కాకతీయుల మధురబంధాలు
రాయలేలిన ఏడు సంద్రాలు
రాగానురాగ ప్రబంధాలు
తెలుగుజాతిని శిలువ తీస్తున్న
తెలుగు ఖ్యాతిని నలుపు చేస్తున్న
విశాలాంధ్రను చీల్చజూస్తున్న
పిశాచాలను తరిమివేస్తున్నా ...

[ఆకాశవాణి ప్రసారితం: 29-03-1973; ముధ్రణ: ఉపాధ్యాయవాణి, ఏప్రిల్ 1973.]
[శ్రీశ్రీ ప్రస్థానత్రయం: భాగం 1: కవితాప్రస్థానం (pp. 247-248), మనసు ఫౌండేషన్, శ్రీశ్రీ శత జయంతి, 30 ఏప్రిల్ 2010; అడ్రసు: 8-2-611/3, Nishan-e-Iqbal, Ground Floor, Road No. 2, Banjara Hills, Hyderabad - 500 034. Ph: 040 - 23323760]
* * * * *
శ్రీశ్రీ ప్రస్థానత్రయం: భాగం 1: కవితాప్రస్థానం (pp. 176-177):
జన్మదినోత్సవం
[some excerpts]
పాపం అమాయకుడు తెలుగువాడు
మద్రాసునుంచి పొమ్మంటే కర్నూలుకు వెళ్లాడు
కర్నూలు కాదనుకుని హైదరాబాదు కొచ్చాడు
ఇక్కడ్నుంచి పొమ్మనడం ఏ భాషలోనూ సాధ్యం కాదు
.................................................
తెలంగాణ జెండామీద ద్వేషం లేదు నాకు
అది అఖిలాంధ్ర పతాకం అయితే మరీ ఆనందిస్తాను
అది ఐరాస లో ఎగిరితే దానికి సగర్వంగా శాల్యూట్ చేస్తాను
ఐరాస దాకా ఎందుకు
అంతమంది తెలుగువాళ్లం
ఐకమత్యంగా వుంటే
యావద్భారతంలోనూ రాణించగలం
పిండికేతిగాళ్ల తోలుబొమ్మలాటలు కట్టించగలం
కామరాజకీయాలకు విడాకు లిప్పించగలం
ఏ కీడూ వాటిల్లకుండా
దేశాన్ని కాపాడుకోగలం.
[1969 అక్టోబర్]
* * * * *
శ్రీశ్రీ ప్రస్థానత్రయం: భాగం 1: కవితాప్రస్థానం (pp. 254-258):
రాక్షస ఉగాది
[some excerpts]
p. 256:
తొలినుంచీ నాకుందొక
దురలవాటో సదలవాటో
అనుకున్నది అనుకున్న
ట్లనేయడం, రాయడమూ
అదే నేరమైతే నే
నందు కొప్పుకుంటున్నా
………………………….
తెలుగువాళ్ల మందరమూ
కలసికట్టుగా వుంటే
చక్కగా జీవిస్తామను
సంగతి నేనెరిగిందే
………………………….
p. 257-258:
తెలుగువారి ధీశక్తి
తెలుగువారి క్రియాశక్తి
నలుదెసలా రహించాలి
తెలుగుతనం జయించాలి
ఐదుకోట్ల తెలుగుజాతి
హర్షించాలి
ఆనందం తెలుగునాట
వర్షించాలి
తెలుగు వాడి తెలుగు 'వాడి'
దీపించాలి
తెలుగునాట తెలుగుపాట
వ్యాపించాలి
తమ గమ్యం తెలుగువాళ్లు
చేరాలంతే
ఈ ఉగాదివేళ
నేను కోరేదింతే
రచన: 12-04-1975.
* * * * *