Tuesday, August 16, 2011

Garimella's songs and poems - 'Anyayakalam Dapurinchindipudu' and a few others.

అన్యాయకాలంబు దాపురించిందిపుడు!

అన్యాయ కాలంబు దాపురించిందిపుడు
అందరము మేలుకోవాలండి

మాన్యాలు భోగాలు మనుజులందరి కబ్బు
మార్గాలు వెతకాలి రండి
–

ఏటి పొడుగున దున్ని యెరువేసి నీరెట్టి నూర్చి
పండించేది మనమంతా

గోటు చేయుచు బూతుకూతలను కూసి
కలకొట్టి కొనుపోవుటింకొక
రొంతా

పొగలలో, మరలలో పొగిలి పొగిలి సరకు
పుట్టించి యిచ్చేది మనమంతా
తొగరు వాతెర సొగసు
తొయ్యలుంతో కలిసి
విరగబడు చుండు టింకొకరొంతా

కూలి చాలక, కడుపు మాడుతూ గుహలలో
కుందుతూ కుళ్లడము మనమంతా

గాలి మేడలలోను కమ్మతావులలోను
గర్వముగ
భోగమింకొకరొంతా?

[మొట్టమొదట చిత్రగుప్త లో అచ్చయి, 1938 లో రాజమండ్రి బుక్‌సెల్లర్స్‌ వారు ప్రకటించిన జాతీయ గీతముల పుస్తకంలో ప్రచురించబడిన గరిమెళ్ళవారి విప్లవ గీతం] {courtesy: B. Krishna Kumari, పిడుగుల జడి గరిమెళ్ళ [గరిమెళ్ళ సాహిత్యం – వెలుగునీడలు], బి. కె. బుక్స్‌, విజయవాడ, జూన్‌ 1993.}

* * * * *

కర్షక రాజ్యం

కర్షకులారా లెండి, మన కాంగ్రేసునకు పదండి!
సంఘర్షణ చేయండి
– మన స్వాతంత్ర్యము చాటండీ //కర్షకులారా//

పండించుట మనమైతే – బాగా పండెడిది పుడమియైతే ఈ
దళారీ జమీన్
‌దార్ల పెద్దతనమది మన కిక యేలా? //కర్షకులారా//

అందర మొకటవుదామోయి – దీర్ఘ యాత్ర లెన్నో చేదామోయి
మందుల
మాట వినద్దోయి - రాజ్యం మనదవాలీ ప్రొద్దోయి //కర్షకులారా//

* * * * *

జన్మభూమిని

జనులెల్లరికి నేను జన్మభూమినిరా
ఛేదించవయ్యా అసమాన
భూతముల

ఆనందమున నన్ను అలరించువారు
మీరలే మీరలే మేలుకొను డింక

ఆసపోతులకంత అధికారమేలా
మోసకృత్యంబులందు మోహంబులేలా

పెద్దలకు లాభాలు బాంకుల్ల నిండా
పేదలకు దు
:ఖాలు హృదయాల నిండా

నీది నాదను అన్యాయంబు వీడు
మనము మనదనెడు సద్గానంబు పాడు

మీ ఇల్లు మీ సుఖము మీ ధనముతోనె
మేదినీ తలమెల్ల
మెరయుచుండాలి

సైన్యాలు వార్నెపుడు రక్షించ వలెనో
కర్షకుల
కార్మికుల శిక్షించవలెనా?

భాగ్యవంతుల వైభవంబు లంటె నాకు
బాధించు వ్రణమని బాగా తెలియండి

కర్షకులు కార్మికులు కలవండి వేగ
వార్షికోత్సవములు జరపండి వేగ

ఆనందమున నన్ను అలరించు వారు
మీరలే మీరలే మేలుకొనుడింక
!

* * * * *


మహాత్మా గాంధీ

వినురా! నా ప్రియ సహోదరుడా సోదరుడా
భారత
భావి భాగ్యశేఖరుడా!

గాంధి చెప్పిన త్రోవ నడురా! దేశ - ఘనుల పాలన మొక్క –
గడియ చేపడురా //వినురా నా ప్రియ సహోదరుడా//

సామాన్యుడనుకోకు మతని దైవ సంకల్పముర వాని –
జనన
మీయవని //వినురా నా ప్రియ సహోదరుడా//

కాయంపు రుచి యణగ ద్రొక్కి – ఆత్మ కళ చేతపట్టెను
కడగండ్ల
దక్కి //వినురా నా ప్రియ సహోదరుడా//

పరమ తపమున కాని రాదు – కార్యపరత మాత్రనె దాని –
గాంచె నీ జోదు
//వినురా నా ప్రియ సహోదరుడా//

కత్తిని నిరసించు సతతము – స్వస్థ చిత్తవృత్తియె వాని –
చేతి యాయుధము
//వినురా నా ప్రియ సహోదరుడా//

చేతితో నూలు వడుకుమురా! జరి – నేత గుడ్డలు కట్టి –
నిరతముండుమురా
//వినురా నా ప్రియ సహోదరుడా//

కోర్టు సంబంధము విడురా! ఆ కూపంబులోపల –
కూలిపోకుమురా
//వినురా నా ప్రియ సహోదరుడా//

నిమ్నజాతుల నెత్తుమోయి – వారు నీరసించిన యెడల –
నిక
నీకు గోయి //వినురా నా ప్రియ సహోదరుడా//

కాంగ్రెసు కమిటీలు పెట్టు – దేశ గతి చెప్పి ప్రజనెల్ల
కలవరము పెట్టు! //వినురా నా ప్రియ సహోదరుడా//

* * * * *

మహాత్ముని సందేశము

వినుడీ! వినుడీ! ఓ జనులార! విని –
ధన్యత నొందుడి – జనులారా
పతిత
పావనుడు – పురుషోత్తముడగు
గాంధి మహాత్ముని
– ఘనసందేశము //వినుడీ వినుడీ//

ఖద్దరు కట్టుడి జనులారా మన
కలిమి బలములది జనులార !
రాటము గొని యారాటముడిగి పో
రాటము లేకను పొంది సుఖాంతము
//వినుడీ వినుడీ//

గ్రామోద్ధరణకు జనులారా ఇక గడగుదమండీ జనులారా!
నిప్పచ్చరముల
నిలయములాయెను పడిన వృత్తులను
పైకి తీయుదము
//వినుడీ వినుడీ//

పంచమ జాతిని జనులారా మన పక్షము గొందము జనులారా
మతమనగను మన
యాత్మోన్నతికే – మానవైక్యతను
మాప
నేర్పడదు //వినుడీ వినుడీ//

చేతిపనులుడుగ – జనులారా! మన ఖ్యాతి నశించెను జనులారా!
హస్త
నిపుణతను ధ్వంసము చేసిన – పరుల చేతలకు
బానిసలగుదుము
//వినుడీ వినుడీ//

శాంతము తగునో జనులారా – అది శ్రేయమన్నిటికి జనులారా!
ప్రేమ
చేతనే – పగతుని గెలుతుము – రక్తపాతములు
రాక్షస
మతమగు //వినుడీ వినుడీ//

సత్యమహింసలు జనులారా! మన శస్త్రాస్త్రములో జనులారా!
సమయము కనుగొని
– సత్యాగ్రహమున స్వాతంత్ర్యంబును
సంపాదింతుము
//వినుడీ వినుడీ జనులారా//

* * * * *

స్వరాజ్యము

అన్నలార రండీ మన అమ్మ నుడి వినండి ముం
దున్న
పని కనండి – ఏమన్న జడియ కండి //అన్నలార//

పర ప్రభుతను ద్రోల – యల – బాధ్యత సుధ గ్రోల
వర సిరులను నేల – యనువైన యదను చాల //అన్నలార//

ఆంగ్ల బిరుదు మాని – అల ఆంగ్ల కోర్టు మాని
ఆంగ్ల
సేవ మాని – మరి ఆంగ్ల ప్రభుత మాని //అన్నలార//

ఆంగ్ల విద్య మాని – అల ఆంగ్ల దుస్తు మాని
ఆంగ్ల
కల్లు మాని – అల ఆంగ్లేయత మాని //అన్నలార//

కొట్టతిట్ట వద్దు మరి – గొణగ సణగ వద్దు
పట్టుదలను బూను
– డల ప్రభుత నెల్ల మాను //అన్నలార//

కత్తిభయము మాని – పశుశక్తి నూత మాని
ఆత్మబలము బూని
– గైకొనుడి మాతృముక్తి //అన్నలార//

కాంగ్రెసు మన తల్లి – కాంగ్రెసె మన గురువు
కాంగ్రెసె మన
దైవంబును – దాని మాట వినండి //అన్నలార//

* * * * *


Garimella's songs and poems - maa koddi tella doratanamu, and a few others.

మాకొద్దీ తెల్ల దొరతనము!

పల్లవి: మా కొద్దీ తెల్ల దొరతనము దేవ
మా కొద్దీ తెల్ల
దొరతనము

అనుపల్లవి: మా ప్రాణాలపై పొంచి – మానాలు హరియించె //మాకొద్దీ//

చరణములు

1. పన్నెండు దేశాలు – పండుచున్నాగాని –
పట్టెడన్నమె లోపమండి/
ఉప్పు ! ముట్టుకుంటే దోషమండి!
నోట
– మట్టికొట్టి పోతాడండి!
అయ్యొ! కుక్కలతో పోరాడి
– కూడు తింటామండీ //మాకొద్దీ//

2. వర్తకంబునకొచ్చి – పట్టణంబుల పట్టి – రాజ్య మొక్కటి అల్లినాడు
దాన్ని
– రాణి కప్పగించినాడు!
రాణి
– పత్రమ్ము చించేసినాడు!
ఈ చిత్రమిదేమన్న
– శిక్షిస్తానంటాడు //మాకొద్దీ//

3. కోర్టులంటూ పెట్టి – పార్టీలు పుట్టించి –
స్నేహభావము చంపినాడు
ద్రవ్య
– దాహము కల్పించినాడు!
చెడ్డ
– యూహలు కడు పెంచినాడు
మా
– ఆహారముల ద్రుంచి – ఆహా! యనిపించినాడు //మాకొద్దీ//

4. ప్రజల క్షేమంకోసం- పెట్టిన సంస్థలు – ప్రభులకోసం –
మార్చేస్తాడు
వాటి
– ప్రజల శత్రులు చేసుతాడు!
మమ్ము
– గజిబిజి లాడ చేస్తాడు
వాడి
– గడబిడ వర్ణింప – కాదు బ్రహ్మ కైన //మాకొద్దీ//

5. నూటనలుబదినాల్గు – నోటికి తగిలించి – మాటలాడ వద్దంటాడు!
మమ్ము
– పాట పాడ వద్దంటాడు!
తనను
– దాటి వెళ్ళవద్దంటాడు!
అయ్యొ
– చేటు తెచ్చుకొ మమ్ము – చెడిపోవమంటాడు //మాకొద్దీ//

6. ఘోర శాసనాలు – కూడదీసి మాదు – సారములెల్ల పీల్చాడు!
సంసారము లెల్ల
కూల్చాడు!
మా చీరలనెల్ల
వొల్చాడు!
బంగారములెల్ల
దోచాడు!
వాడు
– ధనవంతులనుబట్టి (తైతక్కలాడ్తాడు) దడదడలాడ్తాడు //మాకొద్దీ//

7. ధనముకోసం వాడు దారిచేసికొని – కల్లుసారా యమ్ముతాడు!
మాదు
– ముల్లె మూటలు దోచినాడు!
ఆలి
– మెళ్లో పుస్తెలు త్రెంచినాడు!
మాదు
– కళ్ళల్లొ దుమ్మేసి – కాటికి దరిచేస్తాడు //మాకొద్దీ//

8. పంటపోయిన గాని – పన్నులు విడువక –
వెంట కరణాలంపుతాడు
వారి
– వెంట తహశీల్దార్నంపుతాడు!
లే కుంటే ఉద్యోగం తీస్తాడు!
మా ఇంటిలోపల
యిట్లు – యిడుమల్లు పెడుతాడు //మాకొద్దీ//

9. ఏడాది కేడాది – కెక్కువ సిస్తేసి – ఈ భూమి నాదే నన్నాడు
మమ్ము కూలికి దున్నుమన్నాడు
కడుపు మంటతో చావ
మన్నాడు
అయ్యొ బానిసలకు వాడు
– ప్రభువౌతనన్నాడు //మాకొద్దీ//

10. స్వరాజ్యమందిర – స్థాపితమైనట్టి – జండాలన్నియు పీకుతాడు
దేశం ముండా మొయ్యమంటాడు
వాడు
– బండతనము చూపుతాడు
ఈ ఛండాలపు వృత్తి
– స్వీకరించెను నేడు //మాకొద్దీ//

11. దండు పట్టుకవచ్చి – తగుదునమ్మా యంచు
దార్ల
వెంబడి త్రిప్పుతాడు!
జాక్
‌ జెండా మీది కెత్తుతాడు
దానికి దండం పెట్టమంటాడు
వాడి గుండుబలం క్రింద
– కూల రమ్మంటాడు //మాకొద్దీ//

12. మాదు నెయ్యము చెడగొట్టుతాడు
సేన
కయ్యొ పాపము గట్టుతాడు
అయ్యొ వెయ్యేల
! పోలీసు విధులు – మరిపిస్తాడు //మాకొద్దీ//

13. గాంధీటోపీ పెట్టి – పాఠశాలకు బోవ – రావద్దు రావద్దంటాడు!
రాట్నం బడిలో పెట్టవద్దంటాడు
టోపీ తీసి వీపుల
బాదుతాడు
వాడి రాజద్రోహమంత
– రాట్నములో ఉన్నదట //మాకొద్దీ//

14. నూరుమంది మలబారు వాసులను – కూరినాడొక పెట్టెలోన
నోట నీరు పోయడు, దేవు నాన!
గాలి దూరనీయడించుకైన
వాడి దారుణత్వమెట్లు – తరిమివైతువొ దేవ //మాకొద్దీ//

15. ప్రభువు గాంధితోడ – భారత దేశమాత –
పరమ తపము చేసినాది
ధర్మదేవత
ప్రత్యక్షమైనాది
కోరిన
వరము లిస్తానన్నాది!
ఆ దొరల
గుండెలలోన – దడదడ పుట్టింది //మాకొద్దీ//

16. చూడియావుల కడుపు – వేడివేడి మాంసం –
వాడికి బహు యిష్టమంట
మాదు పాడి పశువుల కోస్తాడంట!
మా మతము పాడు చేస్తాడంట!
మా చూడి యావుల మంద – సురిగి, యింటికి రాదు //మాకొద్దీ//

17. చిత్తరంజన దాసు – చిన్నారు కొమరుని –
చెయి విరచి చెర బెట్టినాడు
అతని పెత్తనంబును బట్టినాడు!
వారి ముత్తైదువుల
పట్టినాడు!
వాడి సొత్తుకు నిలమీద
– చోటు లేదన్నాడు //మాకొద్దీ//

18. మా చీరాలను యిప్డు – చేరినాడు –
చూచి సిగ్గును పొందబోడోయి!
ఇంక
బీరాలు పలుకుతాడోయి!
మాదు సారము గ్రహియింపడోయి!
వాడి దూరాలోచనమెల్ల
– ధూళిలో కలిసింది //మాకొద్దీ//

19. వాటి తాతగారి ముల్లె దాచిపెట్టినయట్లు –
ధాటీ చేస్తా డీ దేశమున!
పో రాడా మాడ్తాడాపైన,
మో మోటము పడడు సుంతైనా
వాడి పాటుపాడై పోను
– మాట చెపితే వినడు //మాకొద్దీ//

20. తెల్ల దొరల సేవ – వల్ల బ్రతుకుట
పెద్ద నల్లని మచ్చని యెంచరోయి!
జాతి కల్లా తప్పని యెంచరోయి
దైవ మొల్లడంచు తల్చరోయి
భూమి తల్లీ యేడ్పులు వినరోయి!
వారి యుల్లమెల్ల
– సన్నికల్లులై పోయాయి! //మాకొద్దీ//

21. ఎవరి యనుమతిపైన – హిందూ దేశమునందు
పరిపాలనము పెట్టినాడు?
వీడు ఎవరికీ జవాబు నీడు
ధర్మ
మార్గము నంటుకొని పోడు
వీడి దారుణత్వముకింక
తగిన యీడే లేదు //మాకొద్దీ//

22. వాడి శాసనాలు – మాడిపోను, వాటి గోడియె మాకొద్దు తండ్రి!
ధర్మ
దేవుడె మా రక్ష సుండి!
ప్రజల
ప్రేమయె మాకు దిక్కండి
కష్ట
కాండమె మా పాలు సుండి
ఈ సృష్టి మమ్ము చూచి
– సుందరమన నిండి //మాకొద్దీ//

23. దొరల బాధలు మాకు – తొలగించుమో తండ్రి
నిరతము నిను గొల్తుమయ్య
!
నీదు చరణధ్యానమె విడువమయ్య
మేము మరువము మా ధర్మమయ్య
మేము ఐకమత్యముతోడ అలరారుతామయ్య //మాకొద్దీ//

24. గుండు పట్టుకొ మమ్ము – కూల్చ వచ్చినగాని -
కూర్చున్న చోటుల వీడము!
పాడుకొంటూ రాట్నం త్రిప్పుతాము
రాజ్యసూత్రము వడి, వడుకుతాము!
దేవ
శాంతిని తప్పము – సంతసం విడువము //మాకొద్దీ//

25. దేశభక్తులనెల్ల దోషు లంచును పెద్ద –
మోసగాండ్రని యెంచుతాడు
శాంతి నాశకులని పిలుచుతాడు
దొంగలతో సరిగ
మము చూచుతాడు!
వాడి వూసు యెట్టిదొ కాని
– చూచి యోర్వలేడు //మాకొద్దీ//

26. బ్రాహ్మణా బ్రాహ్మణ – పంచమ బ్రాహ్మణ –
భేదపు తెగలు మీకేల?
మీ భేదాలు వడి కాల్పరేల
!
చెడ్డ బోధలకు లొంగిరేల?
యీ మాధుకరపు వృత్తి – మరగినారది యేల? //మాకొద్దీ//

27. ఎవరెన్ని చెప్పిన హిందూదేశవాసు – లేక సోదరులె సుండీ
అంటూ దోషము మాకు లేదండీ
పాపమంటూ చాటుదాము రండీ
ఈ కుంటి వాదనలు
– గూటిలో పెట్టండి //మాకొద్దీ//

28. స్నానధ్యానము చేసి – రామ కృష్ణ యంచు -
దేవుడి గుడిలోకి రండీ
అభి షేకమతనికి చేయండి
నిర్మలత్వ
మాత్మను పొందండి
ధర్మ
మార్గమును తగిలి, మాలలూ రండి //మాకొద్దీ//

29. జయము నపజయమును – త్రాసులోపల పెట్టి -
చక్కగ తూస్తామంటారు
ధర్మమె జయమని నమ్ముతారు
దైవ
నైజము గుర్తెరుగలేరు
పప్పు భోజనం కోసము
– పుట్టామనుకొంటారు //మాకొద్దీ//

30. రాట్నలక్ష్మి నవ్వు – రంజిల్లు మోముతో –
పాడుచున్నది నోటి నిండా
కరవు మాడుచున్నది దాని యెండా
స్వేచ్ఛ
తిరుగుచున్నది దానిగుండా
ఆ దొరల
తేజంబెల్ల – తూల్చే జండా యుండా //మాకొద్దీ//

31. ఎన్ని జన్మములందు – ఏమి నేరము చేసి -
కన్నుగానక తిరిగినామొ
ప్రజల
అన్నమెల్లను క్రుమ్మినామొ
దైత్యుల
కన్న చెడ్డగ మెలగినామొ
నేడు దున్నలవలె నిట్లు
– దొరకితిమి దొరలకు //మాకొద్దీ//

32. ప్రాపంచమెల్లను – పట్టి పిండేటంత పశుబలము వాడికుందంట
దాన వశ పరచుతాడు మమ్మంట
మమ్ము కసిదీర కొట్టుతాడంట
వాడి శషభిషలెల్లను చెపుతాడు మా యింట //మాకొద్దీ//

33. స్వచ్ఛతేజముతోడ – స్వేచ్ఛావధూమణి -
కారాగృహమున వేచియుంది
పూలగుచ్ఛములను దాల్చియుంది
మీకు ముచ్చటలను తెల్పుతుంది
యీ చచ్చు రాజ్యము వీడి సరిగ
జైలుకు రండి! //మాకొద్దీ//

34. విచ్చలవిడిగాను విప్పి రెక్కలు మీరు -
విహరింపవచ్చు – మీరచట
స్వేచ్ఛ
నిచ్చ నెక్కగ వచ్చు నచట
దైవం మెప్పులందగవచ్చు నచట
తల్లి కచ్చియున్న రుణము నర్పింపగా వచ్చు //మాకొద్దీ//

35. సకల దేశములార – సత్యవర్తనతోడ
సారించు డిటుల మీ దృష్టి
యింక
కనుడి హైందవ పుష్టి
వేగ
తెరవు దొరకుట క్రొత్త సృష్టి
ఎట్టి దండన
లెదురైన – కాదు మాకు నష్టి //మాకొద్దీ//

36. ధర్మపక్షము నేడు – దారుణమైనట్టి బడలిక పాలయ్యె నయ్య
దాని వదలించుకొనలేదయ్య
నీదు పదునగు ధారనీవయ్య

నీదు పదములపై వ్రాలి – ప్రార్థించినామయ్య //మాకొద్దీ//

37. ప్రపంచమున శాంతి – ప్రేమ దీపంబులు వెలిగించె నీ దేశమంత
గాంధి తెనిగించె నీ క్రొత్త వ్రాత
స్వేచ్ఛ మొలిపించె మన శక్తి చేత
బలము దుర్బలమను – భేదమెచ్చట లేదు //మాకొద్దీ//
38. మా పాపమునెల్ల బాపి రక్షించుమా – పాపనాశన! ధర్మమూర్తీ
యిటుల
కోపముంచకు – న్యాయమూర్తీ
ఆపదల
బాపుమో చక్రవర్తీ
నీ వ్యాపారమొకసారి
– నెరపుము పృథ్విపై //మాకొద్దీ//

39. దీనుల పాలిటి – తేజమవీవని – వీనులారగ నేను వింటి
కోటి దీనుల
మా భూమికంటె
మము సమాన
యుగముగ చూడుమంటి
మా ప్రాణాలైన
నోర్చి – మాన మిమ్మంటి //మాకొద్దీ తెల్లదొరతనము//

* * * * *