తెలుగు జాతి ఐక్యతా వేదికలో చేరండి!
సంకుచిత మనోరాగాల (సెంటిమెంట్ల) కు దూరంగా
సమైక్య తెలుగు రాష్ట్ర వికాసానికి కృషి చేయండి!
తెలుగు తల్లిబాసగా గల మన తెలుగు ప్రజల్లో అత్యధిక భాగం ఎన్నో కలలు కంటూ, సమున్నత ఆశయాలతో, అపూర్వ త్యాగపూరిత పోరాటాల క్రమంలో చిట్టచివరకు ఒక సమైక్య సాంఘిక, ఆర్థిక, రాజకీయ అస్తిత్వాన్ని, ప్రత్యేక ప్రతిపత్తిని, హిందూదేశ రాష్ట్రాల్లో, ముఖ్యంగా దక్షిణ భారతంలో, ఒక గౌరవనీయ స్థానాన్ని సంతరించుకున్నాం. అలాంటి మన ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి నేడు ఎన్నోకుయుక్తులు, కుట్రలు-కూహకాలు జరుగుతున్నాయి. మన చరిత్ర, మన సంస్కృతి, మన ప్రజాపోరాటాల వారసత్వాలను మరిచో, లేక తెలియకో, అనవసరంగా, అన్యాయంగా విద్వేషభావాలు రెచ్చగొడుతూ సాగే తప్పదారి పట్టిన ప్రాంతీయోన్మాద వుద్యమాలు విచ్చలవిడిగా చెలరేగుతున్న విషమ ఘట్టమిది; సమైక్యతావాది అంటేనే శత్రువులా, వింతజంతువులా చూసేంతమేరకు ప్రాంతీయతత్వ గరళాన్ని (పాయిజన్ని) అమాయక ప్రజల హృదయాల్లో నింపివేస్తున్న రోజులివి. ఈ నేపథ్యంలో – కాదు, కాదు, వేలసంవత్సరాల ఘనచరిత్ర గల మన తెలుగు ప్రజలం నేటి విషపూరిత వాతావరణంలో సంకుచిత సెంటిమెంట్లకూ, స్వార్థపర శక్తులు రెచ్చగొట్టే ప్రాంతీయతత్వ మనోద్రేకాలకూ బలియై, శాతవాహనుల కాలంనుండీ, తర్వాతి కాకతీయుల, తదనంతర విజయనగర సామ్రాజ్యపు, గోల్కొండ నవాబుల కాలపు, ఆనక నిజాం కాలపు ప్రథమదశలోనూకూడ ఐక్యంగా వున్న వివిధ ప్రాంతాల తెలుగు ప్రజలం, "తెలుగుతల్లి బిడ్డలం, తెలంగాణ వీరులం, మాతృదేశ ముక్తికొరకు పోరుసల్ప కదిలినాం! " అంటూ పదం పాడుతూ, కదం తొక్కుతూ నేటి తెలంగాణ ప్రాంత పీడిత ప్రజానీకం జరిపిన వీరోచిత, అపూర్వ త్యాగమయ పోరాటాల పర్యవసానంగా, స్వామీ రామానంద తీర్థ, మాడపాటి హనుమంత రావు, సురవరం ప్రతాప రెడ్డి, బూర్గుల రామక్రిష్ణా రావు, గోవింద దాస్ షరాఫ్, రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, నారాయణ [కోదాటి, కొమరగిరి, (1969 నుండీ వేర్పాటువాదిగా ముందుకొచ్చిన) కాళోజీ నారాయణ రావుల] త్రయం, తదితర అనేకమంది నేటి తెలంగాణ (మరియు పాత హైదరాబాదు రాష్ట్ర) ప్రముఖ నాయకుల ప్రోత్సాహ ప్రోద్బలాలతో, ఇంకా ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, అయ్యదేవర కాళేశ్వర రావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవ రెడ్డి, చండ్ర రాజేశ్వర రావు, పుచ్చలపల్లి సుందరయ్యల వంటి [నేటి సీమాంధ్ర] ప్రాంత నాయకుల అవిరళ కృషిమూలంగా, తెలుగు ప్రజల చిరకాల వాంఛిత సమైక్య రాష్ట్ర స్వప్న సాకారాన్ని వాయిదావేస్తూ ఫజల్ ఆలీ కమిషన్ చేసిన అవివేకపు సిఫారిసుల్ని తోసిపుచ్చుతూ నాటి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగానూ, నాటి హైదరాబాదు రాష్ట్ర శాసన సభ అత్యధిక మెజారిటీతోనూ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా, ప్రత్యేకించి 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' నినాదంతో నాటి అవిభక్త కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నేటి తెలంగాణ ప్రాంత ప్రజలు చేసిన మహోద్యమ పర్యవసానంగా ఏర్పడిన ఈ సమైక్య రాష్ట్రాన్ని పోగొట్టుకోరాదనే సమున్నత ఆశయం, దృఢ నిశ్చయాలతో ఈ తెలుగు జాతి ఐక్యతా వేదిక మీ ముందుకు వస్తున్నది.
ఇక్కడ ఒక విషయం ప్రత్యేకించి చెప్పాల్సివుంది. మొదట్లో వేర్పాటువాదులు తెలంగాణ చాల వెనుకబడి వుందనీ, దానికి ప్రధాన కారణం 'ఆంధ్ర వలసవాదుల' దగా-దోపిడీలే కారణమనీ ఎక్కువగా నొక్కిచెబుతూ వచ్చారు; నేటికీ ఇలాంటి అపనిందలు వేసేవారి సంఖ్య తక్కువేమీ కాదు. కాని క్రమేపీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందనీ, నిజాం పాలన నాటితో పోల్చుకున్నా, 1956 పరిస్థితితో పోల్చుకున్నా ఈ అభివృద్ధి రేటు యితర ప్రాంతాలలోకంటే ఎన్నో రెట్లు ఎక్కువగా వుందనీ నిర్వివాదమైన గణాంకాలు చూపించబడడంతో వారి వాదాలు పస లేనివని, పూర్తిగా సత్యదూరమనీ తేలిపోయింది. నేడు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలు అభివృద్ధి చెంది వున్నాయి. పోనీ, ఇవి రాజధానీ నగరానికి సంబంధించినవని పక్కకు పెట్టి చూచినా, కరీంనగర్ జిల్లాయే తర్వాతి అగ్రస్థానంలో వుంది. తెలంగాణాకుచెందిన నలుగురు ముఖ్యమంత్రులుండినా తెలంగాణకు ఒరిగిందేమని వాపోయేవారికి, ఏడుగురు ముఖ్య మంత్రులు తమ ప్రాంతానికి చెందినవారే అయివుండినా రాయలసీమ వాసులకు ఒరిగిందేముంది, అన్ని అభివృద్ధి సూచికల్లో నేడు రాయలసీమే బాగా వెనుకబడివుందిగదా అని ఎత్తిచూపాల్సి వస్తుంది. దీనర్థం అభివృద్ధి విధానాలు, వివరాలు అన్నీ అతి సక్రమంగా వున్నాయనీ, సమస్యలే లేవనీ, అంతా బాగానే వుందనీ మేమంటున్నట్లు కాదు. యావత్ హిందూ దేశమే నేడు పేదరికం, నిరుద్యోగం, మానవహక్కుల ఉల్లంఘనలు, నిరక్షరాస్యత, అన్నిటికీ మించి అవినీతి, అధికార దురహంకారం-దౌర్జన్యాల బాధలకు అలమటిస్తున్నది; ప్రపంచ మానవాభివృద్ధి సూచికల్లో అధోభాగాన నిలిచివుంది; ప్రజాప్రయోజనాలకు విఘాతకరమైన, పర్యావరణ వినాశకరమైన అభివృద్ధి, పరిపాలనా విధానాలు దేశ ప్రజల మూలుగులు పీల్చివేస్తున్నాయి అని గమనిస్తే, ఈ సాధారణ దైన్య స్థితిలో భాగంగానే మన రాష్ట్రంకూడ అల్పాభివృద్ధి, అసమాభివృద్ధి జాడ్యాలతో బాధ పడుతున్నదేగానీ, ఏదో ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతంమాత్రమే దారుణ వివక్షకూ, చిన్నచూపుకూ గురయింది, గురవుతున్నదనే భావనలో, వాదంలో నిజంలేదు, అర్థమూ లేదు. మరిప్పుడు ఆయా రంగాలలో వున్న వెనుకబాటునూ, దుస్థితినీ మెరుగుపర్చుకోవాలంటే అన్ని వనరులూ, శక్తిసామర్థ్యాలూ వున్న మన తెలుగుజాతిని విడగొట్టుకోవడం, తద్వారా ఇరుగు పొరుగు రాష్ట్రాల వారి ముందు, సాధారణంగా దేశ ప్రజలందరిలోనూ, అవహేళనలకు గురౌతూ, అభాసు పాలు కావడం పరిష్కారమార్గం కానే కాదు. నేడున్న ఐక్యతను ప్రజల మానసిక పరంగాకూడ మరింత పటిష్టవంతం గావించి, సంకుచిత ప్రాంతీయ విద్వేషాలు, యితర రకాల వైమనస్యాలు విడనాడి సవ్యమైన, సమతా పూరితమైన అభివృద్ధి విధానాలు రూపొందించుకొని, ఐకమత్యంతో ప్రగతిపథంలో ముందుకు దూసుకుపోవడానికి ముమ్మరంగా కృషిచేయడమే ఏకైక పరిష్కార మార్గమని మేము నొక్కి చెబుతున్నాము.
వెనుకబాటుతనం అనే వాదం వీగిపోవడంతో వేర్పాటువాదులు నేడు మాది తెలంగాణా ఆత్మగౌరవానికీ, స్వయంపాలనకూ సంబంధించిన సిసలైన తెలంగాణ వాదమమని బీరాలు పోతున్నారు. తెలంగాణా వాదం అంటే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును కోరే వాదం మాత్రమేనని వేర్పాటువాదులు చేసే ప్రచారం ఎంత మాత్రం సరియైంది కాదు. తెలంగాణా ప్రాంతప్రజల అభివృద్ధినీ, సంక్షేమాన్నీ కోరడం, అందుకు కృషి చేయడమే అసలైన తెలంగాణా వాదం. అసలు తెలంగాణ అంటేనే తెలుగువారు నివసించే భూమి లేక దేశం అనే విశాల అర్థం వస్తుంది. ఇది మేమే కాదు, ప్రత్యేక తెలంగాణావాద పితామహుడు అని చెప్పదగ్గ కీ. శే. కొండవీటి వెంకటరంగారెడ్డిగారు చెప్పిన అర్థం కూడ. ఆయన తన ఆత్మకథ లో ఇంకా, త్రిలింగ పదమే తిలింగ, తెలంగ, ఆనక తెలంగ + ఆనె కలిసి తెలంగానె లేక తెలంగాణ అయిందనీ, తెలుగు అనే పదంకూడ ఇలాగే పుట్టిందనీ చెప్పారు. అయితే ఎక్కువ మంది మేధావులు తెన్ అంటే దక్షిణం అనే ద్రవిడ మూలంనుండి తెనుగు, ఆనక తెలుగు పదాలు పుట్టుకొచ్చా యంటారు. ఏదేమైనా కె. వి. రంగారెడ్డి గారి ప్రకారమే కర్నూలు జిల్లా, శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి లింగం, పశ్చిమ గోదావరి, ద్రాక్షారామ లింగం, కరీంనగరు జిల్లా, కాళేశ్వర లింగం – వెరసి మూడు లింగాల పరిథిలోని ప్రాంతమే త్రిలింగ దేశం – అంటే తెలంగాణం. కనుక ఆ వేర్పాటువాద నాయకుడే ఇప్పటి కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలు మూడూ కలిసిందే తెలంగాణమని ఒప్పుకున్నాడు మరి. ఇంకా, నిజాం పరిపాలనా కాలం తొలిదశలో కోస్తాంధ్ర, 18 వ శతాబ్దం చివరన రాయలసీమ ప్రాంతాలుకూడ నేటి తెలంగాణతో కలిసే వుండేవని చరిత్ర స్పష్టంగా తెలుపుతున్నది. అలాగే, ఆంధ్ర అనే పదాన్ని నేడు వేర్పాటు వాదులు ఒక తిట్టు పదంలా భావించి వ్యవహరిస్తున్నారు గాని 1950ల దాకా తెలంగాణ నాయకులు తాము ఆంధ్రులమని సగర్వంగా చెప్పుకొనేవారు. బమ్మెర పోతన తాను తెనుగు చేసిన భాగవతాన్ని ఆంధ్ర మహా భాగవతం అన్నాడు. చారిత్రకంగా చూస్తే ఆంధ్ర అనే పదం తెలుగు అనే పదంకంటే ఎంతో ముందుగానే రామాయణ, భారతాల కాలం నుండే వుంది. ఆంధ్ర, తెలుగు రెండూ ఒకటే; మొదటిది జాతి (తెగ) పేరును సూచిస్తూ, ఆ తెగ మాట్లాడే భాషకూ వర్తించింది. అలాగే రెండవది ఒక దిక్కులో వుండే ప్రజల్ని (తెన్ = దక్షిణం) సూచిస్తూ, వారు మాట్లాడే భాషకూ వర్తించింది [మరీ దక్షిణాదిన, అంటే తంజావూరు, తిరునెల్వేలి మొదలైన చోట్ల మన తెలుగు వాళ్లను 'వడుగర్' (అంటే తమిళంలో ఉత్తరాదివారు) అని పిలిచే వాడుక కూడ వుంది - మనం వాళ్లకు ఎగువన, ఉత్తర దిశన వుండడంవల్ల]. కనుక, తెలుగు అన్నా, ఆంధ్రం అన్నా తేడా ఏమీ లేదు. కాకతీయ రాజులు తాము ఆంధ్రదేశాధీశ్వరులమని సగర్వంగా చెప్పుకొన్నారు. పోతే, నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణా ప్రజల సాంస్కృతిక పునరుజ్జీవనం అంతా ఆంధ్ర నామారంభితంగానే జరిగిందని తెలియాలి. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయం (హైదరాబాదు, సుల్తాన్ బజారులో) అనీ, రాజరాజ ఆంధ్రభాషానిలయం (వరంగల్లో) అనీ గ్రంథాలయాల స్థాపన, ఆంధ్ర జన సంఘం అని మొదట, ఆంధ్ర మహాసభ అని ఆనక, సాంస్కృతిక, రాజకీయ సంఘాల స్థాపన జరిగాయి. ఆంధ్ర మహాసభ నాయకత్వంలో నిజాం నిరంకుశత్వానికీ, భూస్వామ్య దోపిడీ, అణచివేతలకూ వ్యతిరేకంగా మహావుద్యమమే సాగింది. ఆ క్రమంలో కనీసం ఆంధ్ర అనే పదం తొలగించినా చాలు, ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందనే నిజాం నవాబు రాయబారాలను తమ ఆత్మగౌరవం ఆ పేరులోనే వుందని చెప్పి ఆంధ్రమహాసభ నాయకులు, కార్యకర్తలంతా తిరస్కరించడం జరిగింది. అలాగే, 1956 లో సమైక్య రాష్ట్రానికి ఏ పేరు పెట్టాలని చర్చ వచ్చినప్పుడు కొంతమంది ఆంధ్ర-తెలంగాణ అనే పేరు పెట్టాలనే బలమైన వాదం తెచ్చినా తెలంగాణకు చెందిన అత్యధిక శాసనసభ్యులే ఆంధ్ర ప్రదేశ్ అనే పేరు వైపు మొగ్గు చూపివుండడం కూడ గమనార్హం [అయితే ఈ వేదిక నేడు అవసరమైతే మన రాష్ట్రం పేరును మూడు ప్రాంతాలను సూచించేవిధంగా ఆంధ్ర తెలంగాణ సీమ అని మార్చాలనికూడ కోరుతున్నది]. ఇంతెందుకు, 1922-50 నాటి తెలంగాణ ప్రజల సాంస్కృతిక, భాషాపర, రాజకీయ వుద్యమాన్ని నాడైనా, నేడైనా ఆంధ్రోద్యమం అనే అంటున్నారు. కనుక తెలంగాణా ఆత్మగౌరవం అంతా నాడైనా, నేడైనా ఆంధ్ర పదంతో, తెలుగు జాతి సమైక్యతతో అవినాభావంగా ముడిపడివుందని గ్రహించాలి. ఇక స్వయంపాలన అనేది నేడు కొత్తగా తెచ్చేది ఏమీ లేదు; ఇప్పటికే మన రాజ్యాంగం యిందుకు సంబంధించి అనేక ఏర్పాట్లు చేసివుంది; దీన్ని మరింత మెరుగుపర్చాలంటే స్థానిక స్వపరిపాలననూ, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యాన్ని రక్షించి, పెంపొందించాల్సిన అవసరం, దానికిగాను అవసరమైన సంస్థాగత రక్షణలు కల్పించాల్సిన అనివార్యత మనవద్దేకాదు, దేశవ్యాప్తంగా వున్న సమస్యలే. మన రాష్ట్రానికి సంబంధించి అవసరమైతే శాసన మండలుల హోదా, అధికారాలు గల ప్రాంతీయ మండలులుకూడ ఏర్పాటు చేసి తద్వారా ప్రాంతీయ వివక్షల్ని ఎదుర్కొనడమేగాక, మూడు ప్రాంతాల్లోని వెనుకబడ్డ ప్రదేశాలనూ మంచిగా అభివృద్ధి చేయాలని ఈ వేదిక సూచిస్తున్నది. విడిపోవడడంవల్ల నేటి తెలంగాణా ప్రాంతానికే ఎక్కువ నష్టం కలుగుతుందనీ, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణా జిల్లాలకు తీరని లోటు వాటిల్లుతుందనీ, తాను కూర్చునివున్న చెట్టుకొమ్మను తానే నరుక్కున్న విధంగా అవుతుందనీకూడ తెలియజేస్తున్నాము.
తెలుగు జాతి ఐక్యతా పరిరక్షణ, వికాసాల సమున్నత ఆశయ సాధనా క్రమంలో ఈ వేదిక ఈ కింది లక్ష్యాలు, ధ్యేయాలను నిర్దేశించుకుంటున్నది:
1. తెలుగు మాతృభాషగా మాట్లాడేవాళ్లంతా ప్రపంచవ్యాప్తంగానూ, ప్రత్యేకించి మన దేశంలోనూ, ఐకమత్యంతో, స్నేహసౌహార్దాలతో కలిసిమెలిసి వుండేందుకు దోహద పడడం; అందుకుగాను తగు బోధనాపర, సాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం;
2. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి, అపూర్వ త్యాగాలు చేసి, ప్రాంతీయ విబేధాలు మరిచి తెలుగువాళ్లు సాధించుకున్న సమైక్య రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) ఎట్టి పరిస్థితుల్లో విడిపోకుండా వుండాలనే దృఢ నిశ్చయంతో, అవసరమైనంత మేరకు ప్రాంతీయ స్వయం-ప్రతిపత్తి, అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తగిన ఏర్పాట్లు, సంస్థాగత రక్షణలు కల్పిస్తూ, అవసరమైతే రాష్ట్రం పేరును తెలుగు సీమ అనో, లేక ఆంధ్ర తెలంగాణా సీమ అనో మార్చి అయినా, రాష్ట్ర ఐక్యతా పరిరక్షణకు పాటుపడడం;
3. అయితే రాష్ట్ర ప్రజలందరినీ ఐక్యంగా ఒకే రాష్ట్రంలో కలిపి వుంచాలని హృదయపూర్వక ప్రేమాభిమానాలతో, శక్తివంచన లేకుండా చేసే ప్రయత్నాలన్నీ విఫలమై, రాష్ట్ర విభజనే గనుక అనివార్యమైతే, అప్పుడు రాష్ట్రం రెండుకన్నా ఎక్కువ ఖండాలు కాకుండా వుండేందుకు, అలాగే హైదరాబాదు మహానగరం ఉమ్మడి రాజధానిగా, వివిధ తెలుగు ప్రాంతాల ప్రజల ఐక్యతకు, వీలైతే మళ్లీ భావి విలీనానికి ఆశాదీపంగా వుండేందుకుగాను దాన్ని [ప్రత్యేక శాసనసభాయుతమైన] కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరచడానికిగాను కృషి గావించడం;
4. ఆంధ్రప్రదేశ్ వెలుపల వివిధ రాష్ట్రాల్లో, వివిధ దేశాల్లో వుండే తెలుగు ప్రజలు తమ తల్లిబాసను మరిచిపోకుండావుండేట్లు, అందులో కనీస అక్షరాస్యత అయినా సాధించుకొనేట్లు, ఇద్దరు తెలుగువాళ్లు ఎక్కడ కలిసినా తెలుగులోనే మాట్లాడుకొనే సంస్కృతి అలవర్చుకొనేటట్లు తీర్చి దిద్దడానికి కృషి సలపడం; ఆయా ప్రాంతాలు, దేశాల్లో వారికి భాషాపరంగాను, యితర విధాలుగాను కనీస మానవ హక్కులు, పౌర సదుపాయాలు లభ్యమయేట్లు కృషి చేయడం;
5. ప్రజాస్వామ్య, లౌకిక, సోషలిస్టు సమాజ సాధనకు తెలుగు ప్రజలంతా కట్టుబడి, హిందూదేశంలో అభిన్న భాగంగా, దేశ ప్రగతికోసం, సర్వమానవ సంక్షేమం కోసం పాటుపడేందుకు గాను కృషిచేయడం.
ఈ వేదిక ఆశయంతోనూ, లక్ష్యాలు-ధ్యేయాలతోనూ ఏకీభవిస్తూ, వాటి సాధనకోసం నిబద్ధతతో, విజ్ఞతతో, త్యాగదీక్షతో నిస్వార్థంగా కృషిచేయడానికి ముందుకు రావల్సిందిగా మేము తెలుగు ప్రజలకు, ప్రత్యేకించి తెలంగాణావాసులకు, విజ్ఞప్తి చేస్తున్నాము.♣ ఆశయ సాధనకు, కర్తవ్య నిర్వహణకు అవసరమైన సకల బోధనా, ప్రచార, పోరాట రూపాలనూ పూర్తిగా శాంతియుత పద్ధతుల్లో ఈ వేదిక చేపట్టుతుందనీ, మనది ప్రధానంగా మనసులు గెల్చుకునే వుద్యమమనీ, కనుక అత్యంత స్నేహ, సహన భావాలతో ప్రజల్లో మెలుగుతూ మనం పనిచేయాల్సి వుంటుందనీ ఈ వేదికలో చేరదలిచే వారందరికీ తెలియజేస్తున్నాము. తెలుగు ప్రజలు, ముఖ్యంగా తెలంగాణావాసులు, ఈ వేదికను విశేషంగా ఆదరించి, వేర్పాటువాదాన్ని పూర్తిగా విడనాడి, రాష్ట్ర సమైక్యతా పరిరక్షణకూ, తెలుగు జాతి ఐక్యతా సాధన, వికాసాలకూ కృషి చేస్తారని ఆశిస్తున్నాము; కోరుతున్నాము.
ఇంగువ మల్లికార్జున శర్మ (అడ్వకేటు)*, కన్వీనర్ (సమావేశకర్త).
ముక్కు సుబ్బారెడ్డి (ఇంజనీరు), ప్రొఫెసర్ ఆర్.వి.ఆర్. చంద్రశేఖరరావు, నర్రా మాధవ రావు (అధ్యక్షులు, ఆం.ప్ర. స్వాతంత్ర్య సమర యోధుల సంఘం), జంధ్యాల పార్థసారథి (అడ్వకేట్), టి. లక్ష్మీనరసింహ, బి. లక్ష్మణ్ యాదవ్ (హైదరాబాదు); డాక్టర్ జాస్తి సుబ్బారావు (కోదాడ), ఉప్పల లక్ష్మారెడ్డి (మునగాల).
* * * * *
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment