Tuesday, November 1, 2011

ఆంధ్ర ప్రదేశమంటే మహా తెలంగాణమే

ఆంధ్ర ప్రదేశమంటే మహాతెలంగాణమేనన్న తృప్తి, నమ్మకాలతో శ్రీ బి. నరసింహారావు అనే రచయిత రాసిన గోలకొండ పత్రిక
[26-3-1956] లో ప్రచురితమైన ఈ కింది వ్యాసాన్ని శ్రద్ధతో చదవాల్సిందిగా పాఠకులకు - ముఖ్యంగా వేర్పాటువాద ఉన్మాదంతో ఊగిపోతున్న తప్పదారి పట్టిన తెలంగాణా సోదరీసోదరులకు మా విజ్ఞప్తి.

గోలకొండ పత్రిక కీ. శే. శ్రీ సురవరం ప్రతాప రెడ్డి (1896-1953) గారితో ప్రారంభించబడ్డా, ఎందుకో గాని ఆయన మరణానంతరం, ముఖ్యంగా 1955 నుండీ ఎ. నరోత్తమ రెడ్డిగారి సంపాదకత్వంలో ప్రత్యేక తెలంగాణా వాదాన్ని గట్టిగా సమర్థిస్తూ, విశేషంగా ప్రచురిస్తూ వచ్చింది. కాని అందరు వేర్పాటువాదుల్లాగే 1956 మార్చి తర్వాత, ముఖ్యంగా ప్రధాని నెహ్రూ నిజామాబాదులో 5 మార్చి 1956 నాడు చేసిన [విశాలాంధ్ర ఏర్పాటు] ప్రకటన తర్వాత ఈ గోలకొండ పత్రికకూడ పరిస్థితులకు అనువుగా సర్దుకునిపోయింది. ఇప్పటి వేర్పాటువాదుల్లా పూర్తి ఉన్మత్తులు కాలేదువారు. లేదా పిచ్చి ఆవేశకావేషాల్లో తమ జాతి పుట్టుక పరిణామాలనే నిరాకరిస్తూ, తెలుగుతల్లినే అవమానపరుస్తూ, తమ సాంప్రదాయిక వీరుల్నే తెగడే పిచ్చి పనులేవీ వారు చేయలేదు. తెలంగాణాకు యిచ్చిన రక్షణలే ప్రత్యేక రాష్ట్రం సాటి అనే సంతృప్తితో, యిక విశాలాంధ్ర వైభవాన్నీ, ప్రాభవాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగారు. అందుకు ఈ వ్యాసం ఒక ఉజ్వల తార్కాణం:

గోలకొండ పత్రిక, 26 మార్చి 1956, పుట 2:

ఆంధ్ర జాత్యవతరణ

- బి. నరసింహారావు.

తెలుగు వెలుగుతో భారతావనిని సుప్రకాశితం చేసిన వాళ్లల్లో తెలుగువాళ్ళు అపూర్వులు; అద్వితీయులు. భారతీయ సంస్కృతిని, భారతీయ నాగరికతను, హిందూ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ చంద్రగుప్తుని కాలంవరకే ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ప్రభుత్వ మేర్పరచి శబాసనిపించుకున్న తెలుగువాళ్లకు ఈ స్వతంత్ర భారతంలో తిరిగి 1953 ఆ మహదవకాశం లభించడం నిజంగా గర్వనీయాంశం; సందేహించాల్సిన అవసరం లేదు.

దురదృష్టంవల్ల మాతృస్థానంతో వేరవడం, అరవలతో కొంత పొత్తు కలవడం వల్ల తెలంగాణా దివ్యజ్యోతుల [ని] ర్ణీత ధర్మాన్ని విస్మరించడం రెండు కోట్ల తెలుగువాళ్ళకు ఘటించింది. మాతృస్థానం నుండి వీచిన జాతీయ వాయువువల్ల యేర్పడిన వ్యామోహం నిర్మూలమవడం నిశ్చయం.

ఆంధ్రరాజ్యావతరణానికి అనేకులు అనేక కారణాలు నిశ్చయించారు. అమరజీవి ఆత్మాహుతి అని కొందరనుకుంటే, చేతులార ముగ్గుబోసి కట్టిన మదరాసు నగరవ్యామోహాన్ని వదలుకోవడమని కొందరనుకుంటున్నారు. భారతీయ స్వాతంత్ర్య సమయంలో అసమానమైన త్యాగానికి అగ్రగాములైనందున అని మరి కొందరనుకుంటూంటే, యింకొకరు యింకో విధానం తేల్చేస్తున్నారు. మొత్తంమీద రాజ్యావతరణంతో అప్రతిభ షేముషీ విజ్ఞానాన్ని అసమానమైన నిపుణతని అమోఘమైన కార్యసాధనా పటిమని ప్రదర్శింపజేస్తూ అఖిల భారతాభ్యుదయానికి ముందు అడుగు వేశే నిర్ణీత బాధ్యతని పొల్లుపోకుండా తెలుగువాళ్లు సార్థక పరచాలి. (ఇంకా వుంది)

రాజ్య నిర్మాణ నిర్వహణానికీ, పట్టణాల నిర్మించడానికీ, కోటలు కట్టడానికీ పూర్వంనుండీ తెలుగువాళ్లకు పెట్టింది పేరు. ప్లీనీ, మెగస్థనీస్, ఫాహియాన్ వంటి విదేశ యాత్రికులు మన్ననగాంచిన తెలుగువాళ్లు, ఉగ్గుపాలతో నేర్చుక [illegible] భావిభారతాభ్యుదయానికి అత్యవసరమైన అభేద్య ప్రజాభ్యుదయ సౌధాన్ని నిర్మించి, అహర్నిశలు ఆశిస్తున్న ప్రపంచానికి వొహ అద్వితీయ ఆదర్శాన్ని అందించడం అత్యవసరం.

దేశంలో తెలుగువాళ్లకు సుమారు 700 యేళ్ల తర్వాత ప్రత్యేక రాజ్యం యేర్పడడంవల్ల అన్యప్రాంతవాసులల్లో భాషాప్రయుక్త రాజ్యనిర్మాణ వాంఛ చప్పున రేకెత్తింది. ప్రగాఢమైన ఈ ప్రజా వాంఛ నానాటికీ పటిష్టగ మగుటం జేసి ప్రభుత్వం తప్పుకోలేక ఉన్నతాధికారం కలిగించి ఒక రాజ్య పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని నిర్మించింది. నిర్ణీత ఆదేశానుసారం ఈ విచారణ సంఘంవారు దేశాన్ని అంతా తిరిగి చూచి, ప్రజల అభిమతాలను ప్రత్యక్షంగా పరిశీలించి, సహేతుకమైన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందించారు. నివేదిక వస్తున్నదన్నప్పుడే సిఫారసులను పొల్లు పోకుండా అక్షరాలా అనుకరిస్తూ, అమలుపరుస్తామని పంత్ నుండి ప్రసాదు వరకు పదే పదే ప్రజలకు హామీ కలిగిస్తూ వచ్చారు. ప్రజలు విశ్వసించారు. ఆశించిన నివేదిక అందింది. ప్రభుత్వం ప్రజాభిప్రాయార్థం ప్రకటించింది. ప్రజాభిప్రాయాధారంపై తయారు చేసిన నివేదికను తిరిగి ప్రజాభిప్రాయానికంటూ బైటపెట్టడం చర్విత చర్వణమైంది. కాదు వొహవిధాన విచారణసంఘం వారి కృషి నిర్వీర్య పరచబడిందికూడా.

జరపాల్సిన తతంగం అంతా జరిగింది. కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నివేదికలోని అక్షరంతర్వాత అక్షరాన్ని సాకల్యంగా పరిశీలించింది. పొల్లు పోకుండా అమలుపరుస్తామన్న పెద్దల హామీ నిరర్థకం చేయబడింది. సంస్థయొక్క శక్తిసామర్థ్యాలు కుంటుపడకుండా వుండేట్టు అది ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు ప్రతికూలమైనా ఫర్వా చేయక అవసరమనుకున్న మార్పులు యిమిడించబడ్డాయి. ప్రజలు భోరుమన్నారు. దేశంలో అలజడి కలిగింది. అనుకొనని దుర్ఘటనలు పట్టపగలే జరిగాయి. ఎట్లానైతే నేం అంతా అణచివేయ బడింది. కాని అవాంఛితమైన మార్పులవల్ల పుట్టుకవచ్చిన పరస్పర విద్వేషభావాలు మాత్రం మనసులల్లో వుండిపోయాయి. ఫైరింగులు లాఠీ చార్జీలు వాటిని నిర్మూలించలేక పోయాయి.

ఇది మొత్తం దేశంలో ఏర్పడిన పరిస్థితి, చారిత్రక ప్రాముఖ్యము, పరిపాలనా సౌలభ్యత, ఆర్థిక స్తోమత, స్వయంపోషక అర్హతల గమనిస్తూ హైదరాబాదు విచ్ఛిత్తితో తెలంగాణా భూభాగాన్ని ప్రత్యేక రాజ్యంగా వుంచేందుకు విచారణ సంఘంవారు గట్టిగా సిఫారసు చేసారు. పరిపాలనా పటిష్టత, ఆర్థిక స్థిరత, నవజాత గుణగణాలను కలిగిన ఆంధ్రతో తెలంగాణాన్ని లీనపరిచి, సత్వర విశాలాంధ్ర నిర్మాణం జరిపితే ఉభయత్రా అనర్థదాయకమంటూ కారణాలు చూపెట్టబడ్డాయి. అధిష్టాన వర్గానికి యివి నచ్చలేదు. ప్రజలు వీన్ని అమలుపరచాలని పట్టుపట్టారు. ప్రజాభిప్రాయానికి ప్రతికూలంగా పరిష్కరింపబడజాలదని పదే పదే విశ్వాసాన్ని, హామీని కలిగిస్తూ వచ్చారు. ప్రజలు నమ్మారు. అకస్మాత్తుగా సంరక్షణల సాకు కలిగించి, రెండింటిని లీనపరిచామన్నది ఆ అధిష్టానవర్గం. చావు కబురు చల్లగా చెప్పబడింది. ప్రజలు హర్షించలేదు. చప్పట్లు చరచలేదు. దిగాలుపడి మొహాలు చూచుకున్నారు. ఏం చేయాలో తోచింది కాదు.§

విశాలాంధ్రతెలంగాణ అంతా నిజంగా వాంఛనీయం. కాని అప్రస్తుతం. స్వార్థపరుల దుష్ప్రచారంవల్ల పరిస్థితులు విషపూరిత మయ్యాయి. అనవసరమైన అన్నదమ్ముల కలహాలకు దారి యేర్పడింది. పరస్పర వైరుధ్యభావాలకు పకడ్బంది కలిగింది. ప్రజాస్వామ్య యుగంలో, పండితుని ప్రాపున తెలంగాణానికి స్కాట్లెండు గతి పట్టింది. కారణం అనుభవైక రహస్యం.

వరంగల్ జిల్లాకన్న తచ్చుగా వుంటూన్న హిమాచల్ ప్రదేశానికి ప్రత్యేకత కలుగ వీలున్నదిగాని, అన్ని విధాల సమర్థిఐ సహాయానికి చేయిచాచక ఉండకలిగిన తెలంగాణానికిమాత్రం ప్రజాభిప్రాయ ప్రతికూలత నెత్తిన రుద్దబడడం నిజంగా దౌర్భాగ్యమే.ª అది నాయకత్వం లోపమో, అనుకరణీయుల నిస్తేజమో కాలమే తట్టి చూపాలి. అంతే ఐనా ఒక విషయానికి సంతోషించాలి జాతీయాభ్యుదయ గమనాన్ని తేజోవంతమొనరించి, అసమానమైన ఔన్నత్య విధానాన్ని అందించిన ఆ మహాతేజోవిభూతమైన ప్రోలయ్య, కాపయ్య నాయకుల ప్రపంచాన్ని అంతా అపూర్వమైన ప్రజాస్వామ్య సామ్రాజ్య స్థాపనతో అనుకరింప జేసిన అయజ్ఞ ప్రశాతకర్ణుని అమర సందేశాన్ని విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి అక్షతలు విసరిన ఆ విద్యారణ్యుల అమోఘాశీస్సులతో ప్రపంచానికి ఒక అపురూప ఆదేశాన్ని అందించిన ఆ శ్రీకృష్ణ దేవరాయల నిర్ణీత విధానాన్ని, అశాంతితో అట్టుడికినట్లుడికిపోతున్న ఈ ప్రపంచాన్ని అమరావతిగా మార్చే మహదవకాశం ఈ విలీనీకరణంతో, ఈ మహా తెలంగాణ నిర్మాణంతో హస్తగతమయినట్టున్నది. చేతులారా ఈ సదవకాశాన్ని వర్గ విభేదాల తతంగంతో అంతం చేసుకోక ప్రవర్తించి ఆదర్శనీయమైన, అనుకరణీయమైన పద్ధతిని అందించడం తెలంగాణ ప్రథమ కర్తవ్యం. ఆలశినూ [?] గ్రూపు పాలిటిక్సులకు గురిఐ, స్వార్థానికి దాసోహం అంటే మాత్రం మాతృద్రోహానికే వొడికట్టుతూ స్వర్గానికి పుట్టి అంద[ని] వారమై పరిణమించడం తథ్యం.y

పండితుడుగానీ, అధిష్టానవర్గంగానీ, నాయకులుగానీ, పెద్దలు గానీ సంబంధబాంధవ్యం లేని యెవరితోనో అంటగట్టక, శిఖాబంధనం చేయక, [వివిధ] కారణాలవల్ల వీడిపోయి వేరుగా కావడం ఉంటూన్న రక్తసంబంధీకులతో సంకలనం చేయడం దేనికైనా మంచిదే. ఇద్దరి సమష్టి కృషివల్ల ఆ మహావిభూతుల నిర్ణీతవిధానం అనతికాలంలో ఫలవంతమగుట నిశ్చయం *

ప్రాచీన గ్రంథాలను పరిశీలించి చూస్తే ఆంధ్రుల ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనబడుతూన్నది. అంతవరకేగాని వివరాలుమాత్రం ఏవీ లేవు. పురాణాలు ఆ కొరతను దీరుస్తున్నాయి. దీనివల్ల బ్రాహ్మణయుగం వరకే ఆంధ్రుల వ్యక్తిత్వం దేశంలో బాగా కమ్మివుండినట్టు తేలుతూంది.

పురాణయుగంలో వీరి వివరాలు దేశానికి చక్కగా గ్రాహ్యమై వుండినట్లు వాయు, పద్మ, విష్ణు, మత్స్య పురాణాదులు ఘోషిస్తున్నాయి. వీరంతా విశ్వామిత్రుని సంతతివారనీ, వీరు అక్షు నది తీరంనుండి భారత దేశానికి వచ్చారనీ, వీళ్లల్లో ఒక తెగకు ఆపస్తంభ ఋషి గురువర్యుడనీ, తుషారమూలక పహలవాదులతో గూడా వీ రేక జాతివారనీ, వీళ్ల భాష ఆర్యభాషా కుటుంబాంతర్గతమనే అనేక వివరాలు వాయు పురాణంలో ఉల్లేఖితమై వున్నాయి.

అక్షుయే ఆక్సు నది ఇది మధ్యాసియాలో ప్రవహించి యెరల్ సముద్రంలో పడుతున్నది.[1] ఆంధ్రుల మూలపురుషులు ఈ ప్రాంతం వారవడం చేత ఆఫ్ఘనిస్థానానికి వుత్తర ప్రాంతం వారన్న మాట. వీరే భారతదేశానికి వచ్చి దక్షిణ ప్రాంతంలో స్థిరనివాసం కలిగించుకున్నారు.

బౌద్ధ వాజ్మయంలో వీళ్లగురించి వివరాలు ఇంకా ఎక్కువగా కనబడుతున్నాయి మూలకులు, అశ్వకులు వీళ్ల తెగవారే మూలకులు నిర్మించుకున్న ముఖ్యనగరం ప్రతిష్టానం [పైథన్] అశ్వకులది పోతన [బోధన్], తెలంగాణాలోనివే. దక్షిణాపథంలోని కృష్ణా, గోదావరీ తీరాలలో ప్రాచీనకాలమందు నాగులు, యక్షులు నివసించేవారు. వారిది తెలుగు భాష. ప్రాకృతం ఆ కాలంలో రాజభాష ఐనా కొండజాతులు పైశాచి అనే భాషను వాడేవారు. జన సామాన్యమో విదేశీభాష మాట్లాడేది.

మధ్య ఆసియానుండి వలసవచ్చి యిక్కడ స్థిర నివాసం కలిగించుకొన్న ఆంధ్రులు, పూర్వంనుండీ వుంటున్నవారిని రూపు మాపక, వాళ్లతో మమేకమై వాళ్లని తమలో లీనం చేసుకున్నారు. వాళ్ల భాషకన్న తెలుగు భాష సొంపుగావుండడంవల్ల, లాలిత్య మైనందున దీన్నే తమదిగా జేసుకొని తెలుగువాళ్ళయ్యారు. దేశం అంతా తెలుగు దేశం ఐంది. తెలంగాణంగా వ్యవహరింపబడింది.

కాళేశ్వరం, శ్రీశైలం, దక్షారామం అనే మూడు ప్రసిద్ధ శైవక్షేత్రాల మధ్యగల దక్షిణ భాగం త్రిలింగ దేశమైంది. ఇక్కడి వాళ్లందరికి తెలుగు మాతృభాషగా వుండింది. తిలంగీ, తెలంగీ, తైలంగీ, తెలంగాణ అనేవన్నీ త్రిలింగ శబ్దానికి అపభ్రంశ రూపాలే. ఆణెము, దేశం పర్యాయపదాలు. ఆణెము ఆణ మైనది. తిలంగాణమే క్రమంగా తెలంగాణంగా పరిణమించింది.

ఆంధ్రుల ఆగమనానికి పూర్వం దక్షిణాపథం నిర్జనప్రదేశంగా మాత్రం లేకుండెను. రామాయణ మహాయుగంలో ఈ ప్రాంతం జన్మస్థానంగా¨ వ్యవహరితమైంది. ఇది చరిత్రకు పూర్వయుగంనాటి విషయం.

చంద్రగుప్తుని కాలంవరకు తెలుగువారు లేక ఆంధ్రులు దక్షిణాపథాన బలవత్తరమైన ప్రజాస్వామ్య సామ్రాజ్యాన్ని [sic -?] స్థాపించి, అభేద్యమైన కోటలు, రమ్యమైన నగరాలని, ఆదర్శనీయమైన సైనిక వ్యవస్థను కలిగించినట్లు మెగస్థనీసు తన యిండియాలో [sic - 'ఇండికా' లో] ప్రశంసించారు. మూర్య [మౌర్య] యుగాన్ని చరిత్రకారులు క్రీస్తుకు పూర్వం 350 [నుండి?] అని నిర్ణయించారు. ప్రశంసార్హమైన సామ్రాజ్యాన్ని స్థాపించి, సువ్యవస్థ కలిగిస్తూ, విదేశాలతో నౌకావ్యాపారం నిరాటంకంగా సాగిస్తూండిన తెలుగువాళ్ల ప్రయత్నం అధమం [అంతకు] వంద యేళ్ల పూర్వమై వుండితీరాలి. దీనివల్ల వీరిది క్రీస్తుకు పూర్వం 5 శతాబ్దం తప్పకుండా కావల్సిందే.

తెలుగువాళ్లు భారతాభ్యుదయానికి సలిపిన కృషి అమోఘం, అద్వితీయం దీన్ని అందరూ అంగీకరించారు [?? - IMS]. నిజంగా అది చరిత్రకు ఒక మహత్తర విషయం. తెలుగువారు లేక తెలంగాణంవారు సామ్రాజ్యనిర్మాతలు. ప్రజాస్వామ్య సిద్ధాంతాలు వీళ్లల్లో మూర్తీభవించి వుండేవి [?? - IMS]. మధ్యయుగంలో [?? - IMS] మహా తేజోవంతంగా వెలశిన రెండు మహత్తర సామ్రాజ్యాలకు వీళ్లే అధినేతలు. మొదటిది శాతవాహన సామ్రాజ్యం; పైథన్ దీనికి రాజధాని. మగధ సామ్రాజ్యాన్ని పదాస్తపరచి, సకల భారతావనికి సామ్రాజ్యపీఠమైన పాటలీపుత్రాన్ని అధీనపరచుకొని, గౌతమీపుత్ర శాతకర్ణి తన సామ్రాజ్యాన్ని పశ్చిమోత్తరాన సౌరాష్ట్ర, మాళవాల వరకు, దక్షిణాన కొల్లడవరకు ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై పరిపాలనాన్ని సాగించి [?? - IMS], ప్రపంచానికి అపురూపమైన ఆదర్శాన్ని స్థాపించి ధన్యుడయ్యాడు. సుమారు 400 యేళ్లవరకు శాతవాహనులు దక్షిణాపథంతో [బాటుగా] కొంత ఉత్తర ప్రాంతాన్ని [కూడ] పాలించారు. ఇక రెండవ సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం. అది అవిస్మృత సామ్రాజ్యంగా లెక్కింపబడింది. దీని నిర్మాణానికి ఆంధ్ర జాతీయోద్యమం ముఖ్య కారణం. భారత దేశానికి జాతీయోద్యమ రహస్యాన్ని అవగాహన పరచు సౌభాగ్యం గడించింది తెలుగువారే [?? - IMS]. ఆచంద్రతారార్కం యీ విషయం గర్వనీయాంశమే.

దేశంలో పరస్పర అసహనం, వైరుధ్యం పెంపొందడంతోబాటు కాలానికి కాపెట్టుకున్న దుష్టశక్తుల విజృంభణం సంభవించింది. జైచంద్ వంటి దేశద్రోహుల దోహదంతో వరంగలు పతనం జరిగింది. జోన్ ఆఫ్ ఆర్కీ [Joan of Arc] ని మించిన ఏకవీరకు చేదోడు మృగ్యమైంది. అభ్యుదయ విధానంలో ఆదర్శప్రాయంగా పరిణమించిన కాకతీయ సామ్రాజ్యం ఖననమై పోయింది. విదేశీయుల, విధర్మీయుల విపరీతాలకు కాలానుసారం ప్రతిక్రియ ప్రారంభ మయింది.

ఓరుగల్లు పతనంతో దేశంలో, అదివరకు అవగాహనంకాని, జాతీయోద్యమం ఆరంభమయింది.* పాకనాడు దీనికి పుట్టిల్లు. నెల్లూరి పంటకాపులు, ముసునూరి కమ్మ నాయకులు, కాకతీయ సీమలోని కర్మ వీరులు ముసల్మానుల అధికారాన్ని ధిక్కరించారు. అనుదినం విషపూరిత మవుతున్న పరిస్థితులు దేశంలో సంఘీభావాన్ని, సమైక్యతని సిద్ధింపజేసింది. ప్రోలనాయకుడు నాయకత్వం వహించాడు.

దేశ స్వాతంత్ర్య సంసిద్ధికి స్థాపితమయిన ఆంధ్రజాతిసమితి ఆదర్శాలు విద్రోహాత్మక విధర్మీయుల విద్రాణం, స్వాతంత్ర్య పున: స్థాపితం రెండుగా నిర్ణీతమయ్యాయి. ప్రజల ప్రాపు లభించడంవల్ల తీరాంధ్ర ప్రాంతం తురకల ఆధిపత్యంనుండి విముక్తమయింది. ముసల్మానుల అధీనంనుండి యావత్ తెలంగాణాన్ని విడదీయడానికి కంపిలి రాజ్యాక్రమణం తప్పనిసరి ఐంది. తెలంగాణాని కిది కీలక స్థానం. ఉద్యమ సాఫల్యతకిది మర్మస్థానం.y

దక్షిణ తెలంగాణా నల్లగొండ లేక నీలగిరి రాజ్యాన్ని పాలిస్తూండిన చాళుక్య సోమదేవరాజు నాయకత్వ భారం వహించి ముందుకు నడిచాడు. రెడ్ల బలం చేదోడుగా ఏర్పడినందున నాగులపాడు, సాతానికోట, ముసలి మడుగు, కందనవోలు, కల్వకొలను, రాయచూరు, యేతగిరి, ఆనెగొంది ప్రాంతాలల్లో శతృనాశనం చేస్తూ [వాటిని] దేవరాజు స్వాధీనం చేసుకోగలిగాడు. తురకలు, సుల్తాను ప్రతినిధులు తెలుగువాళ్ల ధాటికి తట్టుకోలేక, కాలికి బుద్ధి గరిపాడు [రు].

ఇలా విజయం చేకూరడానికి కేవలం రాజుమాత్రమే కాదు, ప్రజల సహకారం, వాళ్ల త్యాగదీక్ష, వాళ్ల స్థిరసంకల్పం అన్నీ ఒకటి అయ్యాయి. నాయకుల ఆదేశానుసారం ప్రజలు ప్రాంత ప్రాంతంలో శాసనోల్లంఘనం, పన్నుల నిరాకరణ, ఆర్థిక బహిష్కరణ అనే అణుశక్తులను విజృంభింపజేయడం చేత సుల్తాన్ ఆధిపత్యం అంతమయి పోయింది.

తెలుగు మాతృభాషగా వుంటూన్న యావత్ప్రాంతానికి తెలంగాణం మాతృస్థానం. దురాశా పీడితులైన తురకలు పరిపాలనా సౌలభ్యతకు తెలంగాణాన్ని (1) తూర్పు తెలంగాణఓరుగల్లు రాజధాని; (2) పశ్చిమ తెలంగాణం బీదరు ముఖ్యనగరం; (3) వాయవ్య తెలంగాణం రాజధాని కంపిలి [గా] మూడు భాగాలల్లో విడదీసారు.

ఆంధ్ర జాతీయ సమితి శక్తిసామర్థ్యాలు, విద్యారణ్యుని ధర్మ ప్రచార విధానాలు, కాపయ్య నాయకుని రాజకీయ చాతుర్యంతో ప్రజలంతా ' జై తెలంగాణ' మంటూ కన్నతల్లి కష్టాల బాపడానికి ప్రచండ తుఫానుగా లేచారు. కాపయ్య నాయకుడు సార్థక నాముడు; అసాధారణ పురుషుడు; రణప్రవర్తన నిపుణుడు; రాజ[నీతి] జ్ఞుడు, దూరదృష్టి యందసమానుడు. ఈతని నాయకత్వంతో దక్షిణ ప్రాంతంలోని ఢిల్లీ సుల్తాను ఆధిపత్యం నశించిపోయింది. కాపయ్య పేరు తురకలకు, ద్రోహశక్తులకు పక్కలోని బల్లెం పోటుగా ఐంది.

కృష్ణా, సేతు రామేశ్వరాల మధ్య రాష్ట్రం విరూపాక్ష స్వామివారి కాణ యాచి [sic - కాణాచి?]. పవిత్రవంతమైన, పుంజీభూతమైన ఈ భూభాగం అన్యాక్రాంతమై వుండడం విద్యారణ్యునికి ఖేదం కలిగించింది. తపోబలాన్ని దారబోయడానికి నిశ్చయించాడు. [ఆయనను] కాపయ్య దర్శించాడు. సంకల్ప ఆచరణ ఆరంభింపబడింది.

విద్యారణ్యుని మహదాశీర్వాదంతో కాపయ్య కార్యానికి దిగాడు. అనతికాలంలో విజయం చేకూరింది. దుష్ట శక్తులు దునుమాడింప బడ్డాయి. తుంగభద్రా దక్షిణ తీరాన విజయనగర నిర్మాణం జరిగింది. మూడు వందల యేళ్ల వరకు ఈ ప్రజాస్వామ్య సామ్రాజ్యం దక్షిణోత్తర భాగాలని అభ్యుదయ పథావలంబనం చేస్తూ, దేదీప్యమానంగా హిందూస్వాతంత్ర్య లక్ష్మీకాకమై ప్రకాశించింది. విద్యారణ్యుల ఆదేశ సాఫల్యతకు కృష్ణదేవరాయలు ఆత్మాహుతితో అమరుడయ్యాడు.§

ప్రాచీనకాలంనుండి ఈ భూభాగం అంతా తెలంగాణమనే మహత్తరమైన దివ్యనామంతో వ్యవహరింపబడుతున్నది. ప్రజాస్వామ్య స్వాతంత్ర్య మహదేవికిది అనాదినుండి ఆటపట్టులే. పరస్పర విద్రోహాత్మక చర్యలతో దుష్ట శక్తులకు తాత్కాలికంగా స్థావరంగా మారిన యీ తేజోవంత ప్రాంతాన్ని తిరిగి అలనాటి ఆ మహాగౌరవ స్థానానికి చేర్చేందుకే గామాలు 700 సంవత్సరాల తర్వాత తెలుగువాళ్లకు మహదవకాశం లభ్యమయింది.

అధిష్టానవర్గం వారి ఆదేశానుసారం ఆంధ్రులకు విజయం కలగలేదు; తెలంగాణం వారికి పరాభవం సంభవించలేదు. విద్యారణ్యుల ఆదేశాన్ని, ప్రోలయ్య, కాపయ్యల నిర్ణీత కార్యక్రమాన్ని ఫలవంతపరచాల్సిందని అధిష్టానవర్గం అపరోక్షంగా ఆదేశిస్తున్నది. విద్యావిషయాల్లోగానీ, ఆర్థిక సంబంధంలోగానీ, రాజకీయ జ్ఞానంలో గానీ తెలంగాణం ప్రజలు కదాపి వెనుకంజ వేసి లేరు. ప్రాత: స్మరణీయ ఋషిపుంగవులు నిర్ణయించిన మానవత్వ రూపం యింకా యీ తెలంగాణంలోనే మూర్తీభవించి ఉన్నది. రెండింటి సంకలనం మహాదర్శ నిర్వహణ సాధనమే.

ఆవసరమయిన [? అవసరవాదం (opportunism) తో అని అర్థమా? ] పేర్లకై పాకులాడక మహాధర్మదృష్ట్యా ఈ విశాల ప్రాచీన భూభాగాన్ని దుష్టశక్తుల నిర్మూలనానికీ, ద్రోహాత్మక విషయాల రూపుమాపడానికీ మహదవకాశం అయాచితంగా హస్తగత మయినందున తెలంగాణం లేక మహాతెలంగాణం లేక తెలుగుప్రదేశమనే శక్తిప్రసరిత నామంతో వ్యవహరించడం మన విధ్యుక్త ధర్మం. ఫలింపజేయాల్సివున్న ఆ మహాకార్య సాధనానికి యీ పవిత్ర నామమే శక్తిదాయకం ఔతుంది.

* * * * *



§ ఇక్కడ ప్రజలు అంటే ప్రత్యేక తెలంగాణావాదులు అని చదువుకోవాలి. ఎందుకంటే మార్చి 5 నిజామాబాదులో నెహ్రూ విశాలాంధ్ర ప్రకటన చేసినప్పుడు జనం హర్షధ్వానాలు చేసారని పత్రికలు రాసాయి. కనీసం ఒక్క నిరసన గొంతుకైనా వెలువడినట్లు ఏ పత్రికా (గోలకొండ పత్రికతోసహా) రిపోర్టు చేయలేదు. – IMS.

ª మోకాలికీ బట్టతలకూ ముడిపెట్టడమని దీన్నే అంటారు. హిమాచల్ ప్రదేశానికీ, వరంగల్ జిల్లాకూ ఏ విషయంలోనైనా పోలిక అసలుంటుందా? మంచిది, వరంగల్ ను ఒక రాజ్యం చేసేద్దామా? జిల్లాకొక రాజ్యమైతే మాత్రం తప్పేమిటి? పూర్వం ఛప్పన్నారు రాజ్యాలు, ఆరేడు వందల సంస్థానాలు లేవా? అనుభవైక రహస్యమేమిటో? ఒక వైపు తెలుగు జాతి విశాలత, గుణగణాల్ని నింగి కెత్తుతాడు, మహాతెలంగాణమే విశాలాంధ్ర అని పొంగిపోతాడు; మరో వైపు ప్రత్యేక తెలంగాణ రాలేదని ఉక్రోషంతో కుమిలిపోతాడు. ఇలాంటి మతిస్థిమితంలేని మేతావుల వెర్రిమొర్రి రాతలు, చేష్టల వల్ల అమాయక జనాలు ఉన్మాదులే అవుతున్నారంటే వాళ్లను తప్పుబట్టి ఏమంత లాభం? అయినా ఈ రచయిత [నేటి ఉన్మత్త వేర్పాటువాద 'మేతావు' లతో పోలిస్తే] ఎంతో మెరుగు; నేటి వేర్పాటు వాద 'మేతావు' లైతే అసలుకు తెలుగు జాతి, తెలుగు తల్లి అనేవే bash అంటున్నారు మరి! – IMS.

y పుష్కల వాగాడంబరమేగాక రెండందాలా వాదించగల ప్రతిభకూడ ఈ రచయిత కున్నట్లు అగుపిస్తుంది. ఒక స్వర్గాన్ని, ఒక అమరావతిని, మహా తెలంగాణాన్ని సృష్టించి తీర్చిదిద్దే సదవకాశానికి సంతోషించే వానికి అంతకు పూర్వపు [చేజారి] పోయిన 'ఛాన్సు' గురించి ఏడుపెందుకో? ఈ పిచ్చిమానిసికి చేసిన పొరపాటును గుర్తించి దిద్దుకోవాలనే చింతే లేకపోయినా, అదే సమయంలో విశాలాంధ్ర కల్పించే సదవకాశాలను నిరాకరించే అవివేకమూ లేదులెండి - IMS.

* !! – సరే, అదెలావున్నా, మనకు కావల్సిన ముఖ్య విషయాలన్నీ ఈ కింది పేరానుండి ప్రారంభమౌతాయి లెండి.

[1] The Amu Darya, also called Oxus and Amu River, is a major river in Central Asia. It is formed by the junction of the Vaksh and Panj rivers. In ancient times, the river was regarded as the boundary between Iran and Turan. In antiquity, the river was known as Vaksu to Indo-Aryans. Amu Darya is a river almost in reverse, for long reputed to be sourced by a powerful glacier fed stream high in the Pamir Knot at the eastern end of Afghanistan's Wakhan Corridor, and ending not at the sea but spreading out into the sands of Turkmenistan'sKyzyl Kum desert, well short of its historic terminus of the inland Aral Sea.

¨ A quite doubtful proposition - IMS.

¨ మరి ఈ నౌకావ్యాపారం ఇప్పటి తెలంగాణా అంతర్గతభూఖండంనుండైతే సాగివుండదుగా. అంటే అప్పట్లో తెలుగువాళ్లకు యిప్పటి సంకుచిత ప్రాంతీయ చీలికలు లేవనేగా. ఇదైనా ప్రాంతీయోన్మాదులకు కనువిప్పు కాగలదా? - IMS.

sic. 'అవిస్మృత' కాదు 'విస్మృత' సామ్రాజ్యమే. కాలగర్భంలో కలిసి ప్రజలంతా మరిచిన ఈ మహత్తర సామ్రాజ్య చరిత్ర మళ్లీ చాల కాలానికి (19వ శతాబ్దంలో) రాబర్ట్ సివెల్ రచించిన 'The Forgotten Empire' (విస్మృత సామ్రాజ్యం) అనే అద్భుత గ్రంథంద్వారానే వెలుగులోకి వచ్చిందంటారు - IMS.

?? ఇది ఎవరిని ఉద్దేశించో అర్థం కావడం లేదు. మొదటిసారిగా వింటున్నాము. విశ్వనాథ సత్యనారాయణ గారి ' ఏకవీర ' అయితే తమిళ దేశంలో వెలిగి, వైగైనదిలో ఆత్మాహుతి చేసుకున్న వనిత గదా!? లేదా ఓరుగల్లులో పూజింపబడుతూండిన దేవతల్లో ఒకరైన ఏకవీరా దేవి పూర్వ చరిత్ర ఏమైనా వున్నదో మాకు తెలియదు. రచయిత ఈ వాక్యం సంకేతపరంగా వాడినట్లుంది. - IMS.

* జాతీయోద్యమం అనేది మరీ పెద్ద మాటేమో. ముసల్మానుల ఆగడాలకు వ్యతిరేకంగా వివిధ సంస్థాన ప్రజల ప్రతిఘటన అనొచ్చు. – IMS.

y ఎక్కడి కంపిలి (నేటి బళ్లారి జిల్లా), ఎక్కడి నేటి తెలంగాణ? అంటే, రచయిత యావత్‌ తెలుగు దేశాన్ని తెలంగాణ మంటున్నాడని, అలాగే భావిస్తున్నాడని స్పష్టమేగదా. మరి ఆయనకు ప్రత్యేక తెలంగాణా జాడ్యమెందుకో? – IMS.

సరిగ్గా అలాగే నిజాం నవాబులు తమ సౌలభ్యంకోసం తెలంగాణాన్ని నైజాం తెలంగాణా, సర్కారు జిల్లాలు (కోస్తా ఆంధ్ర), దత్తమండలం (రాయలసీమ) గా విడదీసి, చివరి రెంటినీ బ్రిటిషువారికి ధారాదత్తం చేసారుగదా. మరి ఈ సంగతి ఎరిగీ, తానే చెబుతున్న గత చరిత్ర తెలిసీ ఈ రచయిత మొదట్లో ప్రత్యేక తెలంగాణా అని పట్టుబట్టడమూ, ఆ తర్వాత అది సాధ్యం కాలేదని ఉక్రోషంతో రాస్తూ సర్దుకుపోవడమూ ఎంతవరకు సహేతుకం? – IMS.

§ ఇదంతా చదువుతూంటే దీనిలో చారిత్రక వాస్తవాల పాలుకన్నా రచయితయొక్క విచిత్ర కల్పనే (fertile imagination) ఎక్కువ అనిపించక మానదు. కాని, ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ప్రత్యేక తెలంగాణాకోసం ఆరాటపడి, కృషిచేసిన ఈ రచయిత చరిత్రను వివరించేటప్పుడు యావదాంధ్ర దేశమూ తెలంగాణమే అని సగర్వంగా ప్రకటించడం. అలాంటప్పుడు ఈయనకు ఈ ప్రత్యేకత్వ గింజులాట ఎందుకు, అది భావ్యమా? ఈయన వివరించిన వివరాల వెలుగులో చూస్తే యావదాంధ్రాన్నీ సమైక్యపరచడం, సమైక్యంగా సాగించడమే అతి మహత్తర కార్యంకాదా అనికూడ ఎవ్వరేగానీ ప్రశ్నించక తప్పదేమో. – IMS.

1 comment:

  1. The author of this blog is very poor and narrow minded and misinterpretating great leader like Narasingaravu garu

    ReplyDelete