Monday, September 16, 2013

ఆంధ్రుల కథ - 1 ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

ఆంధ్రుల కథ - 1 ఎం.వి.ఆర్ శాస్త్రి గారు ఆంధ్ర భూమి ఆదివారం అనుబంధం లో సీరియల్ గా ప్రచురిస్తున్న ఆంధ్రుల కథ యదాతథం గా..

Courtesy: http://konnekarunakar.blogspot.com/2010/05/1.html

మనవాళ్లే మనకు పగవాళ్లు (April 25th, 2010)


ఇది ఆంధ్రుల కథ.
పేరు చూసి భయపడకండి. ఐతరేయ బ్రాహ్మణం నుంచో శాతవాహనుల నుంచో ఎత్తుకొని ఆంధ్ర జాతి చరిత్రను ఇక్కడ మళ్ళీ తవ్విపోస్తామని! ఆపని ఇప్పటికే చాలామంది పండితులు చాలా రకాలుగా చేశారు. ఇటీవలి రాజకీయ పరిణామాల పుణ్యమా అని చాలామంది రాజకీయ నాయకులు కూడా పార్ట్‌టైమ్ చరిత్రకారులుగా మారి తమ అవసరానికి తగ్గట్టు వేర్పాటువాదానికి పనికొచ్చేట్టో లేక సమైక్యవాదాన్ని బలపరచే విధంగానో తెలిసీ తెలియని చరిత్రను వండి నివేదికల కంచాల్లో శ్రీకృష్ణ కమిటీకి, పనిలో పనిగా మీడియాకి ఎక్కీ తక్కీ వడ్డించారు. విభజన రేఖకు ఆవంక, ఈవంక బారులుతీరిన కవి, పండిత, మేధావుల సమగ్ర విశే్లషణ సాహిత్యాలు సరేసరి!
----------------------
అందరూ అంతా చెప్పేశారు కాబట్టి చర్వితచర్వణాలను ఇక్కడ చేయబోవడం లేదు. ఏ వాదానికి గాలి ఊదడానికీ ఈ పనికి ఉపక్రమించడంలేదు. ముందే చెప్పేస్తున్నా. ఇప్పుడు నడుస్తున్న వివాదంలో నేను వేర్పాటువాదినీ కాదు. సమైక్యవాదినీ కాదు. తెలంగాణ వేరుపడాలని కోరుకుంటే దాన్ని బలవంతంగా అడ్డుకోవటం విజ్ఞత అని నేను అనుకోను. తెలంగాణ విడివడినంత మాత్రాన రాష్ట్రానికి భవిష్యత్తు చీకటైపోతుందనో, తెలుగు జాతి సర్వానర్థాల పాలవుతుందనో నేను నమ్మను. అలాగని తెలంగాణను తరతరాలుగా పట్టిపీడిస్తున్న అనేకానేక బాధలకు ప్రత్యేక రాష్టమ్రే ఏకైక పరిష్కారమంటేనూ నాకు నమ్మకం కుదరదు. ఏదో ఒకవిధంగా వేర్పాటువాదాన్ని వమ్ముచేసి, ఇప్పుడున్నట్టే రాష్ట్రాన్ని కొనసాగించగలిగితే చాలు ఆంధ్ర జాతి అప్రతిహతంగా ముందుకు దూసుకుపోతుందన్న విశ్వాసం కూడా నాకు లేదు. మన బుద్ధులూ, మన నెత్తినెక్కినవారి బుద్ధులూ ఇప్పటిలాగే ఉన్నంతకాలమూ ఒక ప్రాంతం విడిపోయినా, అన్ని ప్రాంతాలూ కలిసున్నా మన బతుకుల్లో తేడా పెద్దగా ఉండదు. ఏ ప్రాంతానికీ, మొత్తంగా ఆంధ్ర దేశానికీ ఏ వాదంవల్లా ఒరిగేది ఏమీ లేదు.
ఆదినుంచీ నేటిదాకా తమకు అన్ని రంగాల్లో అన్ని విధాల అన్యాయమే జరిగిందని తెలంగాణవారు అంటారు. అది ముమ్మాటికీ నిజం. ఇప్పటిదాకా పెత్తనం చేసిన ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు తమను దారుణంగా దగాచేసినట్టూ తెలంగాణ వాసులు చెబుతారు. అది కూడా కరెక్టు. తమ ప్రాంతానికి తీరని నష్టం జరిగింది కాబట్టి మిగతా ప్రాంతాలవారికి విపరీతమైన లాభం చేకూరిందని... తమకు కీడుచేసిన మోతుబరి నేతలు వారి వారి ప్రాంతాల ప్రజలకు వల్లమాలిన మేలు చేసే ఉంటారని తెలంగాణవాదులు కొందరు భావిస్తారు. అది మాత్రం కరక్టుకాదు.
రాజకీయ కల్లలకు ప్రాంతాల ఎల్లలు లేవు. ఒక తెలంగాణ, ఒక రాయలసీమ అనే ఏమిటి... మొత్తం తెలుగుదేశమే తరతరాలుగా తీరని అన్యాయాలకు లోనైంది. నమ్మకూడని వారిని నమ్మి ఘోరంగా మోసపోయింది. నీతులమారి నేతల సుభాషితాలకు భ్రమసి, గోమాయువులమీద అమాయకంగా ఆశలు పెంచుకుని అడుగడుగునా అడియాసల పాలైంది. తడవకో రకంగా దగాపడింది. కడచిన నూరేళ్ల ఆంధ్రావని చరిత్ర అబద్ధాల పుట్ట. కపటాల కట్ట. నమ్మకద్రోహాల చిట్టా. ఏ ప్రాంతపు ప్రారబ్ధానికి ఆ ప్రాంతపు నాయక ప్రబుద్ధులే మొదటి ముద్దాయిలు. మనవాళ్లనుకున్నవారే మొదటినుంచీ మనకు పగవాళ్లు.
ఆంధ్రులకు గర్వించదగిన గతకీర్తి ఉంది. వేల సంవత్సరాల కిందటే మనం భారతదేశాన్ని ఏలాం. దేశాలను జయించాం. దేశ దేశాలకు చొచ్చుకుపోయాం. గొప్ప నాగరికతను, గొప్ప సంస్కృతిని, గొప్ప కళలను, గొప్ప సారస్వతాన్ని లోకానికి అందించాం. ప్రాచీన వైభవంతో బాటే కాలగర్భంలో కలిసిపోకుండా విశిష్ట వారసత్వాన్ని అవిచ్ఛిన్నంగా నిలబెట్టుకున్నాం. ఆధునిక కాలాన పారతంత్య్రపు పెనుచీకటిలో జాతీయ పునరుజ్జీవనంలోనూ కీలక భూమిక పోషించాం. మహాత్ములు, మహానాయకులు జాతీయ రంగంలో అడుగుపెట్టటానికి పూర్వమే జాతీయోద్యమంలో ముందువరసన నిలబడ్డాం. భాషాప్రయుక్త రాష్ట్రాలకోసం మనమే మొదట పోరాడాం. ఒక భాషా సముదాయాన్ని ఒక పరిపాలన కిందికి తేవాలన్న ఆదర్శాన్ని దేశానికి మనమే ప్రబోధించాం.
కాని- ఏం లాభం? మిగతా రాష్ట్రాలవారు, మిగతా భాషలవారు మనం చూపిన దారిలో ముందుకుపోయి కోరుకున్న ఫలాలను పొందినా... మనం మాత్రం దయనీయంగా వెనకబడిపోయాం. అందివచ్చిన అవకాశాలను చేజేతులా జారవిడుచుకున్నాం. అన్నీ ఉన్నా- అనుకున్నది సాధించే తెగువ, చొరవ మనకు సరైన అదనులో లోపిస్తూ వచ్చాయి. సంకుచిత దృష్టివల్ల మిగతా రాష్ట్రాలు, మిగతా భాషా వర్గాలు ఇతరులకు అన్యాయం తలపెడితే... విశాల దృష్టి మరీ ఎక్కువై మనకు మనం అనేక విధాల అన్యాయం చేసుకున్నాం. మనకు ఎంత పరాక్రమం ఉందో అంతటి అమాయకత్వమూ ఉంది. కల్ల, కపటాలను పోల్చుకోలేకపోవటంలో మనకు మనమే సాటి. మోసగించిన వారి చేతిలోనే మళ్లీ మళ్లీ మోసపోవటం మన స్పెషాలిటీ.
3నాన్ కోఆపరేషన్లూ, విదేశీ వస్తు బహిష్కరణలూ, శాసనోల్లంఘనలూ వెల్లువెత్తడానికి పూర్వమే తెలుగునాట ఆంధ్రోద్యమం అపూర్వ సంచలనం రేకెత్తించింది. ముక్కోటి ఆంధ్రులకు గొప్ప ఉత్తేజానిచ్చింది. ఆదర్శం వంకలేనిదే అయినా ఆచరణకు వచ్చేసరికి కాలక్రమంలో నానావంకరలు చోటుచేసుకున్నాయి. బయటి శత్రువులు అట్టే శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఉద్యమాన్ని నీరుగార్చి నిస్తేజం చేయడానికి పెద్ద దిక్కులనుకున్నవారిలోనే కొందరు శాయశక్తులా పుణ్యం కట్టుకున్నారు. ఒక్క శకుని, ఒక్క శల్యుడు, ఒక్క సైంధవుడే భారతంలో నానాగత్తర తెచ్చిపెట్టగా ఆంధ్రమహాభారతంలో ఎందరో శకునులు; ఎందరో శల్యులు; ఎందరో సైంధవులు. ఆంధ్ర జాతికి పాత వైభవం మళ్లీ కళ్లజూడాలి, ఎక్కడెక్కడి ఆంధ్రులూ మళ్లీ ఏకమై కలిసి ముందుకు సాగాలి, తెలుగు భాష, సంస్కృతి ఉజ్జ్వలంగా వెలుగొందాలి- అన్న ఆశ, ఆకాంక్ష తెలుగు ప్రజలందరిలో ఉన్నాయి. అవసరమైనప్పుడల్లా, అవకాశం చిక్కినప్పుడల్లా ఆంధ్రావని తన అభీష్టాన్ని నిర్ద్వంద్వంగా తేటతెల్లం చేస్తూనే ఉంది. ఎవరు చొరవ తీసుకుని ఎప్పుడు ఏ కార్యం చేపట్టినా, ఏ బావుటా కింద ఏ ఉద్యమాన్ని, ఏ ఆందోళనను చేపట్టినా ప్రజలు బాగా స్పందిస్తూనే ఉన్నారు. నడిపిస్తే నడవటానికి జనం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా, వారిని నడిపించవలసిన పెద్దల్లోనే ఆదినుంచీ ఎన్నో విభేదాలు; ఎన్నో పేచీలు; వల్లమాలినన్ని వ్యక్తిగత స్పర్థలు; వాటికిమించి లోపాయకారీ లాలూచీలు; వెన్నుపోట్లు.
ఆంధ్రోద్యమం మహామహుల పూనికతో అద్భుతంగా మొదలై, మహానాయకుల సారథ్యంలో అద్భుతంగా సాగి, అద్భుత విజయాలను సాధించిందనీ... వెనకటి తరాల మహానేతలు ఎన్నో త్యాగాలు చేసి, ఎన్నో పోరాటాలు సలిపి, అపురూప సంఘీభావంతో సమైక్యాంధ్ర రాష్ట్రాన్ని నిర్మించారనీ మన కాలపు మేధావులు, చరిత్రకారులు, రాజకీయ పండితులు చెప్పేది వింటే ఎవరికైనా కళ్లు చెమర్చుతాయి. చెప్పటానికి, ఊహించుకోవటానికి అది కడురమ్యంగా ఉన్నా, వాస్తవ చిత్రం వేరు. దూరపుకొండలు నునుపు అన్నట్టుగా... అసంపూర్ణ ప్రజ్ఞావంతుల అల్లిబిల్లి వర్ణనల్లో బహు సొగసుగా పొడగట్టే ఆంధ్రోద్యమంలో, విశాలాంధ్ర లక్ష్యం సాధించిన తీరులో, అనంతర చరిత్రలో అవకతవకలు, అవకాశవాద రాజకీయాలు, నీతిమాలిన బేరాలు, స్వార్థపూరిత రాజీలు, ద్రోహాలు ఎంచాలంటే ఎన్నో ఉన్నాయి. గర్వించదగిన పోరాట పటిమ, పౌరుషాల వెనువెంటే పిరికితనాలు... నిస్వార్థ త్యాగనిరతి వెనువెంటే స్వార్థచింతనలు, పదవీ వ్యామోహాలు చెట్టపట్టాలు వేసుకున్నాయి కాబట్టే ఆధునిక కాలంలో ఆంధ్రుల ప్రస్థానం ఒకడుగు ముందుకు- మూడడుగులు వెనక్కిగా సాగింది. ఇప్పటికీ సాగుతున్నది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా దేశంలోని మిగతా ప్రాంతాలకు, భాషావర్గాలకు దేనిలోనూ తీసిపోని ఘనచరిత్ర, ఘన సంస్కృతి ఉన్నా అనేకవిధాల వెనుకబడి, అనైక్యత హెచ్చి, ఆత్మాభిమానం చచ్చి, రాజకీయ మాయలో చిక్కి, తనకేది మంచిదో, ఏమి కావాలో, దాన్ని ఎలా సాధించాలో తెలియని విమూఢస్థితిలో తెలుగుజాతి కొట్టుమిట్టాడుతున్నది. ఈ అయోమయం నుంచి బయటపడాలంటే ముందు ఈ అయోమయావస్థను అర్థం చేసుకోవాలి. ఎక్కడ మొదలుపెట్టి ఏ విధంగా ఇక్కడికి చేరామో సావధానంగా గమనిస్తే ఎక్కడ దారితప్పామో, ఎవరివల్ల దారితప్పామో, ఎటువంటి మోసాలకు గురిఅయ్యామో అవగతమవుతుంది. మళ్లీ మళ్లీ అటువంటి మోసాలకు లోనవకుండా జాగ్రత్తపడి సరైన దారిలో ముందుకు సాగడానికీ బాట తేటపడుతుంది. కోరవలసింది ఏమిటో, చేరవలసింది ఎక్కడికో విస్పష్టమవుతుంది. ఆ దిశలో చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ వ్యాస పరంపర.

No comments:

Post a Comment