Sunday, September 4, 2011

ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!

ఆంధ్ర, తెలుగు శబ్దములు రెండూ పర్యాయపదాలే!

ఆరవ ఆంధ్ర మహాసభ: నిజామాబాదు: 3 బహమన్‌ 1349 సాయంత్రం

శ్రీ

మందుముల నర్శింగరావు: అధ్యక్షుడు


అధ్యక్షోపన్యాసమునుండి

వుద్యమముయొక్క విస్తీర్ణత, విశాలతనుగురించి విమర్శించు సందర్భములో, విమర్శకుడు తెలంగానోద్యమము అనుటకు మారుగా ఆంధ్రోద్యమమను పేరిట ఎందుకు వ్యవహరింపబడవలయునని ప్రశ్నించవచ్చును. విమర్శకుడు తెలంగానా అను పేరును అనుశృతిగా వినుచున్నందున ఇట్టి ప్రశ్న సవ్యముగా అగుపడుచున్నది. ప్రశ్నకు సమాధానము చెప్పెదను. "ఆంధ్ర" అను పదము చాల పురాతనమైనది. ఋగ్వేదములోకూడ వాడబడినది. వింధ్య పర్వతములకు దక్షిణ దిగ్భాగములో నివసించుచుండిన జాతుల ప్రశంస సందర్భములో ఆంధ్రుల ప్రశంసకూడ వచ్చినది. ప్రదేశమునకు ఆర్యులు దండకారణ్యమనియు, రాకపోకల సౌలభ్యము లేక అరణ్యప్రదేశమైనందున అంధకార ప్రదేశమనియు, యీ భాగములో నివసించుచున్నవారిని ఆంధ్రులనియు వ్యవహరించిరని చరిత్రకారులు చెప్పుచున్నారు. హైందవుల పవిత్రమైన పురాణములగు రామాయణ, భారతాదు లలోకూడ ఆంధ్రుల ప్రశంస వచ్చినది.

వేదకాలములో, పురాణ కాలములో, యీ దండకారణ్య ప్రదేశములో నివసించువారు నాగరికత లేని జాతివారో ఏమో? కాని, అశోక సార్వభౌముని కాలములోమాత్రము, ఆంధ్రులు మహోన్నత నాగరికత జెందినట్లు చరిత్ర వుద్ఘోషించుచున్నది. అశోకుని పితామహుడును, మౌర్యవంశ మూలపురుషుడునగు, చంద్రగుప్తుని దర్బారునందుండిన మెగాస్తనీస్‌ వ్రాసిన వ్రాతలవల్ల ఆంధ్ర సామ్రాజ్యమునకు ముప్పది దుర్గములు, లక్ష పదాతులు, రెండువేల అశ్వ దళము, ఒక వేయి ఏనుంగులు వున్నట్లు తెలియుచున్నది.

అశోక మహారాజు కాలధర్మము నొందిన అచిరకాలములోనే ఉత్తర హిందూస్తానములో మౌర్యవంశము అంతమొందినది. అప్పుడు దక్షిణ హిందూస్తానములో ఆంధ్ర సామ్రాజ్యము విజృంభించినది. సామ్రాజ్యము తూర్పు సముద్రమునుండి పశ్చిమ సముద్రమువరకు వ్యాపించి, నాలుగు వందల సంవత్సరములవరకు దక్షిణ హిందూస్తానమునేకాక, ఉత్తర హిందూస్తానములో పెద్ద భాగమును తన పరిపాలనలో యిమిడ్చుకొనినది. కాలమున దక్షిణ హిందూస్తానము మహోన్నత అభ్యుదయము గాంచినది. సముద్రము దాటిన ప్రదేశములతో వర్తక వ్యాపార సంబంధము కలిగించుకొనుటతో ఆంధ్రులకు ప్రత్యేక విశేషత కలిగినది. ఆంధ్రులు ఓడల నిర్మాణములోను, వానిని నడిపించుటలోను ప్రఖ్యాతి బడసిరి. అప్పటి చరిత్రకారులు వ్రాసిన వ్రాతలవల్ల దక్షిణ హిందూస్తానము లోని యీ ఆంధ్రులే క్రీ. శ. లో పూర్వద్వీపములకు వలసపోయి, యావద్భారతదేశమునకై మార్గదర్శులై మలయా, జావా, సుమత్రా, బర్మా, సియాం మరియు ఇండోచైనాలో స్థిరనివాస మేర్పరచుకొని భారతీయ సభ్యత, భారతీయ సాహిత్యము, చిత్రకళలు మున్నగువానిని ఆయాప్రదేశమలలో వ్యాపింప జేసిరి.

మహాశయులారా! పురాతన చారిత్రక గాథలతో తమ కాలయాపనము చేయ నుద్దేశించలేదు. కాని పూర్వమొకసారి ఆంధ్ర దేశముతో వ్యవహరింపబడుచున్న దేశము తెలంగానా [గా] ఎట్లు పరివర్తనము పొందినదో చెప్పదలచినాను. చంద్రవంశరాజగు కళింగరాజు యీ దేశమునకు రాజు కావడముతోనే [యిది] కళింగ దేశమని వ్యవహరింపబడుచు వచ్చెను. క్రమక్రమేణ 'కళింగము' 'త్రికళింగము' గా వ్యవహరింపబడెను. త్రికళింగము మారి త్రిలింగమైనదని చరిత్రకారులు చెప్పుదురు. చాళుక్యుల, కాకతీయుల నాటి చారిత్రక నిదర్శనములవల్ల త్రిలింగ దేశమని వాడబడినట్లు తెలియుచున్నది. ఇట్లు ఆంధ్ర దేశము, త్రిలింగ దేశము పర్యాయపదములుగా వ్యవహరించబడుచు వచ్చెను. ఆంధ్ర పండితుల అభిప్రాయముప్రకారము త్రిలింగములగు శ్రీశైలము, భీమేశ్వరము (లేక ద్రాక్షారామము), కాళేశ్వరముల లోని మధ్య ప్రదేశము త్రిలింగ దేశమని తెలియుచున్నది. ప్రదేశము యొక్క జనుల భాష తెలుగు. భాష ఆధారమున తెలుగు దేశమైనది. కాన తెలుగు దేశము, ఆంధ్ర దేశము ఏకార్థమును తెలుపునవి. "తెనుగు" "ఆంధ్రము" పర్యాయ పదములుతెనుగు పండితులు గ్రాంథిక భాషలో "ఆంధ్ర" పదము వుపయోగపరచితే, సామాన్యులు వ్యవహారిక భాషలో "తెనుగు" పదము ఉపయోగించుచుందురు. తెనుగు, ఆంధ్రముతెనుగు దేశము, ఆంధ్ర దేశములను పదములలో వ్యత్యాసము ఏమియు లేదు. ఉద్యమమునకు జాతి, సంతతి, మతములతో సంబంధము లేదు. దేశముననే జనించి, ఇక్కడనే జీవనోపాయముల సంపాదించుకొని, తుదకు యిక్కడనే మృతి నొందనున్న వారైనందున వారందరు ఆంధ్రులే. వంగదేశములో నుండువారు వంగీయులు, సింధుదేశములో నుండువారు సైంధవులు, పాంచాలదేశములో నుండువారు పాంచాలీయులని అనుట లేదా? అటులనే ఆంధ్రదేశములో నుండువారిని ఆంధ్రులనుటలో దోషమేమి? ఆంధ్రులని ఉచ్చరించినమాత్రమున భయమొందుట ఎందులకు? యుద్యమము పవిత్రమైన ఒక సూబాకు సంబంధించిన ఉద్యమము. సూబాలో నివసించు యావన్మానవకోటి అభ్యుదయమునకై యేర్పడినది.

No comments:

Post a Comment