అన్యాయకాలంబు దాపురించిందిపుడు!
అన్యాయ కాలంబు దాపురించిందిపుడు
అందరము మేలుకోవాలండి
మాన్యాలు భోగాలు మనుజులందరి కబ్బు
మార్గాలు వెతకాలి రండి –
ఏటి పొడుగున దున్ని యెరువేసి నీరెట్టి నూర్చి
పండించేది మనమంతా
గోటు చేయుచు బూతుకూతలను కూసి
కలకొట్టి కొనుపోవుటింకొక రొంతా
పొగలలో, మరలలో పొగిలి పొగిలి సరకు
పుట్టించి యిచ్చేది మనమంతా
తొగరు వాతెర సొగసు తొయ్యలుంతో కలిసి
విరగబడు చుండు టింకొకరొంతా
కూలి చాలక, కడుపు మాడుతూ గుహలలో
కుందుతూ కుళ్లడము మనమంతా
గాలి మేడలలోను కమ్మతావులలోను
గర్వముగ భోగమింకొకరొంతా?
[మొట్టమొదట చిత్రగుప్త లో అచ్చయి, 1938 లో రాజమండ్రి బుక్సెల్లర్స్ వారు ప్రకటించిన జాతీయ గీతముల పుస్తకంలో ప్రచురించబడిన గరిమెళ్ళవారి విప్లవ గీతం] {courtesy: B. Krishna Kumari, పిడుగుల జడి గరిమెళ్ళ [గరిమెళ్ళ సాహిత్యం – వెలుగునీడలు], బి. కె. బుక్స్, విజయవాడ, జూన్ 1993.}
* * * * *
కర్షక రాజ్యం
కర్షకులారా లెండి, మన కాంగ్రేసునకు పదండి!
సంఘర్షణ చేయండి – మన స్వాతంత్ర్యము చాటండీ //కర్షకులారా//
పండించుట మనమైతే – బాగా పండెడిది పుడమియైతే ఈ
దళారీ జమీన్దార్ల పెద్దతనమది మన కిక యేలా? //కర్షకులారా//
అందర మొకటవుదామోయి – దీర్ఘ యాత్ర లెన్నో చేదామోయి
మందుల మాట వినద్దోయి - రాజ్యం మనదవాలీ ప్రొద్దోయి //కర్షకులారా//
* * * * *
జన్మభూమిని
జనులెల్లరికి నేను జన్మభూమినిరా
ఛేదించవయ్యా అసమాన భూతముల
ఆనందమున నన్ను అలరించువారు
మీరలే మీరలే మేలుకొను డింక
ఆసపోతులకంత అధికారమేలా
మోసకృత్యంబులందు మోహంబులేలా
పెద్దలకు లాభాలు బాంకుల్ల నిండా
పేదలకు దు:ఖాలు హృదయాల నిండా
నీది నాదను అన్యాయంబు వీడు
మనము మనదనెడు సద్గానంబు పాడు
మీ ఇల్లు మీ సుఖము మీ ధనముతోనె
మేదినీ తలమెల్ల మెరయుచుండాలి
సైన్యాలు వార్నెపుడు రక్షించ వలెనో
కర్షకుల కార్మికుల శిక్షించవలెనా?
భాగ్యవంతుల వైభవంబు లంటె నాకు
బాధించు వ్రణమని బాగా తెలియండి
కర్షకులు కార్మికులు కలవండి వేగ
వార్షికోత్సవములు జరపండి వేగ
ఆనందమున నన్ను అలరించు వారు
మీరలే మీరలే మేలుకొనుడింక!
* * * * *
మహాత్మా గాంధీ
వినురా! నా ప్రియ సహోదరుడా సోదరుడా
భారత భావి భాగ్యశేఖరుడా!
గాంధి చెప్పిన త్రోవ నడురా! దేశ - ఘనుల పాలన మొక్క –
గడియ చేపడురా //వినురా నా ప్రియ సహోదరుడా//
సామాన్యుడనుకోకు మతని దైవ సంకల్పముర వాని –
జనన మీయవని //వినురా నా ప్రియ సహోదరుడా//
కాయంపు రుచి యణగ ద్రొక్కి – ఆత్మ కళ చేతపట్టెను
కడగండ్ల దక్కి //వినురా నా ప్రియ సహోదరుడా//
పరమ తపమున కాని రాదు – కార్యపరత మాత్రనె దాని –
గాంచె నీ జోదు //వినురా నా ప్రియ సహోదరుడా//
కత్తిని నిరసించు సతతము – స్వస్థ చిత్తవృత్తియె వాని –
చేతి యాయుధము //వినురా నా ప్రియ సహోదరుడా//
చేతితో నూలు వడుకుమురా! జరి – నేత గుడ్డలు కట్టి –
నిరతముండుమురా //వినురా నా ప్రియ సహోదరుడా//
కోర్టు సంబంధము విడురా! ఆ కూపంబులోపల –
కూలిపోకుమురా //వినురా నా ప్రియ సహోదరుడా//
నిమ్నజాతుల నెత్తుమోయి – వారు నీరసించిన యెడల –
నిక నీకు గోయి //వినురా నా ప్రియ సహోదరుడా//
కాంగ్రెసు కమిటీలు పెట్టు – దేశ గతి చెప్పి ప్రజనెల్ల
కలవరము పెట్టు! //వినురా నా ప్రియ సహోదరుడా//
* * * * *
మహాత్ముని సందేశము
వినుడీ! వినుడీ! ఓ జనులార! విని –
ధన్యత నొందుడి – జనులారా
పతిత పావనుడు – పురుషోత్తముడగు
గాంధి మహాత్ముని – ఘనసందేశము //వినుడీ వినుడీ//
ఖద్దరు కట్టుడి జనులారా మన
కలిమి బలములది జనులార !
రాటము గొని యారాటముడిగి పో
రాటము లేకను పొంది సుఖాంతము //వినుడీ వినుడీ//
గ్రామోద్ధరణకు జనులారా ఇక గడగుదమండీ జనులారా!
నిప్పచ్చరముల నిలయములాయెను పడిన వృత్తులను
పైకి తీయుదము //వినుడీ వినుడీ//
పంచమ జాతిని జనులారా మన పక్షము గొందము జనులారా
మతమనగను మన యాత్మోన్నతికే – మానవైక్యతను
మాప నేర్పడదు //వినుడీ వినుడీ//
చేతిపనులుడుగ – జనులారా! మన ఖ్యాతి నశించెను జనులారా!
హస్త నిపుణతను ధ్వంసము చేసిన – పరుల చేతలకు
బానిసలగుదుము //వినుడీ వినుడీ//
శాంతము తగునో జనులారా – అది శ్రేయమన్నిటికి జనులారా!
ప్రేమ చేతనే – పగతుని గెలుతుము – రక్తపాతములు
రాక్షస మతమగు //వినుడీ వినుడీ//
సత్యమహింసలు జనులారా! మన శస్త్రాస్త్రములో జనులారా!
సమయము కనుగొని – సత్యాగ్రహమున స్వాతంత్ర్యంబును
సంపాదింతుము //వినుడీ వినుడీ జనులారా//
* * * * *
స్వరాజ్యము
అన్నలార రండీ మన అమ్మ నుడి వినండి ముం
దున్న పని కనండి – ఏమన్న జడియ కండి //అన్నలార//
పర ప్రభుతను ద్రోల – యల – బాధ్యత సుధ గ్రోల
వర సిరులను నేల – యనువైన యదను చాల //అన్నలార//
ఆంగ్ల బిరుదు మాని – అల ఆంగ్ల కోర్టు మాని
ఆంగ్ల సేవ మాని – మరి ఆంగ్ల ప్రభుత మాని //అన్నలార//
ఆంగ్ల విద్య మాని – అల ఆంగ్ల దుస్తు మాని
ఆంగ్ల కల్లు మాని – అల ఆంగ్లేయత మాని //అన్నలార//
కొట్టతిట్ట వద్దు మరి – గొణగ సణగ వద్దు
పట్టుదలను బూను – డల ప్రభుత నెల్ల మాను //అన్నలార//
కత్తిభయము మాని – పశుశక్తి నూత మాని
ఆత్మబలము బూని – గైకొనుడి మాతృముక్తి //అన్నలార//
కాంగ్రెసు మన తల్లి – కాంగ్రెసె మన గురువు
కాంగ్రెసె మన దైవంబును – దాని మాట వినండి //అన్నలార//
* * * * *
No comments:
Post a Comment