Sunday, October 30, 2011
Sunday, October 23, 2011
ఆంధ్ర ప్రదేశమంటే మహా తెలంగాణమే
ఆంధ్ర ప్రదేశమంటే మహా తెలంగాణమే నన్న తృప్తి, నమ్మకాలతో శ్రీ బి. నరసింహారావు అనే రచయిత రాసిన గోలకొండ పత్రిక [26-3-1956] లో ప్రచురితమైన ఈ కింది వ్యాసాన్ని శ్రద్ధతో చదవ వల్సిందిగా పాఠకులకు - ముఖ్యంగా వేర్పాటువాద ఉన్మాదంతో ఊగిపోతున్న తప్పదారి పట్టిన తెలంగాణా సోదరీసోదరులకు మా విజ్ఞప్తి.
గోలకొండ పత్రిక, 26 మార్చి 1956, పుట 2:
ఆంధ్ర జాత్యవతరణ
- బి. నరసింహారావు.
తెలుగు వెలుగుతో భారతావనిని సుప్రకాశితం చేసిన వాళ్లల్లో తెలుగువాళ్ళు అపూర్వులు; అద్వితీయులు. భారతీయ సంస్కృతిని, భారతీయ నాగరికతను, హిందూ స్వాతంత్ర్యాన్ని కాపాడుతూ చంద్రగుప్తుని కాలంవరకే ప్రజాస్వామ్య సిద్ధాంతాలపై ప్రభుత్వ మేర్పరచి శబాసనిపించుకున్న తెలుగువాళ్లకు ఈ స్వతంత్ర భారతంలో తిరిగి 1953 న ఆ మహదవకాశం లభించడం నిజంగా గర్వనీయాంశం; సందేహించాల్సిన అవసరం లేదు.
దురదృష్టంవల్ల మాతృస్థానంతో వేరవడం, అరవలతో కొంత పొత్తు కలవడం వల్ల తెలంగాణా దివ్యజ్యోతుల [ని] ర్ణీత ధర్మాన్ని విస్మరించడం రెండు కోట్ల తెలుగువాళ్ళకు ఘటించింది. మాతృస్థానం నుండి వీచిన జాతీయ వాయువువల్ల యేర్పడిన వ్యామోహం నిర్మూలమవడం నిశ్చయం.
ఆంధ్రరాజ్యావతరణానికి అనేకులు అనేక కారణాలు నిశ్చయించారు. అమరజీవి ఆత్మాహుతి అని కొందరనుకుంటే, చేతులార ముగ్గుబోసి కట్టిన మదరాసు నగరవ్యామోహాన్ని వదలుకోవడమని కొందరనుకుంటున్నారు. భారతీయ స్వాతంత్ర్య సమయంలో అసమానమైన త్యాగానికి అగ్రగాములైనందున అని మరి కొందరనుకుంటూంటే, యింకొకరు యింకో విధానం తేల్చేస్తున్నారు. మొత్తంమీద రాజ్యావతరణంతో అప్రతిభ షేముషీ విజ్ఞానాన్ని అసమానమైన నిపుణతని అమోఘమైన కార్యసాధనా పటిమని ప్రదర్శింపజేస్తూ అఖిల భారతాభ్యుదయానికి ముందు అడుగు వేశే నిర్ణీత బాధ్యతని పొల్లుపోకుండా తెలుగువాళ్లు సార్థక పరచాలి. (ఇంకా వుంది)
Friday, October 21, 2011
హైదరాబాద్ రాజధాని కాకుంటే విశాలాంధ్ర వద్దు: శ్రీ బూర్గుల రామకృష్ణారావు ప్రకటన గోలకొండ పత్రిక, 22-11-1955
గోలకొండ పత్రిక, 22-11-1955
హైద్రాబాద్ రాజధాని కాకపోతే
విశాలాంధ్ర వద్దు
హైద్రాబాద్ ముఖ్యమంత్రి ప్రకటన:
తిరిగి విశాలాంధ్రవాదులకు కొత్త సమస్య
మైసూరు, నవంబరు 21:
హైద్రాబాద్ ముఖ్యమంత్రి డా. బూర్గుల రామకృష్ణ
రావుగారు ఇక్కడ నిన్న ఒక ప్రకటన చేస్తూ
ఎట్టి పరిస్థితిలో తమకు విశాలాంధ్ర అక్కరలేదో
తెలియజేశారు.
తాను హయిద్రాబాద్ రాజధాని అవుతుందంటే్
విశాలాంధ్ర కావాలన్నానుగాని, లేకపోతే
విశాలాంధ్ర కావాలనేవాడిని కానని శ్రీ రావు
గారు స్పష్టపరిచారు.
బళ్ళారి తాలూకాలకోసం ఆందోళన చేయవద్దనీ, బళ్ళారికోసం కన్నడిగులు ఆందోళన చేస్తే కోలారు కోసం ఆంధ్రులు ఆందోళన చేయవద్దా అని డా. బూర్గుల రామకృష్ణ రావుగారన్నారు. రెండు కర్నాటక రాష్ట్రాల వాదననుకూడ ఆయన ఖండించారు.
డా. రామకృష్ణరావుగారి ఈ ప్రకటనలో తెలంగాణలోని విశాలాంధ్ర వ్యతిరేకతకుగల బల ప్రభావం కన్పిస్తున్నది.
ఇటీవలగా కర్నూలులో ప్రారంభమౌతున్న విశాలాంధ్ర వ్యతిరేకోద్యమంవల్ల కూడ తిరిగి ఆంధ్ర రాజధానీ సమస్య ఉత్పన్నం కాగలదని తెలుస్తున్నది. కర్నూలునుండి రాజధాని తరలించడానికి రాయలసీమ ప్రజలు అంగీకరించడం లేదు. హైద్రాబాద్ రాజధాని కాకున్నట్లయితే విశాలాంధ్రమే వద్దనే వాడినని హైద్రాబాద్ ముఖ్యమంత్రి ప్రకటించడంవల్ల తిరిగి విశాలాంధ్ర వాదులకుకూడా ఒక సమస్య ఉత్పన్నమైందనీ అభిజ్ఞవర్గాలవారంటున్నారు!
* * * * *
Thursday, October 20, 2011
హైదరాబాద్ రాజధాని కాకుంటే విశాలాంధ్ర వద్దు: శ్రీ బూర్గుల రామకృష్ణారావు ప్రకటన గోలకొండ పత్రిక, 22-11-1955
విశాలాంధ్ర ఏర్పాటుపై ప్రధాని నెహ్రూ 5 మార్చి 1956 నిజామాబాద్ ప్రకటన: విశాలాంధ్ర, 7 మార్చి 1956.
విశాలాంధ్ర 7 మార్చి 1955
విశాలాంధ్ర నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం
నిజామాబాద్ సభలో ప్రసంగిస్తూ ప్రధాని నెహ్రూ ప్రకటన
ఉభయప్రాంతాల ప్రయోజనాల రక్షణకు
రెండు ప్రాంతీయ కౌన్సిళ్లు ఏర్పడతాయని వెల్లడప్
నిర్ణయాన్ని విశాలాంధ్రవాదులు, తెలంగాణ వాదులు ఆమోదించారనికూడ స్పష్టీకరణ
సుభాష్ నగర్ (నిజామాబాద్), మార్చి 5 : తెలంగాణా, ఆంధ్ర ప్రాంతాలను కలిపి ఒకే రాష్ట్రంగా చేయాలని సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని యీ వేళ సాయంత్రం ఇక్కడ జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభలో ప్రధాని నెహ్రూ ప్రకటించారు. ఈ సమస్యనంతటినీ చాల సార్లు, జాగ్రత్తగా ఆలోచించిన మీదట ఆంధ్ర, తెలంగాణాలను వేరు వేరు రాష్ట్రాలుగా ఏర్పర్చడం మంచిది కాదన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందని తెలిపారు.
ఉభయప్రాంతాల ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకుగాను రెండు ప్రాంతీయ కౌన్సిళ్లు ఏర్పడతాయనికూడ ఆయన చెప్పారు.
ప్రధాని నెహ్రూ భారత సేవక్ సమాజ్ నాలుగవ వార్షిక సదస్సుకు హాజరయ్యేందుకుగాను నేడిక్కడకు వచ్చిన సందర్భంలో ఏర్పాటు చేయబడిన బహిరంగసభలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రకటించారు.
ప్రాంతీయ కౌన్సిళ్లు ఆయా ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలనుగురించీ, విద్యాసౌకర్యాలనుగురించీ శ్రద్ధ తీసుకుంటాయని ఆయన అన్నారు. ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగాలను సమకూర్చే విషయంలోకూడా ఈ ప్రాంతీయ కౌన్సిళ్లు తగిన జాగ్రత్తలను తీసుకుంటాయన్నారు.
ఆంధ్ర - తెలంగాణాలను రెండు రాష్ట్రాలుగా ఉంచాలా లేక ఒకే రాష్ట్రంగా చేయాలా అన్న విషయాన్ని గురించి దీర్ఘంగా చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకోబడిందని ప్రధాన మంత్రి తెలిపారు.
నిర్ణయాన్ని అమలు జరిపేందుకు కృషి
ఈ నిర్ణయాన్ని తీసుకొన్నప్పటినుండి ఇటు విశాలాంధ్ర కావాలనే వారూ, అటు ప్రత్యేక తెలంగాణా కావాలనే వారూ నిర్ణయాన్ని అమలు పరచడానికి ఆమోదించి, అందుకోసం కృషి సాగిస్తున్నారనికూడ ప్రధాని నెహ్రూ వెల్లడించారు.
ప్రధాని నెహ్రూ ఈ వేళ ఉదయం 10-30 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీనుండి హైద్రాబాద్ చేరుకున్నారు. వెంటనే ఆయన వంద (100) మైళ్ల దూరంలోవున్న నిజామాబాద్కు ప్రత్యేక రైలులో బయలుదేరి వచ్చారు.
రేపుదయం శ్రీ నెహ్రూ ఆచార్య వినోబాభావేను కలుసుకొనేందుకు ఇక్కడనుండి మాధవరావుపల్లి వెడతారు.
ప్రధాని నెహ్రూ పంచవర్ష ప్రణాళికలనుగురించి మాట్లాడుతూ ప్రజలంతా కలిసి పనిచేయా లన్నారు. అంతేకాని దేశంలో పెద్ద రాష్ట్రా లుండాలా, లేక చిన్న రాష్ట్రాలుండాలా అనే విషయమై పోట్లాడు
కోరాదన్నారు.
రాష్ట్రాల పునర్నిర్మాణ సమస్యపై ఇటీవల బొంబాయి, ఒరిస్సాలలో జరిగిన సంఘటనలను గురించి శ్రీ నెహ్రూ ప్రస్తావించి, అలాంటి ఘటనలు మన దేశాన్ని బలహీనపరచడమేగాక, మన జాతి కంతటికి చెడ్డపేరు తెచ్చాయన్నారు.
రాష్ట్రాల కమిషన్ సమర్పించిన నివేదికనుగురించి శ్రీ నెహ్రూ మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం విభజించ బడరాదనేదే తన వ్యక్తిగత అభిప్రాయమని పునరుద్ఘాటించారు. కాని కమిషన్ హైద్రాబాద్ విభజించ బడాలని సిఫార్సు చేసినప్పుడు " అది దేశ ప్రయోజనాలకు అనుగుణ్యమైతే కమిషన్ సిఫార్సుకు తానెందుకు వ్యతిరేకంగా వుండాలని" భావించా నన్నారు.
ఆయన ఇంకా ఇలా అన్నారు:
" రాష్ట్రాల కమిషన్ సిఫార్సుల ప్రకారం హైదరాబాదులోని మరాఠీ ప్రాంతాలు మహారాష్ట్రంలోనూ, కన్నడ ప్రాంతాలు కర్ణాటక రాష్ట్రంలోనూ కలిసిపోతాయి. ఇక మిగిలింది తెలంగాణ సమస్య. అయిదేళ్ళ తరువాత తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కలిసిపోవచ్చని కమిషన్ సిఫార్సు చేసింది.
"కొందరు విశాలాంధ్ర ఏర్పడాలని కోరారు. మరికొందరు ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కావాలన్నారు. విశాలాంధ్ర ఏర్పడితే, ఆంధ్రులు వచ్చేసి ఇక్కడి భూములను చేజిక్కించుకుంటారనీ, వారు విద్యా విషయికంగా అభివృద్ధి పొందినవారు కాబట్టి తెలంగాణా స్థానిక ప్రజలకన్నా ఎక్కువ సౌకర్యాలు సంపాదిస్తారనీ, ప్రత్యేక తెలంగాణా వాదులు వాదించారు.
శ్రద్ధగా ఆలోచించిన మీదట జరిగిన నిర్ణయం
"ఈ సమస్య నంతటినీ చాల జాగ్రత్తగా పరిశీలించాము. ఉభయ పక్షాలవారి వాదనలూ బలమైనవే కాబట్టి చాలసార్లు ఇది చర్చకు వచ్చింది. అయిదేళ్ళవరకు సమస్యను వాయిదావేసి ఉంచడం మంచిది కాదని కొంద రన్నారు.
"అంతా చాల శ్రద్ధతో పరిశీలించిన మీదట, పెద్ద పెద్ద రాష్ట్రాలను నిర్మించాలని ప్రస్తుతం ఏర్పడివున్న కొత్త వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకున్న మీదట, ఆంధ్ర తెలంగాణాలను వేరు వేరు రాష్ట్రాలుగ ఏర్పరచడం మంచిది కాదన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చింది."
పెద్ద రాష్ట్రంగా ఏర్పరిచిన తరువాత తెలంగాణా ప్రజల భయ సందేహాలను తొలగించడం ఎలా అన్న సమస్యను గురించికూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించిందన్నారు.
"ఆంధ్ర తెలంగాణాలను కలిపి ఒకే రాష్ట్రంగా ఏర్పరచాలన్న నిర్ణయం జరిగింది. దాన్ని అమలు జరిపేందుకు సన్నాహాలుకూడ సాగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ ఈ నిర్ణయాన్ని స్వీకరిస్తారని ఆశిస్తున్నాన" ని నెహ్రూ అన్నారు. ఆంధ్ర తెలంగాణాల విలీనీకరణను ప్రజలందరూ వినియోగించు కోవాలన్నారు. ప్రజలందరి ముందున్నది భారత దేశాని కంతటికీ సంబంధించిన సమస్య కాబట్టి, ఎవ్వరూకూడ ఈ యా ప్రదేశాల దృష్టితో వ్యవహరించ కూడదన్నారు. చరిత్రను నిర్మించేందుకు పూనుకున్న ప్రజలు విశాలహృదయులు కావాలన్నారు. సంకుచితతత్వాలను విసర్జించుకొని, తగాదాల నన్నిటినీ విస్మరించాలన్నారు. చిలిపి బుద్ధులవారికి దేశంలో స్థానం లేదన్నారు.
నెహ్రూ తన ప్రసంగంలో యింకా యిలా అన్నారు:
"భారతదేశంలోనూ, యావత్ప్రపంచంలోనూ చరిత్రాత్మకమైన ఘటనలు జరుగుతున్న సమయంలో మనం జీవించుతున్నాం. మన దేశాభ్యుదయంకోసం భారతీయులమంతా కలసి పనిచేయడ మవసరం. గాంధీజీ మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు. కాని ఇంకా అనేక సమస్యలు పరిష్కరించుకో వలసివుంది. నవ భారత నిర్మాణంలో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
"హిమాలయ పర్వతాలనుండి దక్షిణాదివరకూ అనేక ప్రాంతాల్లో అనేకమంది ప్రజలు వివిధభాషలను మాట్లాడుతూ, వివిధ మతాలను విశ్వసించుతున్నారు. ప్రతి ఒక్కరూ భారత దేశంలోని భాగమే. భారత దేశం అందరిదీ. ఢిల్లీ నాదనీ, నిజామాబాద్ మీదనీ చెప్పుకోవడం పొరపాటు. మీతోబాటు నాకుకూడ నిజామాబాద్పై సమానమైన హక్కున్నది. అలాగే మీకూ ఢిల్లీపై నాతోపాటు హక్కున్నది. ఈ రాష్ట్రం నాది, ఆ రాష్ట్రం మీది అనేవారు భారత దేశం అంతా ఒకటే నన్న విషయాన్ని మరచిపోతున్నారు. ఈ దేశంలో వున్న వారంతా ఒకే కుటుంబానికి చెందినవారని భావించుకోవాలి. గాంధీజీ నాయకత్వాన మనం స్వాతంత్ర్యాన్ని సంపాదించు కున్నప్పటికీ దారిద్ర్యం మొదలుగా గల సమస్యలను ఇంకా పరిష్కరించు కోవలసి వుంది. అందుకే ఈ పంచవర్ష ప్రణాళికలను అమలు జరుపుతున్నాం. ఇందుకు ప్రజలంతా సహాయపడాలి."
* * * * *