Thursday, October 31, 2013

విశాలాంధ్ర కోసం, భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం కోసం 1953 లోనే హైదరాబాదు కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం


విశాలాంధ్ర కోసం, భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం కోసం


1953 లోనే హైదరాబాదు కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం


విశాలాంధ్ర కోసం, భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం కోసం, హైదరాబాదు రాష్ట్రంలోని  మూడు భాషాఖండాలనూ పొరుగు భాషారాష్ట్రాల్లోని సంబంధిత భాషా ప్రాంతాల్లో కలిపివేయాలని 1953 లోనే హైదరాబాదు కాంగ్రెస్ కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని మరువరాదు. ఈ విషయమై అప్పటి హైదరాబాదు కాంగ్రెస్ అధ్యక్షుడు,ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు అయిన శ్రీ స్వామీ రామానంద తీర్థ తన 'స్మృతులు ' లో ఇలా రాసారు:


"హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సర్వసభ్యసమావేశంలో హైదరాబాద్ స్టేట్ భాషాప్రయుక్తంగా ఇతర రాష్ట్రాలతో విలీనం కావాలని తీర్మానించింది. ఆ తీర్మానం ఏకగ్రీవంగా జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ కార్యదర్శుల్లో ఒకరైన శ్రీమన్నారాయణ్ ఆ నిర్ణయం జరిగినప్పుడు సభలో వున్నారు. ఆ తీర్మానం యొక్క సారాంశం ఇంగ్లీషు వార్తాపత్రికల్లోకూడ ప్రకటితమైంది. అధినివేశ రాజ్యాల (కామన్‌వెల్త్ నేషన్‌స్) ప్రధానమంత్రుల సమావేశానికై ఇంగ్లండు వెళ్లిన మన ప్రధానమంత్రి జవహర్‌లాల్‌కు ఆ రిపోర్టు విచారం కలిగించింది. ఆయన తనకు దానినిగురించిన వివరాలు తెలపవలిసిందనీ, తీర్మానపు పూర్తి పాఠం పంపవలిసిందనీ కోరుతూ వార్తాపత్రికను పంపించారు. నేను సమావేశం నిర్ణయించిన తీర్మానపు కాపీ పంపించాను. అది పరిశీలించి ఆయన అక్కడ వార్తాపత్రికలలో తాను చదివిన వార్తలకంటే కొంత భిన్నంగా వుందనీ, తాను ఈ సమస్యను గురించి మరొక విధంగా ఆలోచించాలని భావిస్తున్నట్లూ తెలియజేసారు.

మా నడుమ ఈ చర్చలకు కారణమైన తీర్మానపు పూర్తి పాఠం ఈ కింద పొందుపరుస్తున్నాను :

"ఆంధ్ర రాష్ట్రపు ఏర్పాటు, భారత జాతీయ కాంగ్రెస్ నానాల్‌నగర్ సమావేశంలో చేసిన తీర్మానాన్ననుసరించి తీసుకున్న చర్యలలో మొదటి అడుగు (దశ ) అని హైదరాబాదు కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ భావిస్తున్నది. 16 మే 1953 నాడు వర్కిన్‌గ్ కమిటీ (కార్యవర్గము ) చేసిన నిర్ణయానికీ ,  ప్రధానమంత్రి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను గురించి పరిశీలించేటందుకు ఆంధ్ర రాష్ట్రపు ఏర్పాటు తర్వాత ఒక ఉన్నతాధికార కమిషన్‌ను నియమిస్తామని ప్రకటిస్తూ చేసిన ప్రకటనకూ ఈ కమిటీవారు స్వాగతపూర్వకంగా హర్షం వెల్లడిస్తున్నారు. ఆ కమిషన్ నియామకాన్ని కొంతముందుగానే చేయడంవల్ల కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్లాను తయారుచేసి సక్రమంగా రూపొందించేటందుకూ, సాధ్యమైనంత త్వరగా అమలుచేసేటందుకూ అనుకూలంగా వుంటుందనే సూచనను భారత ప్రభుత్వం పరిశీలించగలదని ఈ కమిటీవారు ఆశిస్తున్నారు. మూడు భాషాప్రాంతాలు కూడివున్న హైదరాబాద్ స్టేట్ మనుగడ, దక్షిణ హిందూదేశంలోని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణతో ముడిపడివుంది. నానాల్‌నగర్ కాంగ్రెస్ తీర్మానంలో వివరించిన వివిధ అంశాలకు అనుగుణంగా ఆయా భాషాప్రాంతాలను వాటికి ఇరుగుపొరుగుననే వున్న ఆయా భాషాప్రాంతాలతో విలీనం చేయవలిసివుంటుందనే నిశ్చితాభిప్రాయాన్ని ఈ ప్రదేశ్ కాంగ్రెస్ వెల్లడిస్తున్నది. ఈ అభిప్రాయాలకు సంబంధించిన ఆచరణ కార్యక్రమంగా హైదరాబాదు కాంగ్రెస్ కార్యవర్గానికి ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసేందుకు, ఆ ఉపసంఘంవారు ఈ విషయాన్ని సమగ్రంగా చర్చించి, దీనికిసంబంధించిన వివరాలన్నింటినీ సేకరించి, ఉన్నతాధికార కమిషన్‌కు నివేదించి సాధికారిక బాధ్యతను వహించేటందుకు అధికారమిస్తున్నారు."
["హైదరాబాదు స్వాతంత్ర్య పోరాటం: అనుభవాలు, జ్ఞాపకాలు " - స్వామి రామానంద తీర్థ [ఆంగ్లము], హరి ఆదిశేషువు [తెలుగుసేత] - స్వామీ రామానంద తీర్థ స్మారక సంఘం ప్రభాత ప్రచురణ సమితి, 1984, పుటలు 378-379]

No comments:

Post a Comment